Adsense

Tuesday, May 2, 2023

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా

💠 దేవతలు లోకకళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి.  భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుదని చెబుతుంటారు.
వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి ఎంతో విశిష్టత వుంది.
పార్వతి దేవి కన్యకా పరమేశ్వరి దేవిగా అవతరించి  వైశ్యులకి కులదేవతగా మారింది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెనుగొండ'లో విలసిల్లుతోంది.

💠 సుమారు మూడువేల సంవత్సరాల నుండే ఈ క్షేత్రంలో  శ్రీనగరేశ్వరస్వామి వారి ఆలయం ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతరకాలంలో శ్రీవాసవీమాతను ప్రతిష్ఠించిన తరువాత ఈ క్షేత్రం వాసవీకన్యకాపరమేశ్వరీ క్షేత్రంగా ప్రసిధ్ధికెక్కింది.

⚜ ఆలయ చరిత్ర ⚜

💠 పశ్చిమగోదావరి జిల్లాలో  పెనుగొండ అనే గ్రామంలో పదవ దశాబ్దంలో కుసుమ శ్రేష్టి అనే ఉత్తముడు నివసించేవాడు.
ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి.
పెళ్లయ్యి చాలాకాలం దాకా ఈ పుణ్య వైశ్య దంపుతులకి సంతాన భాగ్యం కలుగలేదు. అందుకని కుసుమశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది.

💠 ఆ ఫలములను భుజించిన కౌసుంబి పది నెలలో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను కవలపిల్లలను ప్రసవించింది.
పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యొతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడశిశివుకు వాసవి అని, విష్ణు అంశంతో పుట్టిన మగశిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు.

💠 వాసవీ గొప్ప గుణవంతురాలే కాకుండా సౌందర్య తునకలా ఉండేది.
ఆమెని విష్ణువర్డనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే వైశ్య కుటుంబంలో జన్మించిన వాసవికి , క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించాడు కుసుమశ్రేష్టి.

💠 విష్ణువర్థనుడు కోపోద్రోక్తుడై ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుని పోయి వివాహానికి సిద్దమయ్యేడు.

💠 ఆ విషయం వాసవికి తెలియజేయగా, అందుకు, తండ్రితో ఇలా అన్నంది. తండ్రి! అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది.

💠 భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి. అగ్నిప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమ శ్రేష్టి ఖిన్నుడయ్యాడు.

💠 కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు.
కులగౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పినవారందరూ అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు.

💠 వాసవి వారికి  అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు. ఒక్కోక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది.  అందరు అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు.

💠 అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. "ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు ,నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి.

💠 ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది.

💠 పెనుగొండ ప్రజలు  వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం 7 అంతస్థులతో ఎంతో అందంగా కనిపిస్తుంది.

💠 వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం, వాసవి తల్లిదండ్రులు కుసుమశ్రేష్టి, కౌసుంభిల విగ్రహాలు, నవగ్రహాలు మొదలైనవి ఉన్నాయి

💠 ఇరువైపులా రెండు నందులు. ధ్వజస్తంభం. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు.

💠 ఆలయంలో పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది.

💠 ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువైయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం.
ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైంది. ఒకచేత చిలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది.

💠 లక్ష్మీ జనార్ధనస్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి
ఆ రోజులలో ఇక్కడ కుమారిపూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఒక బాలికను వాసవీమాతగా భావించి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మహిళలు కోలాటములు, భజనలు చేస్తారు.

💠 ప్రస్తుతం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మరింత తీర్చిదిద్దారు.
స్వర్ణ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు.

No comments: