Adsense

Friday, May 12, 2023

ఘటోత్కచుడు శ్రీకృష్ణుని దగ్గర పొందిన వరం...!!

ఘటోత్కచుడు శ్రీకృష్ణుని దగ్గర పొందిన వరం...!!


🌿మహాభారతంలో పాండవులు లక్క ఇంటిని నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు.

🌸అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు. వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు.

🌿 తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు.

🌸కానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది.

🌿భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది. భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు.

🌸ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు. సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు.

🌿అయితే ధర్మరాజు అడ్డుకొని ఒక మహిళను చంపడం భీముని వంటి వీరునికి తగదని వారిస్తాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది.

🌸అప్పుడు కుంతీ దేవి హిడింబిని పెళ్ళాడమని కుమారుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు.

🌿హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు.

🌸తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు.

🌿అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.మహాభారత యుద్ధంలో పాండవుల తరుపున ఘటోత్కచుడు ప్రముఖ పాత్ర పోషిస్తాడు.

🌸కౌరవ సేనను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. కురు సైన్యాన్ని చిందరవందరగా చేసి రణరంగంలో బీభత్సం సృష్టించాడు.

🌿తనని నిలువరించలేక చివరికి అర్జునుడిని ఆచరించడానికి ఇంద్రుని దగ్గర నుండి వరంగా పొందిన అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు కర్ణుడు.

🌸నేలకొరుగుతూ కూడా లక్ష మంది సైన్యాన్ని మట్టు బెట్టాడు. ఘటోత్కచుడి భారీ కాయం కింద పడి దాదాపు లక్ష మంది సైనికులు మరణించినట్టు చరిత్ర చెబుతుంది.

No comments: