శ్రీ సూర్య నారాయణ దండకం.....!!
శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ!!(2సార్లు)
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!
సూర్య నారాయణా వేదపారాయణా లోకరక్షామణి దైవచూడమణి!!
పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!
సూర్య నారాయణా వేదపారాయణా లోకరక్షామణి దైవచూడమణి!!
జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!
సూర్య నారాయణా వేదపారాయణా లోకరక్షామణి దైవచూడమణి!!
దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!
సూర్య నారాయణా వేదపారాయణా లోకరక్షామణి దైవచూడమణి!!
శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!.....
No comments:
Post a Comment