Adsense

Wednesday, May 24, 2023

వైశాఖ అమావాస్యవ్యాస మహర్షి పుత్రుడైనశుక మహర్షి జయంతి

వైశాఖ అమావాస్య
వ్యాస మహర్షి పుత్రుడైన
శుక మహర్షి జయంతి

మన భారతీయ బ్రహ్మర్షులలో
శుక మహర్షికి ఒక  ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఈ శుక మహర్షి పేరు వినగానే
మనందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ భాగవతం.
తన తండ్రి అయిన వేదవ్యాసుడు రాసిన
భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు
ఏడు రోజుల పాటు వినిపిస్తాడు శుకుడు.
ఇక శుక మహర్షి పుట్టుక విషయానికి వస్తే
వేదవ్యాస మహర్షి ఎన్నో వందల సంవత్సరాలు
తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి
ఏం కావాలో కోరుకోమని అడిగితే,
తనకి పంచభూతాలను పోలిన
కొడుకు కావాలని వరం కోరాడు.
అది విని తథాస్తు అన్న శంకరుని కృప వల్ల
ఆరణి మథనసమయంలో ఘ్నతాచి అనే
చిలుక కారణంగా శుకుడు పుట్టటం జరిగింది.
అందువల్లే శుకుడి మొహం చిలుక ఆకారంలో ఉంటుంది.
కాంతులు వెదజల్లుతూ పుట్టిన శుక మహర్షికి
పుట్టిన వెంటనే గంగ వచ్చి స్నానం చేయించింది,
ఆకాశం నుంచి కూర్చోవటానికి
కృష్ణాజినం, చేతి దండం వచ్చాయి,
పార్వతితో కలిసి శివుడు వచ్చి ఉపనయనం చేసాడు.
ఇంద్రుడు కమండలాన్ని, దేవతలు ఎప్పటికీ
మాయని బట్టలని ఇచ్చి వెళ్ళారు.
శుక మహర్షికి పుట్టుకతోనే అన్ని వేదాలు వచ్చట.
అయినా వేదవ్యాసుడు అతనిని బృహస్పతి దగ్గరకి
పంపి విద్యాభ్యాసం చేయిస్తాడు.
అతడు అన్నీ నేర్చుకుని తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు. అటు తర్వాత శుకుడిని జనక మహారాజు
దగ్గరకి వెళ్లి మోక్షమార్గం గురించి తెలుసుకొని రమ్మని
పంపుతాడు వేదవ్యాస మహాముని.
మిథిలా నగారానికి వెళ్ళిన శుకుడిని జనకుడు
అన్ని రాజలాంచనాలతో పాటుగా
లోపలి తీసుకువెళ్ళి, వచ్చిన కారణం తెలుసుకుని
అతనికి మోక్షమార్గం గురించి తెలియచేస్తాడు.
తరువాత శుకునకు వ్యాసమహర్షి
సృష్టి రహస్యాలను తెలియచేస్తాడు.
ఎన్నో పరమ రహస్య విషయాలను కూడా
తెలియజేస్తాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి
భూమండలాన్ని మొత్తం సంచరించాలని
నిశ్చయించుకుంటాడు శుకుడు.
అలా తిరుగుతున్న సమయంలోనే
పరీక్షిత్తు మహారాజుని కలవటం జరుగుతుంది.
తక్షకుడి విషంతో వారం రోజుల్లో
మరణించేలా శాపాన్ని పొందిన అతడికి
తన తండ్రి అయిన వేదవ్యాసుడు రాసిన
భాగవత కథలని వినిపిస్తాడు.
ఎక్కడా ఒక్కఅరగంట కూడా ఉండని శుకుడు
పరీక్షిత్తు మహారాజు నగరంలో ఏడు రోజులు
ఉండటానికి ఒప్పుకుని అతనికి మోక్షమార్గాన్ని
చూపిస్తాడు. ఎప్పుడూ దైవ చింతనలో
మునిగిపోయి ఉండే  శుకుడికి ఒంటి మీద
బట్టలు కూడా ఉన్నాయా లేదా అనే
స్పృహ కూడా ఉండేది కాదు. అంతలా
ప్రతిక్షణం తపస్సులో మునిగి ఉండేవాడు.
అతను నడిచి వెళ్తున్నప్పుడు పక్కన ఏమి జరిగినా
అతనికి తెలిసేది కాదు. ఒక రోజు శుకుడు ఆకాశగంగ
మార్గం నుండి వెళ్తున్నప్పుడు అందులో స్నానం చేసే
అప్సరసలు అతనిని చూసి ఏ మాత్రం సిగ్గుపడరు,
అక్కడ నుండి పారిపోరు. కాని అదే మార్గంలో అప్పుడే
వెళ్తున్న వ్యాసుడిని చూసి గబగబా బట్టలు కట్టుకుని
అతడిని చూసి సిగ్గుపడతారు.
ఇది గమనించిన వ్యాసుడు
కారణం అడిగితే శుకుడు ఎంత జ్ఞాని అయినా
అతని మనసు అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి
మనసులాగా స్వచ్చమైనదని తెలియచేస్తారు.
అది విన్న వ్యాసుడికి  తన కొడుకు అంటే 
ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది.
అంత గొప్ప కొడుకుని కన్నందుకు ఎంతో గర్వపడతాడు.
మరొకసారి దేవ వేశ్య అయిన రంభ
శుకుని అందానికి ముగ్దురాలయి తనని
అనుభవించమని  అతనిని కోరుతుంది.
కాని సున్నితంగా తిరస్కరిస్తాడు శుకుడు.
ఈ వృతాంతాన్ని శుకరంభా సంవాదంలో చదవవచ్చు.
ఒక రోజు నారద మాహామునిని దర్శించుకున్న
శుకుడు ఈ లోకంలో పుట్టినందుకు
ఏమి చేస్తే మంచిదని అడుగుతాడు,
అందుకు సమాధానంగా నారదుడు యోగసిద్ధి
పొందటం మంచిదని చెపుతాడు.
అది విన్న శుకుడు తన తండ్రి దగ్గరా,
నారదుడి దగ్గరా సెలవు తీసుకుని కైలాస పర్వతం
మీదకి వెళ్లి తపస్సు చేసి యోగసిద్ధిని పొందుతాడు.
కొంతకాలం తరువాత నారదుడు శుకుడిని
చూడటానికి వెళితే అతనికి ఆత్మయోగం గురించి
చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతాడు శుకుడు.
అలా వెళ్ళిపోతూ అక్కడున్న పక్షులతో,
తన కోసం తన తండ్రి వచ్చి శుకా అని పిలిస్తే
'ఓయ్' అని పలకమని చెప్పి వెళ్ళిపోతాడు.
కొన్నాళ్ళ తరువాత ఎంతకీ కనిపించని కొడుకుని
వెతుక్కుంటూ కైలాస పర్వత ప్రాంతంలో తిరుగుతూ
శుకా అని పిలిచిన వ్యాసుడికి ఓయ్ అని
వినిపించిందట. కొడుకుకోసం తపిస్తున్న
వ్యాసుడిని చూసి శివుడు అతనిని
ఓదార్చి నువ్వు కోరుకున్నట్టే నీకు ఎంతో
ఉత్తమమైన కొడుకు పుట్టాడు.
సృష్టి రహస్యం తెలిసిన నువ్వు
ఇలా బాధపడటం మంచిదికాదని చెప్పి
అతనిని తిరిగి ఆశ్రమానికి పంపిస్తాడు.
శుకుడిని పోలిన తత్త్వజ్ఞుడు, యోగీశ్వరుడు,
తపస్వి మూడు లోకాలలో మరొకరు లేరు.
అంతటి మహనీయ శుక మహర్షికి శిరస్సు వంచి
పాదాభివందనం చేసుకుందాం.

No comments: