Adsense

Friday, July 21, 2023

శ్రీ ఆనందవల్లీ సమేత అగస్త్యేశ్వ్వర స్వామి దేవాలయం

 శ్రీ ఆనందవల్లీ సమేత  అగస్త్యేశ్వ్వర స్వామి  దేవాలయం...!!

కష్టాలు కలిగినప్పుడు  ప్రార్ధించుకుని  స్వాంతన పొంది, శక్తిని పెంపొందించుకునేందుకు ఏర్పడినవి పుణ్య క్షేత్రాలు. ఏదైనా ఒక పుణ్య క్షేత్ర
దర్శనం చేసుకుని వచ్చిన తరువాత  జీవితంలో పెద్ద మార్పులు కలిగి శుభాలు జరగడం , మనసు కి ప్రశాంతత లభించడం వంటివి జరుగుతుంటాయి.
అటువంటి  భాగ్యాన్ని అనుగ్రహించే ఆలయం తమిళనాడు లోని తిరువారూరు జిల్లా
పేరళం సమీపమున వున్న
తిరుక్కొడియలూరులో వుంది.
ఈ ఆలయంలోనే  శ్రీ ఆనందవల్లీ సమేత  అగస్త్యేశ్వ్వర స్వామి  కొలువైయున్నాడు.

ఈ పుణ్యస్థలంలోనే యమధర్మరాజు, శనీశ్వరుడు అవతరించినట్లుగా చెప్తారు.  శని దోషం, మృత్యుభయమే
ఒక వ్యక్తికి అత్యంత క్లిష్టమైనది.
అటువంటి కాల దోషాన్ని తొలగించి, భక్తులకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా యముడు శనీశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు.

అందువలననే  ఈ ప్రదేశంలో
అడుగు పెట్టగానే , చీకాకులు
తొలగి ప్రశాంతత కలుగుతుంది.
ఒకానొక కాలంలో సూర్యుదేవుని భార్యలైన ఉషాదేవి
ఛాయాదేవీ   సంతాన  భాగ్యం కోసం ఇక్కడి ఈశ్వరుని ప్రార్ధించారు.

అందుకు  ఈశ్వరుడు " మీరు మీభర్తతో   వెళ్ళి తిరుమీయచ్చూర్ లో వున్న పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ
నన్ను , లలితాంబిక ని పూజించి  ఇక్కడికి వస్తే  మీకు పుత్ర భాగ్యం లభిస్తుంది." అని వరమిచ్చాడు. i

ఆ విధంగానే  సూర్యుడు ,  ఉషాదేవి, ఛాయాదేవి తిరుమీయచ్చూర్  వచ్చి అక్కడిసూర్య పుష్కరిణిలో స్నానాలు చేసి పూజలు చేశారు. ఆ పూజల ఫలంగా ఉషాదేవికి యమధర్మరాజు ,
ఛాయా దేవికి శనీశ్వరుడు
జన్మించారు.

తిరుమీయచ్చూర్ లో పూజించి, యీప్రదేశంలో సూర్యుడు, ఉషాదేవి, ఛాయాదేవి కూడినందు వలన యీ ఊరికి కూడియలూరు అనే పేరు వచ్చింది.

అదే కాలక్రమేణా
"కొడియలూరు"గా పిలువబడుతున్నది.
హయగ్రీవ స్వామి ఆదేశ ప్రకారం తిరుమీయచ్చూర్ వచ్చిన అగస్త్య మహర్షి  లలితాంబికాదేవిని మనసారవేడుకుని "లలితా నవరత్న
మాలికా  "స్తోత్రంతో లలితా దేవిని స్తుతించి  ఆ దేవి అనుగ్రహం పొందాడు.

ఆ తరువాత పరమేశ్వరుని సేవించుకోవాలని  కొడియలూరికి వచ్చాడు.  అక్కడ ఒక శివలింగాన్ని
ప్రతిష్టించి పూజించాడు.
అందువలననే ,ఇక్కడి ఈశ్వరుడికి అగస్త్యేశ్వ్వరుడు అనే పేరు వచ్చింది.
ఈశ్వరుని పక్కనే లలితా దేవిని కూడా ప్రతిష్టించి  పూజించాడు.

వేడుకున్న భక్తుల జీవితాలలో ఆనందాన్ని ప్రసాదిస్తున్న ఈ  అంబికను "ఆనందవల్లి తాయారు" అని పిలుస్తారు.

తిరుమీయచ్చూరు  ఆలయంలో  లలితాపరమేశ్వరి  తపో భంగిమలో మనోన్మణి స్వరూపంగా, ఆశీనురాలై అనుగ్రహం ప్రసాదిస్తున్నది.

కొడియలూరు లలితా పరమేశ్వరి ఆనందవల్లిగా పరిపూర్ణత పొంది భక్తులను అనుగ్రహిస్తున్నది.

ఈ ఆలయ దక్షిణ దిశలో
యమధర్మరాజు, ఉత్తర దిశలో
శనీశ్వరుడు దర్శనమనుగ్రహించడం 
విశిష్టత కలిగిన విషయం.

ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే యమ భయం , శని దోషము తొలగిపోతాయని  భక్తుల ధృఢవిశ్వాసం.

ఈ తిరుమీయచ్చూర్ ఆలయంలోని యమధర్మ రాజుని , శనీశ్వరుని అభిషేకించి , భక్తితో పూజిస్తే తాము పోగొట్టుకున్న విలువైన
వస్తువులు మరల దొరికి శుభాలు
జరుగుతాయని భక్తుల విశ్వాసం.

ఏలిన నాటి శని దోషానికి , ఇతర
సమస్యలకు
యీ  ప్రదేశంలో  విముక్తి
కలుగుతుంది...స్వస్తీ...

No comments: