Adsense

Thursday, January 19, 2023

నిజామాబాద్ జిల్లా : ఇందూరు.. శ్రీ రఘునాథాలయం

నిజామాబాద్ జిల్లా : ఇందూరు..  శ్రీ రఘునాథాలయం

💠 అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీ రామ చంద్రుడు ఆలయం లేని  గ్రామం లేదంటే అతిశయోక్తికాదు. 
అలాగే మనవారు ఏ విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు. 
సకల గుణాభిరాముడైన శ్రీరామునికి మనమిచ్చే గౌరవం అది.
అటువంటి రామచంద్రునికి దేశమంతా అనేక ఆలయాలు. 
జగత్ప్రసిధ్ధి చెందిన ఆలయాలు కొన్నయితే ఊరూరా నిర్మింపబడ్డ ఆలయాలు ఎన్నో.  వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వంగానీ, ఇటు మత పెద్దలుగానీ కనీసం ఆ ప్రాంత ప్రజలుగానీ  వాటి విలువ తెలుసుకుని ఆదరించకపోవటంవల్ల  వాటి గురించి తెలియచెప్పేవారు లేక, వాటి చరిత్రలతో సహా కనుమరుగవుతున్నాయి.  అలా కనుమరుగుకాబోయి తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్న అలయమే ఇందూరు లోని
శ్రీ రఘునాధ ఆలయం .

💠 ఒక కొండ. ఆ కొండపై కోట. ఆ కోటలో దేవాలయం. వేల ఏళ్ల క్రితం ఈ కొండపై రఘునాథ మహర్షి తపస్సు చేశాడు. ఇప్పటికి ఈ కొండపై ఆయన ధ్యాన మందిరం ఉంది. దీనిని ఆ కాలంలోనే ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో, అంటే బాగా గాలి & వెలుతురు సహజంగా వచేట్లు నిర్మించారు. ఇది ఏ కాలంలో అయినా చల్లగా ఉంటుంది. కొండ పక్కనే ఉన్న సరస్సుని ఆ కాలంలో రఘునాథుల వారు ఉపయోగించేవారు. ఇప్పటికి దీనిని రఘునాథ చెరువు అంటారు. ఈమద్య బతుకమ్మ (బొడ్డెమ్మ) చెరువు అని కూడా పిలుస్తున్నారు.

💠 కొంతకాలం తర్వాత.. అంటే  8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజవంశ రాజైన ఇంద్రుడు ఈ కొండపై కోటను నిర్మించి, పాలించాడు. అతని పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ఇంద్రపురం / ఇంద్రపురి / ఇందూరు అనే పేరు వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్రంలోని నేటి నిజామాబాద్ నగరం.

💠 కొంతకాలం తర్వాత.. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసుల వారు ఇక్కడికి వచ్చారు. ఈ కోటలో ఆలయాన్ని నిర్మించి, సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించి - పూజించారు. అదే నేటి శ్రీ రఘునాథ దేవాలయం / ఖిల్లా (కోట) రామాలయం.

💠 కొంతకాలం తర్వాత.. 7వ నిజాము నవాబు కాలం లో ఈ దేవాలయాన్ని కేంద్ర కారాగారంగా వాడారు. అప్పుడే తెలంగాణ స్వాతంత్ర్య వీరుడైన దాశరథిని ఇక్కడ బంధించారు. ఇప్పటికి ఆ గదిని చూడొచ్చు.

💠 అతి పురాతనమైన ఈ దేవాలయంయొక్క వైశాల్యం సుమారు 3900 చ.గ.లు. 
ఇక్కడి ధ్వజస్తంబము ఒకే రాతిలో మలచబడ్డది.
53 అడుగుల ఎత్తున్న ఈ అఖండ శిలా ధ్వజస్తంభముపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగించేవారని ప్రతీతి.

💠 ఆలయంలో గర్భగుడిలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలివుంటాయి.  (శ్రీరామచంద్రుని అంకంపై సీతమ్మ, పక్కనే లక్ష్మణస్వామి).  అంతేకాదు, అతి విశాలమైన మంటపములు, సశాస్త్రీయంగా వున్న గర్భాలయం, గర్భాలయం ఎదురుగా ఆంజనేయస్వామి మందిరం, శ్రీ రఘునాధ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీ రాములవారి పాదుకలు, విశాలమైన కళ్యాణమండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలు ఆలయ విశిష్టతను పెంపొందింపచేస్తాయి. 


💠 కొండ కింద వున్న ఆలయ ముఖ ద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం, గజలక్ష్మి చిహ్నములతో గర్భాలయంలో వుండే స్వామివారి స్ధానం ఒకే దిశల సమాంతర రేఖతో తూర్పునకు అభిముఖంగా వుండటం విశేషం.  ఆలయ శిఖరం నూతనంగా నిర్మింపబడింది.

💠 ఈ మందిరంలో అర్చనచేసి రాముని ప్రార్ధించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం.


💠 కొండపైకి వెళ్ళేదోవలో రెండు పెద్ద కొండరాళ్ళవెనుక  ఆంజనేయస్వామికి చిన్న ఆలయం.  మార్గం గుహలోకి వెళ్తున్నట్లుంటుంది. 
సహజసిధ్ధంగా ఏర్పడ్డ ఈ మార్గంగుండా వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు.

No comments: