Adsense

Thursday, October 6, 2022

అశోకవనంలో సీత

 


తల వంచుకుని కన్నీరు కారుస్తూ ఉన్న సీతతో "ఆ రాజ్యభ్రష్టుణ్ణీ, అల్పాయుష్కుణ్ణీ రాముణ్ణి తలచుకుని శోకించడం అవివేకం. ఈ జన్మలో నువ్విక రాముణ్ణి చూడలేవు. కలలోకి కూడా ఆ రాముడు రాడు, రానివ్వను.’’ అన్నాడు రావణుడు. సీత దుఃఖం కట్టలు తెంచుకుంది. భోరుమందామె. ‘‘దేవాతిదేవతలు కూడా ఈ లంకకు రాలేరు. నా కౌగిట ఉన్న నిన్ను విడిపించలేరు. ఏ జన్మలో ఏ పాపం చేశావో, ఆ పాపం అంతా దండకలో ఆ రాముడితోనే పోయింది. ఇక నీ సుకృత ఫలం ఈ రావణుడు, నీ దాసుడుగా నీ ముందు నిలిచాడు. కరుణించి, భర్తగా వరించి, ఈ సమస్త సంపదలకూ, ఈ రాజ్యానికీ, నా పత్నులకూ దేవేరివై పాలించు. రా.’’ అన్నాడు రావణుడు. ‘‘ఛి’’ అసహ్యించుకుంది సీత.

‘‘ఈ ఛీత్కారాలు, సరససుందరలైన మాకు సత్కారాలతో సమానం. సుందరీ! నీ పాదాల ముందు తల వంచి మరీ ప్రార్థిస్తున్నాను, నన్ను వరించు. ఈ కింకరుణ్ణి కరుణించు.’’ అడిగాడు రావణుడు. అతన్ని కనీసం కన్నెత్తి చూడలేదు సీత. ‘‘సీతా! నన్ను కావాలని కోరిన సుందరీమణులను నేను కాదన్న పాపమేమో! నువ్వు నన్ను కాదంటున్నావు. కాని నా కోరిక నువ్వు తీర్చక తప్పదు. నన్ను వలచి వరించక తప్పదు. ఇది హెచ్చరిక కాదు. వేడుకోలు. నిజం సీతా! నేను ఏ సుందరినీ ఇంతలా మోహించి, మోకరించి, వేడుకున్నది లేదు. అది నీకే చెల్లింది.’’ అన్నాడు రావణుడు.

సీత పెదవి విప్పి పలుకలేదు. రావణునికి సహనం నశించింది. ‘ఛత్తెరి’ అన్నాడు. కాలెత్తి బలంగా నేలను తన్నాడు. ‘‘తీసుకు వెళ్ళండిక్కణ్ణుంచి.’’ అన్నాడు. రాక్షసస్త్రీలు సీతను తీసుకుని, పరిగెత్తారక్కణ్ణుంచి. యథాస్థానానికి చేర్చారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. అభ్యంగం ఆచరించి మళ్ళీ సీతను సమీపించాడు రావణుడు. ‘‘నిన్నటి నా మాటలు నీకు మనస్తాపాన్ని కలిగించాయేమో! కలిగిస్తే క్షమించు సుందరీ. మణులు, మణిక్యాలు, బంగారాలు, బాచారాలు ఇవేవీ నీకు సరితూగవని నాకు తెలుసు. నీకు సరితూగేది నా బలపరాక్రమాలు ఒక్కటే అవునా దేవీ?’’ అన్నాడు రావణుడు.

అంతలో చల్లగా గాలి వీచింది. ఎండిన గరికపోచ ఒకటి ఎగిరి వచ్చి సీత ఒడిలో వాలింది. దానిని తీసుకుని చూసింది సీత. నవ్వుతూ రావణునికి దానిని చూపించింది. ‘‘నా రాముడి ముందు నీ బలపరాక్రమాలన్నీ ఇంతే’’ అంది. రావణుని శక్తియుక్తుల్ని తృణప్రాయంగా తీసిపారేసింది. ‘‘పొగరుబోతా! ప్రగల్భాలు పలకకు. నా భర్త ఇంట్లో లేనప్పుడు నన్ను ఎత్తుకొచ్చావు. ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేసి చూడాల్సింది. నా రాముడు నిన్ను కత్తికో కండగా నరికేవాడు. నీకెంతో సైన్యం ఉన్నదనీ, వారంతా వీరులనీ అంటున్నావు కదా, వారెవరూ రాముని ముందు నిలువలేరు. గరుత్మంతుని ముందు సర్పాల్లా తలలొంచి, తనువులు చాలించాల్సిందే.’’ అన్నది సీత. ‘‘నీ రాముని ముందు నేను నిలువగలనా?’’ అడిగాడు రావణుడు. ‘‘నువ్వు కూడా నిలువలేవు. దేవతలు కూడా నిన్ను సంహరించలేరనే నీ అహంకారాన్ని నా రాముడు తుత్తునియలు చేస్తాడు. యజ్ఞపశువు హోమగుండంలో పడక తప్పదన్నట్టు, నువ్వు రాముడి చేతితో మరణించక తప్పదు. రాముని దివ్యాస్త్రాల ముందు నువ్వెంత? నీ కందకం సముద్రం ఎంత? ఒకే ఒక అస్త్రంతో సముద్రాన్ని ఇంకింప జేసి, నా రాముడు నన్ను చేరుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది.’’

‘‘పతివ్రతను నన్ను నువ్వు కోరుకోవడం, శుద్ధమైన యజ్ఞవేదిని పాపాత్ముడు తాకడం లాంటిది. కొలనులోని హంసిని నీటికాకి కోరుకోవడం లాంటిది. నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినా నేను నీ దాన్ని కాను, కాలేను.’’ అన్నది సీత. చేతిలోని గరికపోచను ఊది పారేసింది. అది వెళ్ళి రావణుని కంట్లో పడింది. శూలంలా గుచ్చుకుంది. ఆందోళనాగ్రహాలతో ‘హె’ అన్నాడు రావణుడు. గరికపోచను తీసి, విదిలించాడు. ‘‘సుద్దులమారీ! శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినా నువ్వు నా దానవు కాదన్నదే నీ ఆఖరి మాట అయిన పక్షంలో...నా ఆఖరి మాట కూడా నువ్వు వినాలి. నీకు ఓ సంవత్సరం గడువిస్తున్నాను. ఈ సంవత్సరకాలంలో నీ అంతట నువ్వుగా నన్ను కోరుకోవాలి. నన్ను వరించి, మురిపించాలి. లేదంటావా..సంవత్సరం గడిచినా ఈ మొండితనంతో నువ్విలాగే ఉంటే..నా వంటవారు నిన్ను ముక్కలుముక్కలుగా తరిగి, కారం పూసిమరీ నిన్ను నాకు నైవేద్యం చేస్తారు. చావుకి సిద్ధపడితే నీ ఇష్టం, ఏడుస్తూ కూర్చో! బతకాలనుకుంటే మాత్రం ఇది కాదు పద్ధతి.’’ అన్నాడు రావణుడు.

నిష్క్రమించబోయాడు అక్కణ్ణుంచి. కాపలాగా ఉన్న రాక్షసకాంతలను చూశాడు. చెప్పాడిలా. ‘‘ఇక నుండి సీత ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఫల పుష్పాలతో కళకళలాడే అశోకవనానికి ఆమెను తరలించండి. ఎప్పటికప్పుడు ఆమె మనోభావాలను పరిశీలించండి. లాలించండి. బుజ్జగించండి. బెదిరించండి. అడవి ఏనుగును మచ్చిక చేసుకునేలా సీతను మచ్చిక చేసుకుని, నాకు కానుకగా సమర్పించండి. మీరు కోరుకున్నది అందుకోండి.’’ ‘‘అలాగే ప్రభూ’’ ఆనందించారు వారు. రాక్షసకాంతలను ఉద్దేశించి అన్నాడిలా. ‘‘ఆమెను తక్షణం ఇక్కణ్ణుంచి తరలించండి.’’ ‘‘చిత్తం ప్రభూ’’ పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడక్కణ్ణుంచి రావణుడు. అతడటు వెళ్ళిపోగానే సీతను ఇటు అశోకవనానికి తరలించారు రాక్షసకాంతలు. ఓ చెట్టు మొదలున ఆమెను కూర్చోబెట్టి, కాపలా కాయసాగారు.

No comments: