Adsense

Monday, July 31, 2023

"తలనీలాలు" అంటే ఏమిటి ..?

శ్రీవారికి తలనీలాలు సమర్పించడం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ.

అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం "తలనీలాలు"  అంటే ఏమిటి ..?

నీలాలు అంటే కురులు..
తలనీలాలు అంటే....తల పైన ఉండే కురులు అని అర్థం...

తలనీలాలు సమర్పించడంలో శాస్త్రం మగవాళ్ళకి " సంపూర్ణ శిరోముండణం"  మరియు ఆడవాళ్ళకి కేవలం కొన్ని కురులను సమర్పించడం మాత్రమే అని స్పష్టంగా తలనీలాలుగా వర్ణిస్తుంది

అయితే ఆడవాళ్లు ప్రత్యేకించి ఎంత మొత్తంలో తలనీలాలు సమర్పించాలి అనేది ఒక ఖచ్చితమైన పద్ధతి అంటూ లేదు.

మూడు కత్తెరులు  లేదా కొన్ని ప్రత్యేకమైన కొలతల ప్రకారం తల మీద కురులను తిరుమలలో సమర్పించడం అనేది ఆనవాయితీ అంతే తప్ప...ఆడవాళ్లు సంపూర్ణ శిరోముండనం చేసుకోరాదు.
అలా చేయడం దోషం కూడా .

కొన్ని వేల సంవత్సరాల నుండి ఆడవాళ్లు కూడా పూర్తిగా శిరోముండణం చేసుకుంటున్నారు,
అయితే అది తెలిసో తెలియకో చేస్తున్న ఆచారం అంతే తప్ప శాస్త్రం ప్రకారం ఆడవాళ్లకు సంపూర్ణ శిరోముండణం వర్తించదు

ఇక శ్రీ వెంకటాచల స్థలపురాణము మరియు వెంకటాచల మహత్యం ఆధారంగా చూసుకుంటే శ్రీవారికి మొట్టమొదట తలనీలాలు సమర్పించినది " నీలా " అనే ఒక గంధర్వ కన్య .
ఈవిడ ఒక శాపం కారణంగా శేషాచల అడవులలో ఉన్న ఒక ప్రాంతానికి వనదేవతగా  వచ్చి ఈ పర్వత ప్రాంతంలో స్థిరపడి ఉంది.

7వ మన్వంతరం  అయిన వైవస్వత
మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మానవ రూపంలో, మానవ నేత్రాలతో నేరుగా ఆ వైకుంఠ నారాయనుడిని ఇదే పర్వత ప్రాంతంలో ఏప్పుడైతే దర్శించి,  శ్రీవారికి తన కురులను స్వచ్ఛంద త్యాగంతో  సమర్పించిన తర్వాత తనకి జన్మరాహిత్యం పొందగలదు అనేది ఆ శాపం యొక్క అంతరార్థం...

శ్రీవారికి మొట్టమొదటిగా ఆవిడే తన కురులను సమర్పించింది కనుక ఆవిడ పేరు మీదే "తలనీలాలు" అన్న పేరు వ్యవహారికంగా స్థిరపడిపోయింది.

శ్రీవారు  ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించి ఆవిడ వనదేవతగా ఉన్న ప్రాంతాన్ని ఆవిడ పేరు మీద " నీలాద్రి "/" నీలాచలం" అని తన 7 కొండలలో ఒక కొండగా కలియుగాంతం వరకు స్థిరనివాసం కల్పించి అనుగ్రహించాడు ఆ శ్రీనివాస పరబ్రహ్మ.

అలాగే శ్రీనివాసుడు ఆవిడకి ఇంకో వరం కూడా ప్రసాదించాడు ..
అదే నాటి నుండి కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో తలనీలాలు సమర్పించగా భక్తులకు వచ్చే పుణ్యఫలంలో కొంత భాగం ఆవిడకు సంక్రమించేలా చేశాడు

తలనీలాలు ఇవ్వడం అంటే కురులు ఇవ్వడం అని మాత్రమే అర్థం.
శాస్త్రం మగవాళ్ళకి పూర్తి శిరోముండనం , ఆడవాళ్లకు కేవలం కొన్ని కురులు ఇవ్వడం మాత్రమే అని స్పష్టంగా తెలియజేస్తుంది.
 
అందుకే మనం తిరుమల మరియు ఇతర పుణ్యక్షేత్రాలలో తలనీలాలు సమర్పించే ప్రదేశాలను " కళ్యాణకట్ట" లేదా " క్షుర కర్మశాల" లేదా " కేశఖండనశాల"  అనే పేర్లతో మాత్రమే పిలుస్తాం తప్ప.....
" కేశ ముండనశాల"  అని పిలవము.

శిరోముండనం అంటే పూర్తిగా కురులు సమర్పించడం
ఉదా:  గుండు కొట్టించుకోవడం

స్త్రీ పురుషులకు శిరోముండనం
ధర్మాలు వేరువేరుగా ఉన్నాయి కనుక ఆ ప్రదేశాలను కేవలం కేశఖండనశాల అని మాత్రమే పిలిచారు.

No comments: