Adsense

Thursday, March 30, 2023

అభిజిర్లగ్నం అంటే..

భద్రాచలం లో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నం లో  నిర్వహిస్తారు. అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం...ఇది దోషరహిత ముహూర్త సమయం....దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు.
 
అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం  శ్రీరామనవమి వేడుక

అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగిన భద్రాచలం  శ్రీరామనవమి విశిష్టతను, భక్తరామదాసు నెలకొల్పిన ఆచార సాంప్రదాయ వ్యవహారాలను త్రోసిరాజని, సీతారాములకళ్యాణం లో శ్రీరామచంద్రుని పేరును తొలగించి శ్రీరామనారాయణగా మార్చిపలకడం, అసలు భద్రాచల క్షేత్రం లో కొలువైవున్నది త్రేతాయుగం నాటి దశరధనందనుడైన శ్రీరామచంద్రుడు కాదు అని సాక్షాత్హు మిథిలా స్టేడియం నుండే భద్రాద్రి వైదికసిబ్బంది నొక్కి వక్కాణించడం చూస్తుంటే శ్రీరామభక్తులకు ఆవేదన కలుగుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి అనిపిస్తోంది

శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు...అది ఆయన పుట్టినరోజు కూడా.చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం.

మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం. శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా  నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ? నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్తరామదాసు.

ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు  అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి.(శ్రీరంగంలో మాదిరిగా ).

పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహిత లో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా  రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు.  అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన  ఒక శ్లోకం అయిన...."ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్" (పరమ  పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం.

రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి. అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.
ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

వాల్మీకి రామాయణం లో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు. కానీ,నాడు భద్రాచలం లో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై , చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా
శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి....
ఆ ముహూర్తనిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం  కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు

No comments: