నరసింహుడి పేరు తలచినంతనే ఉగ్రరూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. స్తంభంలో నుంచి ఉద్భవించి, రాక్షసుడైన హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడిన వైనం గుర్తుకు వస్తుంది. ఆ ఉగ్రనరసింహుడు శాంతించిన ప్రాంతం, భక్తవరదుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అష్టదిక్పాలకులతో ఏర్పడిన అష్టభుఖీ కోనేరు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ.
అష్టముఖి కోనేరు...
కలియుగం ప్రారంభంలో ఈ దండకారణ్యంలో ఋషులు తపస్సు చేసే సమయంలో రాక్షసులు వారికి ఆటంకాలు సృష్టించేవారు. రాక్షసుల బారినుంచి కాపాడమంటూ ఋషులు నరసింహస్వామిని వేడుకోగా, స్వామి ఆజ్ఞ మేరకు అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కులకూ కాపలా ఏర్పడ్డారు. ఋషుల తపస్సు నిర్విఘ్నంగా సాగేందుకు మధ్యలో నీటి కొలనును ఏర్పాటుచేశారు. అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది.
శనిత్రయోదశి లాంటి విశేషమైన రోజుల్లో శనిదోషాలు ఉన్నవారు ఈ కోనేటిలో స్నానం చేసి గుట్టమీద ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.
నరసింహస్వామిని దర్శించినంతనే గ్రహ దోషాలు పోతాయని ప్రతీతి.
జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి. నాభిలో సాలగ్రామాన్ని ధరించిన ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి రూపం శివకేశవుల మధ్య అభేదాన్ని తెలుపుతుంది. రుద్రుడే క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించినంతనే గ్రహ దోషాలు పోతాయని ప్రతీతి.
స్థలపురాణం
తన తండ్రి పెడుతున్న హింసల నుంచి బాలుడైన భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఆ శ్రీమన్నారాయణుడే నరసింహుడి అవతారం ఎత్తుతారు.
హిరణ్యకశ్యపుడిని సంహరించిన అనంతరం స్వామి ఆ ఉగ్రరూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటారు. అక్కడి ఆహ్లాదవాతావరణానికి ముగ్ధుడైన నారసింహుడు అక్కడే సేదతీరుతాడు. ఆ అరణ్యంలోనే తపస్సు చేసుకుంటున్న ఋషులు స్వామి ఉగ్ర రూపాన్ని చూసి భీతిల్లుతారు.
అనంతరం స్వామిని మామూలు స్థితికి తీసుకొచ్చే మార్గాన్ని ఉపదేశించమని బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారు.
బ్రహ్మ దేవుడు సూచనమేరకు గండకీ నదీతీరంలోని సాలగ్రామాన్ని తీసుకొచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా, శాంతించిన స్వామి అక్కడే లక్ష్మీనరసింహుడిగా వెలిశారని స్థలపురాణం.
లక్ష్మీనరసింహుడి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే శనిదోషాలు పోతాయని ప్రతీతి.
అందుకే శనివారంతోకూడిన అష్టమీ, అమావాస్య తిథుల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపద వరకూ లక్ష్మీనరసింహస్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
వీటిని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించారని చెబుతారు. అధ్యయన ఉత్సవంతో ప్రారంభమైన ఈ సంబరాలు చక్రతీర్థంతో ముగుస్తాయి. ఇందులో ద్రవిడ ప్రబంధ పారాయణం, స్థపనం, మాతృకాపూజ, రక్షాబంధనం, అంకురార్పణ, శాలప్రతిష్ఠ, వాస్తుహోమం, కల్యాణం, రథోత్సవాలు ఉంటాయి.
వీటిలో భాగంగానే కుస్తీపోటీలను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించడానికి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
జానకంపేటలో కొలువైన లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవడానికి రైలూ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రం నిజామాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోబోధన్ బాసర వెళ్లే మార్గంలో ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచీ నిజామాబాద్ జిల్లాకేంద్రానికి బస్సు సదుపాయం ఉంది. అక్కడి నుంచి ఆటోల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చేవారు... నిజామాబాద్ స్టేషన్‌లో దిగి, రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.
No comments:
Post a Comment