Adsense

Monday, September 9, 2024

సాంబారు అనే పదం ఎలా వచ్చింది?

సాంబారు అనే వంట పుట్టుక వెనుక చిన్న చారిత్రక కథ ఉన్నది. తంజావూరును మరాఠా రాజులు పాలించే కాలంలో శివాజీ పుత్రుడైన శంభాజీ తన బంధువైన ఆనాటి రాజు సాహూజీని చూడడానికి వచ్చాడట. మరాఠాలు వంటలో పులుపుకు కోకం వాడతారు. తంజావూరులో అది లభ్యం కాదు. కాబట్టి వంటలో చిన్న మార్పు చేసి చింతపండుగుజ్జును ఉడికిన కందిపప్పులో వేసి తయారు చేశారట. ఆ వంట శంభాజీకి చాలా నచ్చింది. అతని పేరున శాంభార్ అన్న పేరు వచ్చింది. అదే సాంబారుగా మారింది.

శంభాజీయే స్వయంగా చేశాడని కూడా అంటారు.

ఆ తరువాత ఆ వంటను వండే పద్ధతులలో అనేకమైన మార్పులు వచ్చాయి. ధనియాలు, శనగపప్పు, మొదలైనవన్నీ కలిపి వేయించి పొడిచేసి కలపడం వల్ల రుచి ఎక్కువ అయినది. తమిళులు పొడి కొట్టి కలిపితే కన్నడిగులు నీటితో కలిపి ముద్ద రుబ్బి కలుపుతారు.

ఉప్పు, చింతపండు ఇతర మసాలా పదార్థాలు అన్నింటికీ కలిపి సంభారాలన్నది సంస్కృత పదం. తెలుగు లో సంబారాలని పేరు. మరాఠాలకు ముందు తంజావూరును తెలుగు నాయక రాజులు పాలించారు. అందుకని తెలుగు వాడకం తంజావూర్ లో ఎక్కువ. సంబారాలు అన్నీ కలిపి చేయడం వల్ల సాంబారు అన్న పేరు వచ్చి ఉండవచ్చును.

జీతం అనే అర్థంలో సంబళం అన్న పదాన్ని తెలుగులో తక్కువగానూ తమిళంలో విరివిగానూ వాడతారు. సాల్ట్ అన్నమాట నుంచి శాలరీ వచ్చినట్టుగా సంబారం అన్న పదం నుంచి సంబళం వచ్చి ఉండవచ్చునా?

పూర్వం సేవలకు మూల్యం ధనరూపంలో కాకుండా వస్తు రూపంలోనే చెల్లించేవారు కదా.


No comments: