Adsense

Friday, May 17, 2024

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః

ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా - జగత్సృష్టి-స్థితి-లయములకు కారణమై,
అభిన్న నిమిత్త ఉపాదానములుగా,
సత్-చిత్-ఆనంద స్వరూపమై భాసిల్లే
పరబ్రహ్మము ఏది కలదో,
దానిని తల్లి రూపముగా భావించి ఉపాసించినప్పుడు, జగన్మాతగా, దేవిగా ఆరాధించబడుతుంది.
ఆమె పేరే లలిత...

'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ' అని పోతనగారు కొనియాడిన తల్లి ఈమెయే. కంచి కామాక్షి అని మనము పిలిచే తల్లి ఈ రూపమే...

లోకానతీత్య లలతే లలితా తేన స ఉచ్యతే - ఈ సర్వలోకములకు అతీతముగా ఏది ప్రకాశిస్తున్నదో, దేని వలన ఈ సమస్త లోకములు ప్రకాశిస్తున్నాయో, తానే లలితా దేవీ...

లాలనాత్ లలితాభిదా - లాలించుట అంటే ఆనందమును కలిగించుట. సమస్త లోకములను, సృజించి, పెంచి, పోషించి, లాలించే తల్లి కనుక, ఆమె లలితా..

సమస్త లావణ్య గుణములకు నెలవుకనుక, ఆమె లలితా.

లోకాతీత లావణ్యాత్ లలితా తేన సోచ్యతే - లోకాతీతమైన లావణ్యమే లలితా....
సమస్త లోకములలో గల లావణ్యమంతా లావణ్య సముద్రమైన ఆ తల్లిలో బిందువులు. లావణ్య శబ్దానికి సౌందర్యము, అందము అని కూడా అర్థాలు. లోకాతీతమైన సౌందర్యము కలది కనుక ఆమె లలితా.. ఆనందాన్నిచ్చేదే అందము అనుకుంటే, ప్రతి ప్రాణికి ఆనందానికి మించిన అందమేది కలదు? అట్టి ఆనందఘనమైన తల్లి కనుకే, ఆమె లలితా...

త్రిపురసుందరీ - త్రిపురమనగా ప్రపంచము, శరీరము. వాటియందు భాసిల్లు చైతన్యము కనుకామె త్రిపురసుందరీ. ఏది ఉండటం వలన శరీరము, జగత్తు నిలబడి, వర్థిల్లుతున్నదో, ఆనందఘనమై ఎల్లప్పుడూ ఉండే ఆ చైతన్యమే సుందరము. అందుకే ఆవిడ త్రిపురసుందరీ..

మూల చైతన్య స్వరూపిణియైన పరబ్రహ్మము ఇక్కడ లలితగా ఉపాసించబడుతుంది. నాల్గుదిక్కులు, ఆవిడ కూర్చున్న స్థలం (ఊర్థ్వథో ముఖములుగా), అదే ఆవిడ సింహాసనం. కాబట్టి ఆవిడ అంతటా నిండి ఉంది అని చెప్పటం. ఆవిడ సింహాసనంలో నాలుగు కోళ్ళుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులను, బల్లపరుపుగా సదాశివుడు చూపిస్తారు. వీరిని పంచబ్రహ్మలు అంటారు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే పంచకృత్యములకు, అవి చేసే తల్లి అంశలకు వారు ప్రతీకలు. ఈ కృత్యములనుండే పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచప్రాణములు వచ్చాయి. ఇవన్నీ కలిపి అంటే, సమస్తలోకములతో కూడిన ఈ జగత్తంతా పంచబ్రహ్మాసనం. వీటన్నిటికీ అధిష్ఠానమై, దేని వలన ఇదంతా వర్థిల్లి, పనిచేసి, లయమౌతోందో, ఆ తల్లి ఆ ఆసనం మీద కూర్చుంది. అందుకే ఆవిడకి 'పంచబ్రహ్మాసనస్థితా' అని నామం...

అన్ని దేవతాశక్తులకీ ఈ తల్లే మూలము కనుక, వాణీ, లక్ష్మీ ఇత్యాదులు కూడా ఆమెను సేవిస్తుంటారు...

No comments: