Adsense

Wednesday, October 5, 2022

దేవీగీత నుండి శుంభ నిశుంభుల వధ...!!




🌸ఒకసారి శుంభ నిశుంభులనే దానవ సోదరులు పాతాళం నుండి భూలోకం వచ్చి పుష్కరతీర్థంలో నీరైనా ముట్టక ఒకే ఆసనంలో ఉండి వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తమకు అమరత్వం ప్రసాదించమన్నారు.

🌿బ్రహ్మ అది తన చేతులలో లేదని, ఇంకేదైన కోరుకోమని అన్నాడు. అమర, నర, పశు, పక్షి, పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. స్త్రీలు బలహీనులు కనుక మాకు వారి వల్ల భయం లేదని చెప్పారు.

🌸బ్రహ్మ తథాస్తు అన్నాడు. వారు శుక్రుని తమ పురోహితునిగా చేసుకొన్నారు. శుక్రుడు శుంభుని దానవ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. శుంభుడు రాజ్య పాలన చేయడం ప్రారంభించాడు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించాడు. దిక్పాలకులను, సూర్యచంద్రాది దేవతలను గెలిచాడు.

🌿దేవతలు నిరాశ్రయులై, బృహస్పతి సూచనతో హిమవత్పర్వతము మీద ఉన్న దేవిని శరణు వేడటానికి బయలుదేరారు. ఆ జగదంబ వారికి అవసరమైనప్పుడు తలుచుకోగానే ప్రత్యక్షమై సహాయం చేస్తానని వరం ఇచ్చి ఉన్నది కదా!

🌸హిమగిరులకు వెళ్ళి, అక్కడ మాయాబీజాన్ని మనస్సులలో నిలిపి, భక్తితో ధ్యానం చేశారు. అనేక విధాలుగా కీర్తించారు. వారి స్తుతులకు సంతృప్తి చెందినదై పార్వతి గిరి గుహ నుండి వెలుపలికి వచ్చి, వారికి అభయం ఇచ్చింది.

🌿పార్వతి శరీరం నుండి ఒక సుందరరూపం వెలువడింది. పార్వతి శరీర కోశం నుండి వెలువడటం చేత ఆమె కౌశికి అయింది. కౌశికి వెలువడిన తరువాత పార్వతి కృష్ణ వర్ణంతో భయంకర రూపాన్ని ధరించి, దానవులకు భయాన్ని, భక్తులకు అభయాన్ని ప్రసాదించే కాళిక, కాళి, కాళరాత్రి అని పేరు పొందింది.

🌸అంబిక సింహవాహనయై, కాళికతో కలిసి దానవ సంహారానికి ఉద్యుక్తురాలవటంతో దేవతలు సంతోషించారు.

🌿అంబిక ఒక ఉద్యానవనం చేరి, మధుర గానం చేయసాగింది. చండముండులనే శుంభుని సేవకులు దేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపడి, ఆమె గురించి శుంభునికి తెలిపారు. శుంభుని వద్ద నున్న అన్ని శ్రేష్ఠ వస్తువులకన్న గొప్పదైన ఆ అపురూప సౌందర్య రాశిని స్వంతం చేసుకోకపోతే శుంభుని ప్రాభవం వ్యర్థమని రెచ్చగొట్టారు.

🌸శుంభుడు సుగ్రీవుడనే మంత్రిని అంబిక దగ్గిరికి మధ్యవర్తిగా పంపాడు. సుగ్రీవుడు అంబికకు శుంభుని ఘనత, అతడు ఆమెపై మరులు కొన్న విషయం, అతడిని చేరితే ఆమె పొందే వైభవాలని ఏకరవు పెట్టాడు.

🌿అంబిక తనకు శుంభ నిశుంభుల గొప్పతనం గురించి తెలుసునని, వారిలో ఒకరిని పతిగా పొందాలనే వెతుక్కుంటూ వచ్చానని, కాని ఒక చిన్న ఇబ్బంది ఉన్నదని, చిన్నతనంలో స్నేహితులతో ఆడుకుంటూ తనను యుద్ధంలో గెలిచిన వారినే వివాహ మాడుతానని ప్రతిజ్ఞ చేశానని,

🌸తను అబలని కనుక తనని గెలవటం కష్టం కాదని, తనని యుద్ధంలో గెలిచి చేపట్టమని, యుద్ధానికి సోదరులలో ఎవరైనా రావచ్చునని తన సందేశంగా చెప్పమంది. సుగ్రీవుని మాటలను విన్న శుంభుడు నిశుంభుని సూచన మేరకు ఆమెను తెమ్మని ధూమ్రలోచనుడిని పంపాడు.

🌿అతడామెను మంచిమాటలతో ఒప్పించటానికి ప్రయత్నించాడు. ధూమ్రలోచనుని మాటలను విన్న కాళికాదేవి తనతో యుద్ధము చేయమని అతడిని సంహరించింది. ఆమె చేసిన శంఖనాదం విని శుంభుడు కారణం తెలుసుకొని, ఆమె పైకి యుద్ధానికి వెళ్ళదలచిన నిశుంభుని వారించి, ఆమెను పట్టి తెమ్మని, వీలుకాకపోతే చంపమని, చండ ముండులని పంపాడు.

🌸వారు అంబికను సమీపించి ముందుగా సామోపాయం ప్రయోగించాలనుకుని మంచిమాటలతో ఆమె మనసు శుంభునిపై మరలించటానికి ప్రయత్నించారు. కాని అంబిక వారిని రెచ్చగొట్టేట్టు- మాట్లాడింది. వారు కోపంతో యుద్ధానికి పూనుకున్నారు.

🌿దేవి కోపంతో బొమముడి వేయగా నుదుటి నుండి శ్రీకాళిక ఉద్భవించింది. పరమ భయంకర రూపంతో ఘోరంగా కనపడుతున్న కాళిక దానవ సైన్యాన్ని, ఏనుగులను, గుర్రాలను, ఒం-టె-లను నమిలి మింగుతూ చండముండుల నిద్దరను పడగొట్టి, వారిని కుందేలు పిల్లల్లా చేతిలో పట్టు-కుని, అంబికకు సమర్పించింది.

🌸అంబిక వారిని సంహరించమని చెప్పగానే వారి శిరస్సులని ఖండించి, వారి రక్తం త్రాగింది కాళిక. సంతసించిన అంబిక చండ ముండులను సంహరించినందుకు కాళికను చాముండ అనే పేరుతో భూలోకంలో ప్రసిద్ధ మవుతావు అని కీర్తించింది.

🌿పారిపోయి వచ్చిన సైన్యం శుంభునికి దేవి పరాక్రమాన్ని తెలిపారు. శుంభుడు రక్తబీజునియుద్ధానికి పంపాడు. అతడు కూడా దేవికి శుంభుని వరించ మని బోధించాడు. అంబిక రెచ్చగొడుతూ మాట్లాడింది. రక్తబీజుడు, అతడి సైన్యం యుద్ధం చేయ సాగారు.

🌸ఆ సమయంలో సర్వదేవతలు తమతమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలు ధరించి వాహనాలను అధి రోహించి వచ్చి రక్త బీజుని సైన్యాన్ని మట్టు- పెట్టసాగాయి.

🌿ఆ సమయంలో శివుడు దేవతలనందరను తన వెంట తీసుకొని, యుద్ధభూమికి వచ్చాడు. వెంటనే శుంభనిశుంభులను, రక్తబీజుని పరిమార్చమని చెప్పాడు. దేవి సంతోషించింది.

🌸అపుడు చండిక శరీరం నుండి అద్భుత దివ్యశక్తి ఆవిర్భవించింది. ఘోర రూపంతో ఉన్న ఆమె శివునితో శుంభ నిశుంభుల వద్దకు దూతగా వెళ్లి, వారిని తిరిగి పాతాళానికి వెళ్ళమని చెప్పమని కోరింది.
🌿శివుడామె చెప్పినట్లు చేశాడు. శివుని దూతగా చేసుకున్నది గనుక ఆమె శివదూతి అయింది.

🌸దేవతలు పంపిన వారివారి శక్తులు దానవ సైన్యాలని సర్వనాశనం చేయసాగాయి. ఈ శక్తులను మాతృకా గణాలు అంటారు. దానవులు భయపడి పారిపోతుంటే రక్తబీజుడికి కోపం వచ్చి దేవితో యుద్ధానికి వచ్చాడు.

🌿మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్త బిందువు నుండి, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టి వారిసంఖ్య అసంఖ్యాకం అయింది.

🌸దేవతలందరు భయభ్రాంతులయ్యారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్తబీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగమని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని క్రింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు.

🌿వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే, కాళిక తినేసింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతోమంది దానవులని తినేసింది. చావు నుంచి తప్పించుకు పారిపోయిన వారు శుంభునికి జరిగినదంతా చెప్పి అటు-వంటి వీరవనితతో యుద్ధం శ్రేయస్కరం కాదని విన్నవిస్తారు.

🌸నిశుంభుడు అన్నని వారించి తానే శ్రీదేవితో యుద్ధానికి బయల్దే రాడు. వారి యుద్ధాన్ని శుంభుడు, దేవతలు కూడా చూస్తున్నారు. నిశుంభుడి తల నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టు-కొని తిరుగుతుంటే మొండెం కాళ్ళు చేతులు నరికింది.

🌿దానితో నిశుంభుడు అసువులు బాసాడు. తప్పించుకొని పారిపోయిన దానవులు శుంభునికి దేవితో యుద్ధం ప్రాణాంతకమని చెప్పారు. శుంభుడు పెడచెవిన పెట్టాడు. ఆమె రూపం చూసి, యుద్ధం మాట మరచి వ్యామోహంలో పడి పోయాడు.

🌿ఆమెను తనను చేపట్టమని ప్రార్థించాడు. శ్రీదేవి తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతోగాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోర యుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని హతమార్చింది.

🌸దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాటలతో సాధించిన విజయానికి సంకేతం ఇది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతి గా చెప్పటం జరిగింది.

No comments: