Adsense

Thursday, March 30, 2023

శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయం, వరంగల్ జిల్లా, జీడికల్



శ్రీ రాములవారు మీసాలతో కొలువై ఉన్న ప్రపంచంలోనే ఏకైక స్వయంభూ ఆలయం.
ఎప్పటికీ పెరగని, తగ్గని రామపాదంచే ఏర్పడిన 40 అడుగుల రామగుండము (పాపనాశిని).
 బంగారులేడి రూపంలో వచ్చిన మారీచుడు శ్రీరాముని బాణంతో మరణించిన స్థలం, శ్రీరాముడు నడయాడిన స్థలం.
 ప్రతి ఏటా 2 సార్లు శ్రీరామ కళ్యాణం జరిగే  పుణ్యక్షేత్రం.
పాపాలను పోగొట్టే జీడిగుండం మరియు పాలగుండం....
ఇన్ని విశేషాలు కల 2వ భద్రాచలం స్వయంభూ శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో జీడికల్ లో కలదు..

 తెలంగాణ రాష్ట్రంలోని జనగాం పట్టణమునకు సుమారు 16 కి.మీ., దూరంలో జీడికల్ అను గ్రామము కలదు.
ఇచ్చటకు 2 కి.మీ., దూరంలో ఉన్న పెద్ద రాయి మీద రెండు నీటి గుంటలు ఉన్నవి. అందులో ఒకటి పాలగుండం కాగా రెండవది జీడి గుండం. జీడి (నల్ల)గుండం ఉన్న రాయి కారణంగా ఈ క్షేత్రం జీడికల్లుగా పిలువ బడుతుంది అని చెబుతారు.
ఈ క్షేత్రాన్ని లేడిబండ అని కూడా పిలుస్తారు.

 ఈ గ్రామమునందు వీరాచలము అనే కొండ ఉన్నది. ఈ కొండపైన శ్రీరామచంద్రుని ఆలయం ఉన్నది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా స్థానికులు చెప్తారు. ఈ ఆలయం నందు శ్రీరామచంద్రమూర్తి స్వయంభువుగా వెలిశాడని ప్రసిద్ధి.
వీరుడు అను ముని ఇచ్చట తపస్సు చేస్తూ శ్రీరాముని పూజిస్తూ అతని అనుగ్రహం పొందినందువల్ల ఈ క్షేత్రం వీరాచలంగా పిలువబడుతుంది.

 స్థల పురాణం 

ఒకప్పుడు వీరడను భక్తుడు, ఇచట గల చిన్న పర్వతము మీద శ్రీరామచంద్రుని గురించి తపస్సు చేసాడట!
అపుడు వారికి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ఏమి వరము కావలయునో కోరుకొమ్ము ఇచ్చెదను అన్నాడట.
అప్పుడతడు స్వామీ నీవీ కొండమీద వెలయవలయును. ఆ కొండకు నాపేరు రావలయును అని కోరాడట!
శ్రీరామచంద్రుడు అతనికి వరం ప్రసాదించి అదృశ్యమైనాడు.
అప్పటి ఉండి ఆ పర్వతము వీరాచలమన్న పేరుతో ప్రఖ్యాతమైనది.
 తరువాత ఆ పర్వతము మీద నొక గుహయు, ఆ గుహయందొక చిన్న నీటి గుండము, ఆ నీటిగుండమునానుకొని శ్రీరామచంద్రుని చిహ్నాలతో నొక శిలయు ఏర్పడినది.
ఆ శిలనే శ్రీరామచంద్రునిగా భావించి ప్రజలు ఆరాధించ సాగారు.
అదే వీరాచల శ్రీరామంచద్రస్వామిగారి ఆలయముగా ప్రఖ్యాతమైనది అని స్థల పురాణం వివరించుచున్నది.
 ఇచ్చట పద్మాసనంలో వెలసియున్న స్వామివారిని వీరాచల రామచంద్రుడు అని అంటారు.
 సీత కోరిక మేరకు శ్రీరాముడు మాయలేడిని వేటాడుతూ ఈ ప్రాంతాన్ని సందర్శించాడని స్థలపురాణం.
లేడి అడుగు జాడలు, శ్రీరాముని పాదాల ముద్రిలు, బాణం సంధించే సమయంలో రాముని మోకాలి ముద్ర 'లేడిబండ'పై ఇప్పటికీ స్పష్టంగా కనబడుతుంటాయి.
నిత్యకర్మల వలన మానవులకు కలుగు పాపములు జీడివలె ఆత్మలను అంటిపట్టుకొంటాయి. అలాంటి పాపములను ఈ రామగుండం నందలి పవిత్ర జలముతో శుద్ధిపొంది, పునీతులు కాగలరు అని తెలుస్తుంది.
 ఈ క్షేత్రం నందు గాలి, వెలుతురు, వర్షం నేరుగా స్వామి వారిని తాకే విధముగా ఆలయం పునర్నిర్మించబడింది.
ఇచ్చట మూలవిరాట్టు అయిన శ్రీరామచంద్రస్వాములవార్లు ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి ముందుభాగాన రామగుండం కలదు.
ఈ ఆలయమునందు శ్రీ సీతా రామలక్ష్మణులేగాక ఉపాలయాలలో చిన్న ఆంజనేయ స్వామివారు, పెద్ద ఆంజనేయ స్వామివారు ఆలయ ఆవరణలో మనకు సర్వాంగ సుందరంగా దర్శనమిస్తారు. దీనితోపాటు గాలిగోపురం, మహామండపం, నవగ్రహమండపం, ఆళ్వార్లు మందిరం, పాకశాల,జ్ఞానమందిరం మొదలగు నిర్మాణములు కూడా కలవు.

 ఈ ఆలయములో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఇచ్చటి వీరాచల రామునికి సంవత్సరంలో రెండుసార్లు అనగా శ్రీరామనవమి మరియు కార్తీకమాసంలో కళ్యాణం జరుగుట విశేషం. కార్తీకమాసం నందు పౌర్ణమి నుంచి ఏకాదశి వరకు యాత్ర (జాతర) జరుగుతుంది.
కార్తీక పౌర్ణమినాడు, పునర్వసు నక్షత్రంతో కూడిన తిథినాడు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి.

 లేడిబండకు సమీపాన దూసమడుగు ఉంది. ఇది చాలా లోతైన మడుగు. మాయాలేడి సంహరణానంతరం రాముడు తన విల్లమ్ములను ఈ మడుగులోనే శుభ్రపరుచుకొన్నాడని విశ్వాసం.

 భద్రాచల రామాలయం రాముడి ప్రేమకు గుర్తయితే జీడికల్‌ వీరాచలం ఆయన వీరత్వానికి ప్రతీతిగా భక్తులు చెప్పుకుంటారు.

 కార్తీకపౌర్ణమిని జీడికల్‌ పున్నమిగా పేరు ప్రఖ్యాతులు గడించిందంటే ఎంత ప్రాశస్త్యం కలిగిన జాతరో అర్థమౌతుంది.

 త్రేతాయుగంలో స్వయంభువుగా వెలసిన వీరాచల రామచంద్రస్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతులు పొందింది.

కార్తీక మాసంలో ప్రారంభమయ్యే జాతర నెల రోజుల పాటు జరుగుతుంది.
ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

 త్రేతాయుగంలో వీరుడు, భద్రుడు అనే పేరుగల ఇద్దరు మునీశ్వరుల తపోనిష్ఠ వలన భద్రాచలంలో భద్రాచల రామయ్య, జీడికల్‌లో వీరాచల రాముడిగా వెలిసినట్లు ప్రతీతి.
అందుకే రెండో భద్రాద్రిగా పేరు పొందింది.

జనగాం బస్ స్టాప్ నుండి 13 కిమీ.

No comments: