Adsense

Saturday, February 11, 2023

Central Budget 2023-24

రైల్వేల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లు

రైల్వేల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించారు.

కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

రాష్ట్రాలలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు 50 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్స్, వాటర్ ఏరో డ్రోన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు కేటాయించారు.

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు కేటాయించారు.

ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్లు, పట్టణ మౌలిక వసతుల కల్పనకు రూ. 10 వేల కోట్లు కేటాయించారు.

పర్యటక రంగ అభివృద్ధి కోసం దేశంలోని 50 ప్రాంతాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

నేషనల్ హైడ్రోజన్ మిషన్ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 19,700 కోట్లు కేటాయించారు. 2030 నాటికి 5 లక్షల టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
జీడీపీలో 5.9 శాతం ద్రవ్యలోటు
సవరించిన అంచనాల ప్రకారం 2023-24లో ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతమని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్: 7.5 శాతం వడ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నట్లు నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ఇవి రెండేళ్ల కాలపరిమితిలో ఉంటాయి. ఈ పథకంలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఇస్తారు.
ఇందులో గరిష్ఠంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు.
కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ. 7 లక్షల వరకు రిబేట్
కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ. 7 లక్షల వరకు రిబేట్ కల్పిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు.
ఈ పరిమితి ఇంతకుముందు రూ. 5 లక్షలుగా ఉండేది.
వ్యక్తిగత ఆదాయపన్ను కొత్త శ్లాబ్‌లు

0 నుంచి రూ. 3 లక్షల వరకు – పన్ను లేదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు – 5 శాతం పన్ను
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు – 10 శాతం పన్ను
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు – 15 శాతం పన్ను
రూ. 12 లక్షలు నుంచి రూ. 15 లక్షలు – 20 శాతం పన్ను
రూ. 15 లక్షలు దాటితే – 30 శాతం పన్ను

బడ్జెట్ 2023: ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయంటే?

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో కొత్త పన్ను విధానంతో పాటు కస్టమ్ డ్యూటీని పెంచడం గురించి ఆమె ప్రకటన చేశారు.
తాజా బడ్జెట్‌ను ఆమె అమృతకాల బడ్జెట్ అని అభివర్ణించారు.
కస్టమ్ డ్యూటీ కారణంగా ఏమే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువులు తక్కువకు లభిస్తాయో కింద చూడండి.
చౌకగా లభించే వస్తువులు
కెమెరా లెన్స్, లిథియం ఆయన్ బ్యాటరీ వంటి మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ఉపకరణాలపై కస్టమ్ సుంకాన్ని తగ్గించారు.
టెలివిజన్‌ ప్యానల్‌లో బిగించే సెల్‌లో ఉండే కొన్ని భాగాలపై కస్టమ్ పన్ను ఉండదు.
ల్యాబ్‌లలో తయారు చేసే డైమండ్లపై కస్టమ్ సుంకం తక్కువగా ఉంటుంది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి.
రాగి వ్యర్థాలపై 2.5 శాతంగా ఉన్న సుంకాన్ని మార్చట్లేదు.
డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్‌కు పన్ను నుంచి విముక్తి కల్పించారు.
క్రూడ్ గ్లిజరిన్‌పై ఉండే పన్నును 7.5 నుంచి 2.5కు తగ్గించారు.
రేట్లు పెరిగే వస్తువులు
సిగరెట్‌పై పన్నును 16 శాతం పెంచారు
బంగారం బిస్కెట్‌తో తయారుచేసే వస్తువులపై పన్ను పెరుగనుంది
వెండి ధర కూడా పెరుగనుంది
చిమ్నీలపై పన్నును 7.5 నుంచి 15 శాతానికి పెంచారు.

చిరుధాన్యాల హబ్‌గా భారత్

‘శ్రీ అన్న’(చిరుధాన్యాలు) ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో, ఎగుమతిలో ద్వితీయ స్థానంలో ఉందని.. ‘శ్రీ అన్న’ గ్లోబల్ హబ్‌గా భారత్‌ను నిలిపేందుకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, అందరికీ అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ పనిచేస్తుందని, కేంద్రం నుంచి ఈ సంస్థకు సహకారం అందుతుందని నిర్మల సీతారామన్ చెప్పారు.


అగ్రికల్చర్ యాక్సిలరేషన్ ఫండ్, ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం, పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజ్

వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక యువత వ్యవసాయ స్టార్టప్‌లు ఏర్పాటుచేస్తే సహకరించేందుకు వ్యవసాయ వృద్ధి నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త ఆలోచనలో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందుతుందని చెప్పారు.

అధిక విలువైన ఉద్యాన పంటల కోసం రూ. 2,200 కోట్లతో ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రొగ్రామ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.

రూ. 2,516 కోట్లతో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు.

పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజ్‌లో భాగంగా సంప్రదాయ చేతివృత్తులవారు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునేలా, ఉత్పత్తి పెంచేలా సహకరిస్తామన్నారు.
సప్తర్షుల్లా ఏడు అంశాలకు ప్రాధాన్యం

సమీకృత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, యువత ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యాంశాలని నిర్మల సీతారామన్ చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ప్రకాశవంతమైన తారగా గుర్తించిందని.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నిటి కంటే ఎక్కువగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును అంచనా వేస్తున్నామని ఆమె చెప్పారు.
సప్తర్షుల్లా ఏడు ప్రాధాన్యాంశాలు ఉన్నాయన్నారు.
1) సమీకృత అభివృద్ధి
2) ప్రతి ఒక్కరికీ చేరువకావడం
3) మౌలిక వసతులు, పెట్టుబడులు
4) సామర్థ్యాలను ఆవిష్కరించడం
5) గ్రీన్ గ్రోత్
6) యువశక్తి
7) ఆర్థిక రంగం

No comments: