తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||
జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలో, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయకి పుష్యమి నక్షత్రంలో , మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.
తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మ గారు దేవతలతో ఒక సభ తీర్చారు......" శ్రీమహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు, రావణసంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరములని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి" అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.
అప్పుడు బ్రహ్మ " ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి" అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతో నీలుడు జన్మించాడు, వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చుసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.
అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం ||
సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా |
వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా ||
రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠమహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటే అగ్ని బీజం, మ అంటే అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మి) కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను (అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠమహర్షి.
తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటె చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.
అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు " నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు " దశరథా ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా? దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా? మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా? అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది నువ్వు తీర్చాలి’ అన్నాడు.
స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం |
కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి ||
నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా, మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను, అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః |
న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః ||
మెల్లగా తేరుకొన్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడ? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే, రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.
రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు.
అప్పుడు దశరథుడు " లేక లేక పుట్టిన నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు " అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, " చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా! పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు" అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు " ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా......
ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం ||
ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ, ఎందుకు అడ్డుపడతావు" అని అన్నాడు.
దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధ్ న్య స్థానం భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు.🙏
🙏 ఓం నమో నారాయణాయ నమః 🙏

No comments:
Post a Comment