Adsense

Saturday, October 1, 2022

శ్రీ గిరిజా దేవి ధ్యానం

దేవి శరన్నవరాత్రలు సందర్భంగా...!!
ఓఢ్యాయాం గిరిజాదేవి.


        🌹 శ్రీ గిరిజా దేవి ధ్యానం 🌹

🙏🏻ఓధ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా...
పాలికాఖిల లోకానాం వల్లవారుణ పాణినా...🙏🏻

🌸ఒరిస్సా రాష్ట్రమునకు ఈశాన్యదిశగా జాజ్‌పూర్‌జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రము జాజ్‌పూర్‌ పట్టణం. ఈ క్షేత్రమున అష్టాదశశక్తి పీఠాల్లో పదకొండవదిగా గిరిజాదేవి పీఠం వుంది. మాతను విరజాదేవిగానూ, బిరిజాదేవి గానూ పిలుస్తారు.

🌿స్థానికులు విరజాదేవిగా కొలుస్తారు. జాజ్‌పూర్‌ చాలా పురాతన పట్టణం. పవిత్రమైన వైతరణి నది ఒడ్డునగల జాజ్‌పూర్‌ను వైతరణి పట్టణముగా పిలుస్తారు., దీనిని వైతరణీపురంగా కూడా పిలుస్తారు.

🌸జాజ్‌పూర్‌ బస్‌స్టాండ్‌ నుంచి సుమారు 2 కి.మీ. దూరమున బింజాపూర్‌ పోవు రోడ్డు మార్గమున బ్రహ్మకుండం వద్ద విరజాదేవి ఆలయం వుంది. నేటి ఆలయనిర్మాణం 18వ శతాబ్దంలో జరిగింది.

🌿ఆలయ ప్రాకారంలో నాభిగయ, ఇన్నైశ్వర్‌ శివాలయం, హనుమాన్‌ మందిరం, డోలమండపం, భైరవ, కార్తికేయ, గంగాధర్‌తోపాటు 108 శివలింగాలు, విష్ణురూపాలు దర్శించవచ్చును.

🌸ఆలయ గర్భగుడిలో విరజాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంగా, శాంతిమూర్తిగా కనిపించి, మహామహిమోపేతమైన శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది.

🌿సతీదేవి యొక్క నాభిస్థానం పడటం చేత, దీనిని మహాశక్తి పీఠంగా పరిగణిస్తారు. ఇది నాభిక్షేత్రంగా కూడా క్యాతి పొందినది. ఆలయప్రాకారం, సింహద్వారము శోభతో నయనానందకరంగా దర్శనమిస్తాయి.

🌸ఈ క్షేత్రమును గదక్షేత్రం, నాభిక్షేత్రం, విరాజక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, విరాజతీర్థం, వైతరణితీర్థం మొదలగు పేర్లతో భక్తులు కొలుస్తారు. జాజ్‌పూర్‌ నందు శక్తిపీఠంతో పాటు శైవమతమునకు చెందిన అనేక శివలింగాలు, వైష్ణవ మతమునకు చెందిన ఆలయాలు మరియు తీర్థాలు కలవు.

🌿ఈ బిరిజాదేవి అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేటట్లు మిగతా అమ్మవారిని పూర్తిగా బంగారు ఆభరణాలతో మరియు పూలదండలతో అలంకరిస్తారు.

🌸సర్వాలంకృతయై మందస్మితవదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు
గుప్తుల కాలమునాటి విరజాదేవి విగ్రహం, రెండు చేతులు కలిగిన మహిషాసురమర్ధినిగా ఉంటుంది.

🌿రాక్షసశక్తి అయిన ఎనుబోతును, అమ్మవారు తన ఎడమకాలితో త్రొక్కి, కుడిచేతిలోని త్రిశూలమును ఎనుబోతు ఛాతీలో గ్రుచ్చి, ఎనుబోతు (మహిషాసుర) తోకను ఎడమచేతితో పుచ్చుకుని, నిలుచుండెను.

🌸ఇటువంటి మహిషాసురమర్ధిని రూపం యొక్క నకలును జగన్నాథాలయ ప్రాకారం నందు, వాయువ్యవైపునగల ముక్తీశ్వర్‌ ఆలయం నందు కూడ చూడగలము. భారతదేశమున మరోచోట ఇటువంటి మహిషాసురమర్ధిని రూపమును దర్శించలేము...స్వస్తి.

No comments: