కలియుగ వైకుంఠనాథుడ్ని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులు.. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకొంటారు. శ్రీవారి మెట్టు మార్గంతో పోలిస్తే అలిపిరి కాలిబాట దూరం ఎక్కువ. భక్తులు ఈ మార్గాలని ఎంచుకొని తిరుమల చేరుకొంటారు. 4 కిలోమీటర్లున్న శ్రీవారి మెట్టు మార్గంలో 2,400 మెట్లున్నాయి. అలిపిరి నుంచి తిరుమల వరకు మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. 7.5 కిలోమీటర్ల దూరమున్న నడక దారిలో చివరి మెట్టు వరకు కూడా భక్తులు తడవకుండా షెల్టర్లు ఉన్నాయి
తిరుమల కాలినడకన వస్తానని మొక్కుకున్న వారు అలిపిరి నుంచి, శ్రీవారి మెట్లు ద్వారా తిరుమల చేరుకొని మొక్కు తీర్చుకుంటారు.
అలిపిరి:
కొండ దిగువభాగాన్ని తమిళులు “అడివారం” అని అంటారు. శిష్టులైనవారు “అడిపడి” (మొదటిమెట్టు) అని వ్యవహరిస్తారు. కానీ ఈనాడు “అలిపిరి” అన్న శబ్దానికే వ్యాప్తి ఉంది. ఈ శబ్దానికి సంబంధించి రెండు కథనాలున్నాయి. ఒకటి ఆదిశేష అంశతో కూడిన ఒక పెద్ద చింతచెట్టు ఉండటం. వైష్ణవంలో చింతచెట్టుకు ప్రాధాన్యమెక్కువ. నమ్మాళ్వార్ చింతచెట్టు తొర్రలోనే చాలాకాలం ఉండి దర్శనభాగ్యం కల్గించేవారట. అడివారంలో పులి (చింతచెట్టు) ఉండటం వల్ల అడిపులిగా స్థిరపడి వ్యవహారంలో అలిపిరిగా మారిందంటారు. ఇదేకాక హైదరాలి దండెత్తి వచ్చినపుడు కొండ మీది దేవుడెవడని అడిగినప్పుడు హిందూమంత్రి వరాహం అని చెప్పినప్పుడు ఆ వరాహ శబ్దార్థం “సువరే” అని తెలియగానే హైదరాలి గుర్రం పై దౌడుతీస్తూ పారిపోగానే అక్కడివారు ఆలీపారె అన్నారట. ఆలీ పారిపోయాడని అర్ధం. “ఆలీపారె” అనేదే వాడుకలో “అలిపిరి” అయ్యిందని కొందరు చమత్కరిస్తూ ఉంటారు.
పూర్వం రవాణా సౌకార్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమల పైకి వెళ్ల డానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారే శరణ్యం. సుధూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ వున్న సత్రాలలో కొద్ది సేపు సేదతీరే వారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడచి వెళ్లే వారు. నడవ లేని వారికి డోలీలు వుండేవి. వాటిని మనుషులు మోసే వారు. అప్పుడప్పుడే తయారయిన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులు పైకి వెళ్ళేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా వుండే వారు. వారు నివసించిన ప్రాంతం పేరు బండ్ల వీది అది ఈ నాటికి ఉంది. ఆ విధంగా ఆరోజుల్లో సుదూర ప్రాంతాలనుండి వచ్చే యాత్రీకులు ఈ తిరుమల కొండ పాద బాగాన ఆగి .అక్కడ వున్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునే వారు. అందుకుకే దీనికి అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం.
ఇక్కడి ఇంకో విశేషం ఏమంటే.... గతంలో దళితులు కొండ పైకి ఎక్కే వారు కాదు. అలా కొండ పై కాలు మోపితే మహా పాతకం చుట్టు కుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవ దేవుని అనుగ్రహం పొందే వారు. ఆలా వారు తర తరాలుగా తలలు ఆ గుండుకు తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈ నాటికి ఉంది. దానిని తల తాకుడు గుండు తల యేరు గుండు అని అంటారు. ఇక్కడి నుండి మెట్ల దారి చాల కష్టంగా వుంటుంది. మోకాళ్లు పట్టు కోకుండా ఆ కొండను ఎక్కలెరు. మోకాళ్లు నెప్పులు రాకుండా వుండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలును తాకించి మెట్లెక్కితే మోకాళ్లు నెప్పి వుండదని పూర్వీకుల నమ్మకం. అలా భక్తులు తమ తలలను, మోకాళ్లను ఆ గుండు తర తరాలుగా తాకించి నందున దానికి గుంటలు పడి ఉన్నాయి. దానిని ఈ నాటికి చూడ వచ్చును. ఆ తర్వాత కాలంలో కూడా కొందరు భక్తులందరు అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొన సాగించేవారు. ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యాన వనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగు తున్నాయి. ఇక్కడ శ్రీ వారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను తలమీద పెట్టుకొని తమ భక్తిని చాటు కుంటారు. దానికి కొంత రుసుమును వసూలు చేస్తారు.
శ్రీవారిమెట్టు మార్గం:
ఏ ఆలయంలోనూ ప్రధానమూర్తిని “శ్రీవారు” అని వ్యవహరించరు. ఒక్క తిరుమలలోనే శ్రీవారు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీవారి మెట్టు అని వ్యవహరిస్తారు. ప్రత్యేకించి వైష్ణవులు “శ్రీనివాసప్పెరుమాళ్' అనడం ఈ పదాల వ్యాప్తికి కారణం కావచ్చు.
తిరుమల గిరులలో ఒకటి “శ్రీపర్వతం” “శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాది వృషభాద్రి వృషాద్రిముఖ్యాం” అని సుప్రభాతంలోని శ్లోకం. వాటిలో మొదటిది శ్రీపర్వతం. శ్రీపర్వత మార్దమే శ్రీవారి మెట్టు.
తిరుమల చేరుకోవడానికి ప్రాచీన మార్గాలలో ప్రసిద్ధం శ్రీవారిమెట్టు మార్గం. శ్రీనివాసమంగాపురంలోని స్వామిని సేవించి ఆపై శ్రీవారి మెట్టు చేరుకొని సోపానమార్గంలో తిరుమల చేరుకోవడం నాటికీ నేటికీ ఉంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆ దారి గుండా నడిచే వారికి అనేక సౌకర్యాలు కల్పించారు. “మెట్టు” అంటే పడికట్టు. ఇది కూడా “అలిపిరి” లాంటిదే.
చండ్రగిరిని ప్రధానస్థావరంగా ఏర్పాటు చేసుకొన్న విజయనగర రాజులు ఈ మార్గం గుండా తిరుమల వెళ్ళేవారట. ఈ ప్రదేశం నుండి అవ్వాచారికోన దాక ఒక మార్గముండేదని రాతిస్తంభాలను ఈ మార్గం ద్వారా తిరుమలకు తరలించేవారని అంటారు. దీనికే ఏనుగుల దారి అని కూడా పేరు. ఈ దారిలో నైష్ఠికులయిన శ్రీవైష్ణవుల స్నానపానాదులకు తగిన నడచాలి కూడా ఉంది. ఇక్కడి ఆంజనేయస్వామి దర్శనీయుడు.
స్వామి పద్మావతిని వివాహమాడాక పసుపు బట్టలతో కొండ ఎక్కరాదని అగస్యులవారంటే ఆరునెలల కాలం శ్రీనివాసమంగాపురంలో ఉండేవారని ప్రతీతి, ఈ ఆలయాన్ని తాళ్లపాక వంశస్థులు పునరుద్ధరించారు. ఈ క్షేత్రం దగ్గరే “కళ్యాణి” నది ఉంది.
స్వామి పద్మావతిని వివాహమాడాక పసుపు బట్టలతో కొండ ఎక్కరాదని అగస్యులవారంటే ఆరునెలల కాలం శ్రీనివాసమంగాపురంలో ఉండేవారని ప్రతీతి, ఈ ఆలయాన్ని తాళ్లపాక వంశస్థులు పునరుద్ధరించారు. ఈ క్షేత్రం దగ్గరే “కళ్యాణి” నది ఉంది.
No comments:
Post a Comment