Adsense

Tuesday, May 2, 2023

నేడు మోహిని ఏకాదశి…ఈ రోజు ఏం చేయాలంటే....!!

 నేడు మోహిని ఏకాదశి…
ఈ రోజు ఏం చేయాలంటే....!!



 
🌿మోహిని ఏకాదశి… ఈ రోజు ఏం చేయాలంటే! 
హైందవ ధర్మం కాలమానంలో ప్రతి ఏకాదశి తిథీ విశిష్టమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా, అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా… ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది.

🌸అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే ‘మే 01 న వచ్చే ఏకాదశి తిథికి ‘మోహినీ ఏకాదశి’ అని పేరు. ఇంతకీ ఈ పేరు వెనుక విశిష్టత ఏమిటో, ఈ రోజున ఆచరించాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం… 

🌿అది దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం. రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలూ బాధలకు గురవుతున్నాయి

🌸వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు.

🌿క్షీరసాగరమథనం కనుక చేస్తే, దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందనీ…
అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా, దానవుల మీద పైచేయి సాధించగలరనీ చెప్పాడు. 

🌸క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మథనం ప్రారంభించారు. వాటిలో కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం… లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది. 

🌿ఈ మథనంలో దేవతలూ, రాక్షసులూ సమానంగా పాలుపంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

🌸అదే కనుక జరిగితే సముద్రమథనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా! అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాడు.

🌿ఎంతటివాడికైనా కళ్లు చెదిరిపోయే అందంతో మోహిని అవతారం ధరించాడు. 
మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హొయలతో రాక్షసులను ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు.

🌸ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చలించిపోయిందనీ… అలా ఆ హరిహరులను జన్మించినవాడే అయ్యప్పస్వామి అనీ చెబుతారు.

🌿విష్ణుమూర్తి రూపాలలో ఒకటి అయిన ఈ మోహినీదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలి అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం.

🌸ఇంతకీ ఈ మోహిని అవతరించింది మోహినీ ఏకాదశి రోజునే! 
వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం.

🌿కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

🌸మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకూ ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది. 

🌿మోహినీ ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి, మర్నాడు… అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు.

🌸ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి, అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు.

🌿ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రం. 
ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలనీ, విష్ణుమూర్తిని ధూపదీపనైవేద్యాలతో పూజించాలనీ, ఉపవాసంతో రోజును గడపాలనీ, దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు.

🌸ఇవన్నీ కుదరకపోయినా… కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో… అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి. 


🌹🙏మోహిని ఏకాదశి కథ...🙏🌹

🌿వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు.

🌸మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది.

🌿ఒకసారి పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు.

🌸“ఓ జనార్ధనా ! వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ? దాన్ని ఆచరించే పధ్ధతి ఏమిటి ? దానిని ఆచరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి ?''

🌿దానికి శ్రీకృష్ణుడు , ధర్మరాజుతో ఇలా అన్నాడు "ఓ ధర్మనందనా ! వశిష్ఠుడు శ్రీరాముడిని తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను. సావధానంగా విను'' అని చెప్పాడు.

🌸ఒకసారి శ్రీరాముడు జనక పుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమత పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్టుడిని అడిగాడు.

🌿వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు "రామచంద్రా ! నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై , పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు.

🌸అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామా ! వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. అది ఏంతో మంగళకరమైనది.

🌿ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు , దుఃఖాలు , మాయ పటాపంచలు అవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెపుతాను విను''అని అన్నాడు.

🌸పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్ర వంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు.

🌿అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణుభక్తుడు కూడా ఉండేవాడు. వైశ్యవర్ణానికి చెందినా ధనపాలుడు ఎన్నో సత్రాలను , విద్యాలయాలను , విష్ణుమందిరాలను , వైద్యశాలలను , విశాలమైన రహదారులను నిర్మింప చేశాడు.

🌸మంచినీటి బావులను త్రవ్వించాడు , ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు.

🌿ఈ విధంగా తనకు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగ పరచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి శమనుడు , ద్యుతిమానుడు , మేధావి , సుకృతి , ధృష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు.

🌸వారిలో ధృష్టబుద్ధి పరమపాపి , కుమతి , చెడుప్రవర్తన కలిగినవాడు ఆయిన ధృష్టబుద్ధి వేశ్యాసాంగత్యం కలిగినవాడై , మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు.

🌿ఇక ప్రాణులను చంపడంలో , హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. కులకళంకంగా తయారైన అతడు దేవతలకు , అతిథులకు , పితృదేవతలకు , బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు.

🌸పాపాత్ముడైన ధృష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వేశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటినుండి తరిమివేశాడు.

🌿ఆ విధంగా తల్లిదండ్రులు , బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీథిలో పడిన ధృష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాపకర్మలను కొనసాగించాడు.

🌸ఆ ధనం కూడా ఖర్చు అవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు.

🌿చింతాగ్రస్తుడైన ధృష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షకభటులకు చిక్కినా అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు.

🌸కాని ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశబహిష్కరణకు గురి అయిన ధృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను , పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు.

🌿ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రానహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు ధృష్టబుద్ధి కౌండిన్యఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది.

🌸అది వైశాఖ మాసం , ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషివస్త్రం నుండి ఒక నీటిచుక్క ధృష్టబుద్ధి మీద పడింది.

🌿దాంతో అతని సమస్త పాపలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన ధృష్టబుద్ధి ముకుళితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్య ఋషిని ప్రార్థించాడు.

🌸అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు.
“నీ పాపాలు అన్నీ కూడా శ్రీఘ్రంగా నశించే ఉదాత్తమైన పద్ధతిని చెబుతాను విను.

🌿వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరుపర్వతం అంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది. కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు'' అని తెలిపాడు.


🌸కౌండిన్యఋషి చెప్పిన మాటలను విన్న ధృష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు.

🌿ఆ వ్రత ఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు.

🌸ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానం , దానం , యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు అని తెలిపాడు. 

🌿మోహిని ఏకాదశి రోజున
శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

🌸శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగు తాయి...స్వస్తీ..


No comments: