ఈరోజు నుండి వైశాఖ పురాణం ప్రారంభం...
1వ అధ్యాయము...!!
1వ అధ్యాయము - వైశాఖమాస ప్రశంస..
🌸నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||🌸
🌷సూతమహర్షి శౌనకాది
మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను.
🌸 మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి
🌿 మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు.
🌸 వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి?
🌿మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును?
🌸 వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.
🌿నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని.
🌸 బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును.
🌿 మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము.
🌸వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును.
🌿 ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు.
🌷విద్యలలో వేదవిద్యవలె,
🌷మంత్రములలో ఓంకారమువలె,
🌷వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె,
🌷ధేనువులలో కామధేనువువలె,
సర్వసర్పములలో శేషునివలె,
🌷పక్షులలో గరుత్మంతునివలె,
🌷దేవతలలో శ్రీమహావిష్ణువువలె,
🌷చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె
🌷యిష్టమైన వానిలో ప్రాణమువలె,
🌷సౌహార్దములు కలవారిలో భార్యవలె,
🌷నదులలో గంగానది వలె,
🌷కాంతి కలవారిలో సూర్యుని వలె,
🌷ఆయుధములలో చక్రమువలె,
🌷 ధాతువులలో సువర్ణమువలె,
🌷 విష్ణుభక్తులలో రుద్రునివలె,
🌷రత్నములలో కౌస్తుభమువలె,
🌷 ధర్మహేతువులగు మాసములలో
వైశాఖమాసముత్తమమైనది.
🌸 విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు.
🌿విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో
🌸శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు.
🌿 అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు.
🌸 వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు.
🌿 వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును.
🌸 స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును.
🌿 సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.
🌸అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను,
🌿తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును.
🌸జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును.
🌿 సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును.
🌸ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు.
🌿వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు.
🌸 మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.
🌿వైశాఖ పురాణం మొదటి రోజు పారాయణం సంపూర్ణము.
No comments:
Post a Comment