THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Sunday, November 10, 2024
ప్రదోష వ్రతం.
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని,త్రయోదశి సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ,శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.
ప్రదోష సమయం త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment