శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, తేతలి, పశ్చిమ గోదావరి
💠 తారకాసుర సామ్రాజ్యంగా పిలువబడే మన తణుకు ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.
అలాంటి వాటిలోకి చెందిందే తేతలి లోని
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం...
⚜ తేతలి గ్రామ నామ విశిష్ఠత ⚜
💠 రాజరాజనరేంద్రుని కోరికపై నన్నయ (11వ శతాబ్దము) ఈ గ్రామములోని శ్రీ రాజేశ్వరస్వామి ఆలయములో తొలిసారిగా తెలుగులో భారతరచన ప్రారంభించెను అంటారు.
ఆ కారణంచేత ఈ గ్రామమునకు
తొతెలి అని పేరు వచ్చెను.
" తొ " అనగా తొలిసారిగా " తె " అనగా తెలుగు " లి " అనగా లిపిలో మహాభారత.రచన చేయుటచే ఈ గ్రామమునకు తొతెలి అని పేరు వచ్చినది.
క్రమ క్రమంగా తేతలి అని స్థిరపడినది.
💠 ఈ ఆలయములోని శివలింగము బ్రహ్మసూత్రముతో స్వయంగా వెలసినది.
⚜ స్థల పురాణం ⚜
💠 ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజరాజనరేంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణాన్ని బట్టి తెలుస్తుంది.
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రాజరాజనరేంద్రుడు గొప్ప శివభక్తుడు. ఆయన పాలనాకాలంలో ఆయన రాజ్యంలో ఎన్నో శివలింగాల్ని ప్రతిష్టించి శివాలయాల్ని నిర్మించినట్లు చారిత్రక విశేషాల ద్వారా వెల్లడి అవుతుంది.
💠 రాజరాజనరేంద్రుడు అప్పటి దండకారణ్య ప్రాంతమైన తేతలి ప్రాంతానికి వేటనిమిత్తము ఇక్కడికి రాగా అశ్వము ముందుకు నడవలేక అచ్చటనే ఆగి పోయినది.
కొంత సేపటికి రాజు ఎదుట ఒక కృష్ణసర్పము కనిపించెను గుఱ్ఱము మెల్లగా వెనుదిరగగా రాజు తన నివాసమునకు వెనుదిరిగెను.
💠 ఆ రాత్రి స్వప్నములో రాజుకు ఆదిశేషుడు కనిపించి నీవు వేటకు వెళ్ళినపుడు అశ్వములు ఆగిన ప్రదేశములో శివలింగమున్నది దానిని వెలికిదీసి అక్కడ ఆలయ నిర్మాణము చేయుమని తెలుపగా, రాజు ఆ శివలింగమును వెలికిదీసి ఆలయనిర్మాణము చేసి ఆ శివలింగమును ప్రతిష్ఠించెను.
💠 రాజరాజనరేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగము కనుక ఈ శివునకు శ్రీ రాజేశ్వరుడు అని నామము కలిగినది.
ఈశివలింగముపై బ్రహ్మసూత్ర చిహ్నముండుట విశిష్ఠత.
💠 శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు చెప్పినట్లుగా ఈ ఆలయంలో అర్చనకు సంబంధించినవి ఏమి చేసినా కోటిసార్లు చేసిన ఫలితమునిచ్చును.
ఇది స్వయంభూలింగమై బ్రహ్మసూత్ర చిహ్నముతో కూడి యుండుటయే దీనికి కారణము.
💠 రెండు నందుల విశిష్ఠత :
ఈ ఆలయములో శివలింగమునకు ఎదురుగా ఏ శివాలయములోను లేని విధంగా రెండు నందులు కలవు. పూర్వకాలము శివలింగమునకు ఎదురుగా ఒక నందిని ప్రతిష్ఠించిరి.
వైద్య సదుపాయములేని రోజులలో గర్భవతులకు ప్రసవసమయంలో ప్రసవము కష్టతరమైనపుడు వారి కుటుంబసభ్యులు ఈ దేవాలయమునకు వచ్చి అర్చకులకు విషయము తెలుపగా వారు నంది విగ్రహమునకు దీపారాధన చేసి, కొబ్బరికాయను కొట్టి శివునకు ఎదురుగా పశ్చిమ ముఖముగా నున్న నందివిగ్రహమును తూర్పుముఖముగా గ్రామమువైపునకు తిప్పెడివారు. కొంతసేపటికి ప్రసవవేదన పడుతున్న స్త్రీకి సుఖప్రసవమై తల్లీబిడ్డ సుఖంగా నుండెడివారు.
వారు తిరిగివచ్చి సుఖప్రసవ విషయమును అర్చకులకు తెలుపగా అర్చకులు నందిని తిరిగి శివలింగము వైపు తిప్పెడివారు.
💠 ఆలయ ప్రధాన ద్వారంపై నటరాజస్వామి, వినాయకుడు, దత్తాత్రేయుడు, అర్ధనారీశ్వరుడు, కుమార స్వామి, అయ్యప్ప స్వామి, అంబికా దేవి, మార్కండేయ మూర్తులు భాసిల్లుతుంటాయి.
💠 ఆలయం వెలుపల ఆరుబయట ప్రాంగణంలో నందీశ్వరుని భారీ విగ్రహం వర్ణరంజతంగా నెలకొని ఉంటుంది.
గర్భాలయ ముఖద్వారం దీపతోరణమై భాసిల్లుతుంది.
💠 గర్భాలయంలో రాజేశ్వర స్వామి సకల రాజోపలాంచనాలతో విరాజిల్లుతుంటాడు. సర్వాలంకార భూషితంగా, సమస్త వైభవోపేతంగా అలరారుతుంటాడు. విలక్షణమైన ఆహార్యంతో, అలంకారంతో రాజేశ్వరుడు రమ్యమోహనంగా భక్తులకు దర్శనమిస్తాడు.
పట్టువస్త్రాల్ని కట్టబెట్టి,పుష్ప మాలికలతో మకరతోరణంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ తరహా అలంకారం శివలింగ మూర్తికి ఎంతో అరుదైనదిగా భావిస్తారు.
💠 ఈ అలయంలోనే రాజేశ్వర దేవి పార్వతీ దేవిగా పూజలందుకుంటుంది.తేతలి రాజేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజలందుకుంటున్నారు. గోశాలలో గోపాలుని దివ్యమంగళ విగ్రహం భక్తులని ఆకట్టుకుంటుంది.
💠 తేతలి రాజేశ్వర స్వామి ఆలయంలో ఆయా ప్రత్యేక సంధర్భాల్లో, పర్వదినాల్లో ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు.
ఈ క్షేత్రంలో శైవ, వైష్ణవ, శాస్త్రీయ పర్వదినాలన్నీ వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆగముక్త విధానంగా నిత్యపూజలతో మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు నిర్వహిస్తారు.
💠 మాఘబహుళ చతుర్దశి అనగా మహాశివరాత్రికి ముందు మూడు రోజులు అనగా బహుళ ఏకాదశి నుంచి చతుర్దశి వరకు నాలుగు రోజులపాటు రాజేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు.
చైత్రమాసంలో శ్రీ సీతారామస్వామి వారికి వసంత నవరాత్రుల్ని నిర్వహిస్తారు.
💠 సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి కల్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహిస్తారు.
💠 తణుకు నుంచి 3 కి.మీ. దూరం
No comments:
Post a Comment