Adsense

Friday, March 24, 2023

శ్రీ రాజ్యలక్ష్మి భోగ్యలక్ష్మి సమేతశ్రీకాకుళేశ్వర స్వామి ఆలయo

 

" శ్రీకాకుళ్ళెంద్ర ఆంధ్రా మహావిష్ణువు ఆలయం"

💠 శ్రీ మహావిష్ణువుని వైష్ణవులు ఎక్కువగా ఆరాధిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విష్ణువు ఆలయాల్లో ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది.
ఇక్కడ స్వామివారు శ్రీకాకుళేశ్వరుడు అన్న పేరుతొ ప్రఖ్యాతి చెందాడు.
ఇక్కడ వెలసిన విష్ణుమూర్తిని ఇంకా  కొన్ని రకాల పేర్లతో పిలుస్తుంటారు.

💠 తెలుగువారికి ఈ క్షేత్రం విశిష్టమైనది. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఇక్కడ
ఆంధ్ర మహావిష్ణువుగా కొలువడమే కాదు... ఆంధ్రనాయకుడుగా, తెలుగు వల్లభుడుగా పూజలందుకుంటున్నాడు.

💠 చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణాపథం వరకూ పాలించి శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం.

💠శ్రీ కృష్ణదేవరాయులు  తన ‘ఆముక్తమాల్యద’ రచనకు ఇక్కడే శ్రీకారం చుట్టడం మరో విశేషం.
ఇంకో విశేషం... ఇక్కడ స్వామి మీసాలున్న మహావిష్ణువు.
ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే... శ్రీకాకుళాన్ని  ప్రముఖ వైష్ణవాలయంగా పేరు సంపాదించుకుంది

💠 కృష్ణాజిల్లా విజయవాడ మహానగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్రా మహావిష్ణువు ఆలయం కొలువై ఉన్నది.
ఈ గ్రామం ఘంటసాల మండలంలో దీవిసీమలోని కృష్ణానది తీరంలో కలదు.

🔆 స్థలపురాణం :
💠 స్కాంద పురాణంలో అగస్త్యులవారు శ్రీకాకుళ క్షేత్రాన్ని దర్శించినట్లు ఉంది
బ్రహ్మాండ పురాణం ప్రకారం  కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయని  దేవతలు, మునులు, మహర్షులు వ్యాకులత చెంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారట. ఆయన వారి మొర ఆలకించి, ఈ పాపభార ప్రక్షాళనకు విష్ణువు సాక్షాత్కారమే శరణ్యమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలు హరిస్తానని మాట ఇచ్చాడట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడట.
అందువల్ల బహురూపాలు ధరించి ప్రతి మూలనా నిలబడి ఈ ప్రాంత అందాలు చూడసాగాడట.

💠 అప్పుడు ఇతర దేవతలకు, మునులకు ఎక్కడ చూసినా బ్రహ్మరూపమే కనిపించింది. దాంతో వారు ఈ ప్రాంతాన్ని ‘శ్రీకాకుళం’ అని పిలవడం మొదలుపెట్టారు.
‘శ్రీ’ అంటే శోభాయకరమైన, ‘క’ అంటే బ్రహ్మచే, ‘ఆకుళం’ అంటే వ్యాపించినది అని అర్థం.
మరో కథనం ప్రకారం శ్రీమహావిష్ణువుకు సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు ఇష్టమైనవి కనుక ఆయన ఇక్కడ వెలిశాడట.
మరో కథనం ప్రకారం భృగువు, పులస్త్యుడు, సుబాహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దశుడు, వశిష్ఠుడు, మరీచి అనే నవబ్రహ్మలు ఇక్కడి విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారనే నమ్మకం ఉంది.

💠 శ్రీకాకుళేశ్వరస్వామిగా పూజలందు కుంటున్న ఆంధ్ర మహావిష్ణువు మీసాలు కలిగి ఉండటం ఇక్కడి ఆలయం ప్రత్యేకత. అన్నవరంలోని సత్యనారాయణస్వామికీ, పలుచోట్ల చెన్నకేశవస్వామికీ ఈ విధంగా మీసాలున్నాయి. శ్రీరంగం, తిరుపతి వంటి ప్రసిద్ధి పొందిన వైష్ణవాలయాల్లో స్వామివారికి మీసాలుండవు.


🔆 ఆముక్తమాల్యద
తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ దెలుఁ గొకండ
యెల్ల నృపులగొలువ నెరుఁగ వే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స"
  
💠 విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్రలో భాగంగా ఇక్కడి మందిరం గురించి విని స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
ఆ రోజు రాత్రి రాయల వారి అక్కడే బస చేశారు. అప్పుడు రాయల వారికి అంద్రమహావిష్ణువు కళలో కనిపించి నువ్వు సంస్కృతంలో గొప్ప కవివి.. తెలుగులో కూడా గొప్ప రచన చేయమని అడిగారు.
అప్పుడు ఇక్కడ ఉన్న ఒక మండపంలో కూర్చొని రాయల వారు విష్ణువును తలుచుకుంటూ "అముక్తమాల్యద" అనే గ్రంధాన్ని రచించాడు. ఇప్పడు ఆ మండపాన్ని ఆముక్తమాల్యద మండపం అని పిలుస్తున్నారు.
ఈ రచన ద్వారా కృష్ణదేవరాయలు ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ బిరుదునందుకున్నాడు.
అంతటి సాహితీవేత్త ప్రస్థానం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో జరగడం తెలుగువారందరికీ గర్వకారణం.
        
💠 ఇక్కడ మూల విరాట్టు అందమైన ఆరడుగల విగ్రహం. అమ్మవారు కూర్చొని వున్న రీతిలో నాలుగు అడుగుల ఎత్తున ఉంటుంది.

💠 శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయ గర్భగుడిపై ఉన్న విమానానికి భద్రకోటి విమానం అని పేరు.


స్వామివారి ఉత్తరభాగ ఉపాలయంలో భూసమేత చిన్నకేశవస్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో నిత్యాగ్నిహోత్రం ఒక ప్రత్యేకత.
ఏనాడో వెలిగించిన హోమగుండంలోని అగ్నిహోత్రం ఇప్పటికీ సంరక్షించబడటం ఆలయంలో కనిపిస్తుంది.

💠 వైకుంఠ ఏకాదశి రోజు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వరస్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం. ప్రతి ఏటా వైశాఖమాసంలో స్వామివారి  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

No comments: