Adsense

Monday, November 4, 2024

శ్రీ మహానందీశ్వర ఆలయం, కర్నూల్ జిల్లా.



సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో... పరమశివుడు స్వయంభువుగా గోవు(ఆవు) పాద ముద్రరూపంలో వెలిశాడు!

కర్నూలు జిల్లా నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.

స్థలపురాణం :

పూర్వం శిలాదుడని(శిలాద మహర్షి) నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. పుత్రసంతానం కోసం శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు.

అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతనికి ఒక పుత్రుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు. ఆమేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. వారు ఆ బిడ్డకు ‘ మహానందుడు’ అనే పేరు పెట్టారు.

అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు... దేవాధిదేవా.. నన్ను నీ వాహనంగా చేసుకో... అని కోరాడు.

అలాగే అని వరమిచ్చిన శివుడు ‘మహానందా.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది.

చుట్టూ 80 కి.మీ.ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు.

చరిత్ర :

పూర్వం నందుడు అనే రాజు పాలనలో గోపితవరం( నేటి గోపవరం) గ్రామంలో ఓ గొల్లవానికి పెద్ద ఆవుల మంద ఉండేది. అందులోని కపిల అనే విశిష్టమైన ఆవు ఈ నల్లమల అడవిలో పచ్చిగడ్డి మేస్తూ ఇక్కడ పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి.. రోజూ పాలు ఇస్తూ ఆయన ఆకలి తీర్చేది.

ఓ గోమాత రోజూ అడవిలోని ఒకపుట్టలో పాలు విడుస్తోందన్న విషయం నందమహారాజుకు గూఢచారుల ద్వారా తెలిసి.. ఆయన ఆ వింతను కళ్లారా చూడాలని అక్కడికి వస్తాడు. కపిల గోవు పొదల్లోకి వెళ్లి పుట్టవద్ద నిలిచి పాలధారను స్రవిస్తుండగా.. చూసి.. రాజు మరింత స్పష్టంగా ఈ దృశ్యాన్ని చూసేందుకని ముందుకు కదలగా... ఆ అలికిడికి బెదిరిన ఆవు కుడిపాదంతో పుట్టను తొక్కేస్తుంది.

ఆపై.. పుట్టలోని బాలరూప శివుడు.. ఆ గోమాత కూడా మాయమైపోగా.. రాజు ఎందుకలా అయ్యిందో అర్థం కాక... అయోమయంగా తిరిగి నగరికి చేరతాడు. ఆ రాత్రి అతనికి పరమశివుడు కలలో కనిపించి ‘ నీవు చూసిన పుట్టనుంచి పాలు తాగింది నేనే. అక్కడ దేవాలయాన్ని నిర్మించు... నేనక్కడ లింగరూపినై కొలువుంటా.. నీ కీర్తి శాశ్వతం అవుతుందని చెప్పాడు. ఆ మేరకు నందరాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు.

నందరాజు ఈ ప్రాంతాలను (నందవరం, నంద్యాల, నందికొట్కూరు, మహానంది)ని పాలించాడు. అందుకే ఈ ప్రాంతానికి నంద్యాల అని పేరు వచ్చింది.

ఇక్కడి కోనేర్లు (పుష్కరిణిలు) విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క అత్యద్భుత పనితనాన్ని తెలియజేస్తాయి.

నవనందులు ఎలా దర్శించుకోవాలి...?

కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి.

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన🤣 విశ్వాసం.

ప్రథమ నంది:-

నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున కేదారేశ్వర ఆలయంలో కలదు.

నాగనంది:-

నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు.

సోమనంది :

ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది.

శివనంది:-

నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచినది ఈ క్షేత్రం.

విష్ణునంది లేక కృష్ణ నంది :-

సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించిన కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది.

గరుడ నంది:-

సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు.

వినాయక నంది:-

మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయంలో లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడు

మహానంది:-

నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది.

సూర్యనంది :
మహానందికి 8 కి.మీ దూరంలోని తమ్మడపల్లి గ్రామంలో ఉంది. ఈశ్వరుడి కోసం సూర్యడు తపస్సు చేసిన ప్రదేశమిది. రోజూ సూర్యోదయ సమయంలో కిరణాలు ఈ లింగంపై పడటం విశేషం.

No comments: