Adsense

Saturday, May 6, 2023

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం, భీమవరం, పశ్చిమ గోదావరి

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం, భీమవరం, పశ్చిమ గోదావరి

💠 ఆది పరాశక్తి అయిన శ్రీ లలితా దేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ వున్నది.
ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్ర హృదయురాలిగా పూజలందుకుంటున్నది.
అటువంటి ఒక గ్రామ దేవత మావుళ్ళమ్మ ఆలయం.
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు.

💠 శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామ దేవత. 
గ్రామదేవతలలో ఎవరికీ లేనంత విశేష భక్తజనాదరణ భీమవరం మావుళ్లమ్మకు ఉంది.
ఈ ఆలయంకి వెలలేని ఆభరణాలు, కోట్ల ఆస్తులున్నాయి.

💠 శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు వెలసిన ప్రాంతంపై అనేక కథనాలు ప్రచారంలో - ఉన్నాయి. శ్రీ అమ్మవారు వీరవాసరం సమీపంలోని రాయకుదురు గ్రామంలో వెలిశారని  కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రాంతవాసులు విశ్వసించే చరిత్ర ఈ విధంగా ఉంది.

⚜ ఆలయ చరిత్ర ⚜

💠 శ్రీ మావుళ్ళమ్మ తల్లి క్రీ. శ. 1200 సంలో వెలిసినట్లు చెబుతారు. శ్రీ అమ్మవారి గుడి విషయమై 1880 సం నుండి మాత్రమే చరిత్ర లభ్యమౌతోంది. భీమవరం పట్టణం ప్రస్తుతం ఉన్న మోటుపల్లివారి వీధిలో అమ్మవారి నగలు భద్రపరచుటకు నిర్మించిన భవన ప్రాంతంలో వేప, రావిచెట్లు కలిసి ఉన్నచోట్ల శ్రీ మావుళ్ళమ్మ వెలిశారని తెలుస్తోంది. మామిడిచెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభప్రదమైన మామిడి పేరు మీదుగా మామిళ్ళ అమ్మగా... అనంతరం మావుళ్ళమ్మగా రూపాంతరం చెందిందని అభిప్రాయం.
చిన్న చిన్న ఊళ్ళవారంతా కలిసి అమ్మవారిని గ్రామదేవతగా కొలుచుటే మావుళ్ళ అమ్మ.... మావుళ్లమ్మగా రూపాంతరం చెందిందని మరికొందరి అభిప్రాయం.

💠 1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను వెలసిన ప్రాంతం వివరించి ఆలయం నిర్మించవలసినదిగా ఆదేశించారని పెద్దలు చెబుతారు. అమ్మవారి ఆదేశానుసారం శోధించగా శ్రీ మావుళ్లమ్మ వారి శిలావిగ్రహం కనిపించింది. విగ్రహానికి ఎండ తగలకుండా ఒక పూరిపాకవేసి పూజలు చేసేవారు.
అనంతరం మాచిరాజు, అప్పన్నలు ఆదివారం బజార్ (పూర్వం ఐదు లాంతర్గస్తంభం) ప్రాంతంలో ఆలయం నిర్మించారని తెలుస్తోంది.

💠 1910 ప్రాంతంలో భీమవరాన్ని ముంచెత్తిన వరద తాకిడికి అమ్మవారి విగ్రహం చాలా వరకు శిథిలమైంది.
1920 ప్రాంతంలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అవిరళ కృషి సలిపి శ్రీ అమ్మవారి విగ్రహాన్ని గర్భాలయానికి నిండుగా మలిచారు.
చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా వుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.
ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.

💠 తొలినుండి మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి భీమరాజు వంశస్తులైన వారి పూర్వీకులు అమ్మవారి పుట్టింటి వారుగాను, గ్రంధి అప్పన్న మొదలైన వారి పూర్వీకులు అత్తింటివారి గాను అమ్మవారి ఉత్సవాల్లో ప్రాధాన్యత వహిస్తున్నారు.

💠 మావుళ్ళమ్మ ఒక గ్రామ దేవత అయినా కూడా ఒక గ్రామ దేవతకి ఇంతటి సంపద ఉండడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత...
అమ్మవారి ఆలయానికి భక్తులు కానుకలు చీరలు ద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాలు 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు.

💠 ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత.
ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు.

💠 అమ్మవారికి  జాతర, ఉత్సవాలు వేరు వేరుగా జరుపుతారు.దేవీ నవరాత్రులు లో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు.

💠 ప్రతిరోజూ లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు.ప్రతి ఏడు జనవరి 13 నుంచి 40 రోజుల
పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.

💠 ఆ తరువాత జ్యేష్ట మాసము లో
నెలపాటు గ్రామజాతర  నిర్వహిస్తారు.
ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అంతరించిపోతున్న కళారూపాలకు మావుళ్లమ్మ జాతరలో ఇతోధికంగా ప్రోత్సాహం లభిస్తుంది. బుర్రకథలు, హరి కథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు ఇలా అనేక ప్రదర్శనలుంటాయి. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

💠  ఏలూరుకు  సుమారు 90
కిమీ దూరంలో భీమవరం వుంది.

No comments: