దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి,
పూలకున్న ప్రాధాన్యతేంటి
పూజ చేయాలి అంటే.. ముందు పూలకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి పూలు. నిత్య పూజ అయినా, వారం పూజ అయినా, గుళ్లో అయినా, హోమం జరిగినా ముందుగా పూలు తీసుకుంటాం. ఎన్ని రకాల పూలు పూసినా.. పూజకే. దేవుడికే అనిపిస్తుంది. పూలు, పూజకు విడదీయరాని బంధం ఉంది.
హిందువులు ఎక్కువగా వాడే పూల అర్థాలేంటో తెలుసుకుందాం
దేవుడికి అలంకరించడం నుంచి పూజలోని ప్రతి అంశం పూలతోనే ముడిపడి ఉంటుంది. రకరకాల పూలు, రకరకాల రంగుల్లో దేవుడిని అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని పూలు తప్ప అన్ని పూలనూ పూజలకు ఉపయోగిస్తాం. అలాగే దేవుళ్లకు ఇష్టమైన పూవులతో పూజించడం సంప్రదాయం. అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి, దేవుళ్లకు పూలంటే ఎందుకంత ప్రత్యేకం, దేవుడికి పూలు సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటనేది చూద్దాం...
పూలు కోసేటప్పుడు
దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసేముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి, చెట్టుకు నమస్కరించాలి. పువ్వులను కర్రతో దులపకూడదు. చేత్తోనే కోయాలి. కోసిన పూలను కిందపెట్టకూడదు. తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు... పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు. ఈ నియమాల్లో దేనిని తప్పినా... సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదట.
పూలు వాడే విధానం
పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్లుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు ఉపయోగించరాదు.
దేవతలకు
దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని శాస్ర్తం చెబుతోంది. కలువ పూలంటే మహాలక్షికి ఎనలేని ప్రీతి. అలాగే తెల్లని పూలంటే.. చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు పార్వతీదేవికి ఇష్టం. కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం.
దేవుళ్లు
మహా శివుడిని బిల్వ పత్రాలతో, శ్రీ చక్రాన్ని, విష్ణువుని పారిజాత పుష్పాలతో పూజించాలి.
శ్రేయస్కరమైన పూలు
తామర, కలువ, జాజి, చామంతి, నందివర్దనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్రగన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం.
పూజ సమయంలో
ముందు రోజు సమర్పించిన పూలను బొటనవేలు, చూపుడు వేలుతో తీసేయాలి. తాజా పూలను బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలుతో దేవుడికి సమర్పిస్తే మంచిది.
పూలు ఎందుకు
పూజలకు పూలు వాడటం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది. భక్తితో, పవిత్ర మనస్సుతో ఎవరైతే పూలుతో గానీ, పండుతోగానీ, నీటితో గానీ దేవుడికి పూజ చేస్తారో.. వాళ్ల భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు గీతలో వివరించాడు. అందుకే.. పూజలకు పూలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
No comments:
Post a Comment