Adsense

Wednesday, October 5, 2022

దసరా పండుగ ప్రాముఖ్యత

 

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.

నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం.

సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు.

విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది.

సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి, పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.


విజయదశమి రోజు పాలపిట్టని చూస్తే భవిష్యత్తు బంగారుమయమేనా?

విజయదశమి పండుగకు, పాలపిట్టకు ప్రత్యేకమైన అనుబంధ ఉంది. తరతరాలుగా దసరా పండుగ రోజున చాలా మంది పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుంది. దీనికి పురాగాణ గాధల్లో అనేక కధనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రావణాసురుడిని చంపేందుకు వెళ్లిన శ్రీరాముడికి విజయదశమి నాడు పాలపిట్ట ఎదురవుతుంది, ఆనాడు రాముడు దానిని శుభశకునంగా భావించాడని అంటుంటారు. పాండవులు అజ్ఝాత వాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించటంతో ఆతరువాత కాలంలో వారు ఏంచేసినా విజయాలేకలిగాయన్న మరో కధనం కూడా చెబుతుంటారు.

చాలా మంది ఈ పక్షిని పరమశివునికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే దసర పండుగ రోజున ఈ పక్షిని చూస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో దసరా పండుగ రోజున పాలపిట్టను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆరోజున పాలపిట్ట వారి కంటికి కనిపిస్తే ఇక రానున్న రోజుల్లో తాము ఏపనిచేసిన విజయం తప్పకుండా సిద్ధిస్తుందని బలంగా నమ్ముతారు. తెలంగాణా ప్రాంతం వాసులు దసర పండుగ రోజున జమ్మిచెట్టు, పాలపిట్టను తప్పకుండా చూడాల్సిందే.

తెలంగాణా, ఒరిస్సా,కర్ణాటక, బీహార్ రాష్ట్రాలు తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించాయంటే ఆపక్షికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పాలపిట్ట చూడటానికి ముచ్చటగొలిపేలా ఉంటుంది. నీలం, పసుపు రంగుల కలబోతలో చూడటానికి ఎంతో అందంగా కలఫుల్ గా కనిపించే ఈ పాలపిట్ట చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ఎకో ఫ్రెండ్లీ పక్షిగా పేరుగాంచింది.

పాలపిట్ట మనశ్శాంతికీ ప్రశాంతతకు, కార్యసిద్ధికీ సంకేంగా అంతా నమ్ముతారు. పాండవులు జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాలకు సంవత్సరం పాటు ఇంద్రుడు పాలపిట్ట రపంలో కాపలాకాశాడని పురాణగాధలు చెబుతున్నాయి. ఎవరైనా ఆ చెట్టు మీద దాచిన ఆయుధాలను చూస్తే వారికంటికి అవి శవంలా, విషసర్పాలుగా కనిపిస్తాయనీ, ఎవరైనా వాటిని తాకేందుకు ప్రయత్నిస్తే అప్పుడు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వారిని తరిమికొడతాడట. అందుకే దసరారోజు పాలపిట్టను చూడాలని అంతా తహతహలాడుతుంటారు.

No comments: