Adsense

Saturday, April 1, 2023

అష్ట లక్ష్ములు

 


అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.

ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే!

ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు..
మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ
పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.

గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు
మనకు ఒనగూడుతాయి.

సంతాన లక్ష్మీ :- ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.

విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే.

ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.

విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!

అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...

1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం
6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం
12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం,
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః.

No comments: