Adsense

Friday, May 5, 2023

శ్రీ దానేశ్వరి అమ్మవారి దేవాలయం, దువ్వ, పశ్చిమ గోదావరి జిల్లా



 శ్రీ దానేశ్వరి అమ్మవారి దేవాలయం, దువ్వ, పశ్చిమ గోదావరి జిల్లా


💠 ఈ అమ్మవారు భక్తుల కోరిన కోర్కెలు నెరవేరుస్తూ, భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఎంతో మహిమ గల దేవిగా పూజలందుకుంటుంది.
అయితే కొన్ని సంఘటనల ఆధారంగా ఆ దేవి భక్తులను ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది అని స్థానికులు చెబుతున్నారు.
మరి ఆ మహిమగల అమ్మవారు ఎవరు?

💠 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు తాలూకాకు సుమారు 7 కి.మీ. దూరంలో దువ్వ అనే గ్రామంలో శ్రీ దానేశ్వరి అమ్మవారు అనే గ్రామదేవత కొలువై ఉన్నారు. శ్రీ దానేశ్వరి అమ్మవారు తేత్రాయుగం నుండి ఈ ప్రాంతంలో అదృశ్య రూపమున కొలువై ఉన్నట్లు తెలియచున్నది.
అయితే పూర్వం దువ్వకు దుర్వాసపురం అని పేరు.
దుర్వాస మహాముని అఖంగా తపస్సు చేసిన ప్రదేశమగుటచే ఈ ప్రాంతం అంత కూడా పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది.
ఇంకా ఈ గ్రామంలో 300 సంవత్సరాల క్రితం నిర్మించిన సీతారాముల దేవాలయం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉన్నవి.

💠 రేలంగిలో విశ్వామిత్రుడు యజ్ఞము చేసినట్లు,  రేలంగి ప్రదేశములోనే శ్రీ రాముడు తాటకిని చంపి, శివలింగమును ప్రతిష్ట చేసినట్లున్నూ అందువలననే అచట గల శివునికి "తాటకేశ్వరుడు" అని పేరు వచ్చినట్టున్నూ, రాక్షసులను నివారించుటకై రామలక్ష్మణలు కావలియున్న ఆ ప్రదేశమునకు 'కావలిపురము' అని పేరు వచ్చినట్టు భావిస్తారు.

💠 ఈ ఆలయాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు.1967 కి ముందు వనదేవత దానమ్మ రూపంలో భక్తులు పూజించే చెట్టు ఉండేది. ఈ చెట్టు 1967 లో కూలిపోయింది. అప్పుడు స్థానిక భక్తులు ఒక ఆలయాన్ని నిర్మించి శ్రీ దనేశ్వరి అమ్మవరును స్థాపించారు. ప్రధాన దేవత పక్కన సరస్వతి దేవి మరియు లక్ష్మీ దేవి దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం తరువాత కోనేరు ఉంది.

💠 గర్భాలయంలో అమ్మవారి మూర్తి చాలా చిన్నదిగా దర్శనమిస్తూ ఉంటుంది.
అమ్మవారి మహిమలు అపారమని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. చాలాకాలం క్రితం అమ్మవారు ఇక్కడ 'ధాన్యేశ్వరి'గా పూజలు అందుకునేదట. అమ్మవారిని పూజించడం వలన ధన ధాన్యాలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు.
కాలక్రమంలో అమ్మవారు 'దానేశ్వరి'గా పిలబడుతోంది.
ఇప్పటికీ అమ్మవారిని 'వనదేవత'గానే ఆరాధిస్తుంటారు.
వానలు కురిసేది .. పంటలు బాగా పండేది .. సంపదలు వృద్ధి చెందేది ఈ అమ్మవారి అనుగ్రహం వల్లనే అని భక్తులు విశ్వసిస్తుంటారు.

💠 ప్రతి వైశాఖ మసంలో 5 రోజులు జరుపుకునే బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
దువ్వలో దానేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏటా రూ. కోటికి పైగా ఆదాయం వస్తుంది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందుతుంటారు.

💠 దానేశ్వరి దేవి మహిమగల తల్లి అనుటకు ఒక నిదర్శనం 1950 – 51 సంవత్సర ప్రాంతంలో దువ్వ – ఉరదళ్లపాలెం లో నూతనంగా రోడ్డు మార్గం నిర్మించారు. అయితే కారు, లారీ డ్రైవర్లకు ఆ తల్లి మహిమ వల్ల బరువుతోను, వేగంగా వచ్చు లారీల ముందు చక్రాల టైర్లు హఠాత్తుగా పగిలిపోయిన గూడా లారీకి గాని డ్రైవర్లకు గాని ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

💠 ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతం చాలా శక్తివంతమైనది అని, అపరాధం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని ప్రజలలో విశ్వాసం ఉంది.

💠 ఈ అమ్మవారి ప్రాంత భూములలో గల ధాన్యపు రాసులను ఎవరు దొంగిలించేవారు కాదంటా. ఇలా రైతులను, భక్తులను కన్న బిడ్డలవలె కాపాడుచూ తమ బిడ్డలకి ఎలాంటి కష్టాలు రాకుండా చూసే చల్లని తల్లిగా ఈ ప్రాంత ప్రజలలో బలంగా నాటుకుపోయింది.
ఈ విధంగా ఎంతో మహిమ గల ఈ తల్లిని దర్శించుకోవడానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.


💠 తణుకు (12 కి.మీ) మరియు ఏలూరు (70 కి.మీ) నుండి తరచుగా బస్సులు నడుస్తాయి.

No comments: