ఈ యంత్రమునకు శ్రీనగరమనియు, శ్రీచక్రమనియు, శ్రీ మహాత్రిపుర సుందరీ యంత్రమనియు వ్యవహారము కలదు.
చత్వారి శివ చక్రాణి శక్తి చక్రాణి పంచచ |
సామరస్యా ద్భవేచ్చక్రం శ్రీ చక్రం సర్వరూపకం ॥
అని శక్తి సంగమ తంత్రములో చెప్పబడిన ప్రకారము నాలుగు శివచక్రముల యొక్కయు, ఐదు శక్తి చక్రముల యొక్కయు, సామరస్యము వలన యేర్పడినది గనుక శ్రీ చక్రము సర్వరూపమును బొందిన దగుచున్నది.
శుద్ధచక్ర మిదం ప్రోక్త మిద మేవ త్రిధాభవేత్ |
భూః కైలాస స్తధా మేరు: ప్రస్తారత్వేన పార్వతి ॥ భూప్రస్తారోద్విధాదేవి పాతాళోర్ధ్వక్రమేణతు ॥
కైలాసాఖ్యస్తు ప్రస్తారో ద్వివిధః పరికీర్తితః ॥
అర్ధకైలాస సంజ్ఞస్తు పూర్ణకైలాసకస్తధా
తధైవ మేరు ప్రస్తారః కీర్తితస్తు మయాతవ ॥
(శక్తి సంగమతంత్రం) శివశక్త్యాత్మకమగు శ్రీ చక్రమునకు శుద్ధ చక్రమనిగూడ నామాంతరము కలదు.
ఇది మూడు విధములుగా నుండును.
1. భూప్రస్తారము 2. కైలాస ప్రస్తారము 3. మేరు ప్రస్తారము, ఇందు భూప్రస్తారము పాతాళ భూప్రస్తార మనియు, ఊర్ధ్వ భూప్రస్తారమనియు రెండు విధములు, కైలాస ప్రస్తారము అర్థకైలాస ప్రస్తారమనియు, పూర్ణకైలాస ప్రస్తారమనియు రెండు విధములు, మేరు ప్రస్తారము అర్థమేరు ప్రస్తారమనియు, పూర్ణమేరు ప్రస్తారమనియు రెండు విధములు గలదగుచున్నది.
ఇట్టి శ్రీ యంత్రమ ప్రకృతి పురుషాత్మకమైన దగుటవలన సమస్త యంత్రములలో నగ్రగణ్యమైనదగుచు మిక్కిలి ప్రాముఖ్యతను బొందియున్నదనుట నిర్వివాదాంశము.
చతుష్టష్టియుతాః కోట్యోయోగినీనాం మహాప్రియే |
చక్రేస్మిన్ సన్నివిష్టాస్తా స్పాధకం మానయంతిహి ॥
ఈ చక్రమునందు అరువదినాల్గు కోట్లయోగినీ దేవతలచే సేవింపబడుచు శ్రీ మహాత్రిపుర సుందరీదేవి నివసించియున్నది. గనుక శ్రీ చక్రమును పూజించుచు శ్రీ మహాత్రిపురసుందరీ మహామంత్రమును జపము చేయువారలకు శ్రీ మహాత్రిపుర సుందరీదేవికి పరివారముగనున్న అరువదినాల్గు కోట్ల యోగినీ దేవతలు గూడ సమస్త కోరికలను, సర్వసిద్ధులను గలుగజేయుదురు. ఈ శ్రీచక్రమును సందర్శించిన మాత్రముననే సమస్త కోరికలు సిద్ధించునని కూడ జ్ఞానార్ణవమందు చెప్పబడియున్నది.
ఈ మహోత్కృష్టమైన శ్రీ చక్రమును బీజములు లేకుండగ భూప్రస్తారముగ కొందఱును, మేరు ప్రస్తారముగ మఱికొందఱును పూజించు నాచారముగలదు గాని ఆ శ్రీ చక్రములందు బీజములు లేకపోవుట వలన జీవ (ప్రాణ) ములేక పోవుటచే నిర్జీవత్వమును బొందిదవగుచు శవముతో సమానమగుచున్నవి.
బీజం వినాతు నిర్జీవం శవవత్సరికీర్తితం,
బీజయుక్తంభవేద్యంత్రం నిశ్శప్తరానిద్దిదాయకం
బీజములేని శ్రీ చక్రము జీవ (ప్రాణము) లేనిదై శవముతో సమానమైనదగుచున్నది బీజయుక్తమైన శ్రీ చక్రము సజీవమైనదియు, నిశ్శప్తమైనదియు, సిద్ధిప్రదమైనదియునగు చున్నదని శక్తి సంగమతంత్రమందు చెప్పబడిన ప్రకారము బీజరహితమైన శ్రీ చక్రము నర్పించువారు శ్రీ మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహమును బడయు లేక పోవుటయే గాక శాపగ్రస్తులు గూడ నగుచున్నారు బీజములులేని శ్రీ చక్రము శవముతో సమానము గనుక బీజరహితమైన శ్రీ చక్రమును పూజించుట శవమును పూజించినట్లగును గనుక బీజసహితమైన శ్రీ చక్రము నిశ్శప్తమైనదియు, సర్వసిద్ధులను గలుగజేయునది యునగును కనుకనే
శ్రీ చక్రం బీజసంయుక్తం నిశ్శప్తంపరమేశ్వరి
బీజహీనం తుయచ్చంక్రం తచ్చక్రం నచ సిద్దిదం ॥
అని శక్తి సంగమతంత్రమందు చెప్పబడియున్నది.
ఈ శ్రీ యంత్రమును చక్కగా రాగిరేకు పై వేయించిగాని, మేరు ప్రస్తారాది రూపములతో యధావిధిగ చేయించిగాని ఈ యంత్రకాగితము పటముగా కట్టించి గాని ప్రతినిత్యము ఉదయాస్తమయములయందు సందర్శించు చుండిన శ్రీ మహా త్రిపురసుందరీదేవి యొక్క అనుగ్రహముచే సౌఖ్యము ఆరోగ్యము ఐశ్వర్యము పూర్వజన్మ మందలి పాతకోపపాతకాదులచే సంప్రాప్తమైన `దీర్ఘవ్యాధులు నశించుట గ్రహదోష నివారణము మున్నగునవి గలుగుచుండుటయే గాక సమస్త కోరికలు నెరవేరుచుండును.
ఇంతియగాక ఈ శ్రీ చక్రమునకు “పత్రం పుష్పం ఫలం తోయం" అను రీతిని పత్రము, పుష్పము, ఫలము, ఉదకము కుంకుమ, ధూపము మున్నగు వానిని యధాశక్తిని సమర్పించి ధ్యానము చేయుచున్న యెడల సమస్త వృద్ధికోరికలు సిద్ధించును, భోగారోగైశ్వర్య విజయో త్సాహములు గలుగుచుండును.
ఈ శ్రీ చక్రమునకు ప్రతి నిత్యము ఉదయాస్తమయముల యందు షోడశోపచార పూజలు చేయుచు ప్రతి శుక్రవారమునను లలిత సహస్రనామములతో పూజ చేయుచున్న యెడల సమస్త దుష్టత్వములు, కష్టనష్ట దుఃఖబాధలు నశించి, సర్వసిద్ధులు సామ్రాజ్యప్రాప్తి గలుగును.
ఈ శ్రీ చక్రమును యధావిధిగా అమ్నాయార్చన, సమయదేవతాది పూజనము ఆవరణార్చన మున్నగు వానిని జేయుచు మూలవిద్యతో ఉపచార పూజాదులు జేసి, మంత్రము నుపాసించువారికి అణిమాద్యష్టసిద్ధులు సులభముగా సంప్రాప్తించుననుట నిస్సంశయము.
No comments:
Post a Comment