తూ.గో జిల్లా : ర్యాలీ
శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం: ర్యాలీ.
👉తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో 'ర్యాలి' అంటే 'పడిపోవడం' అని అర్ధం.
ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు.
👉శ్రీ విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అపురూపమైన అవతారం ఆ జగన్మోహిని అవతారం. ఇక్కడ ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు.
👉ఇది ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు.
విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని.
ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో?
నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది అచ్చమైన నిదర్శనం. కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి.
అదేవిధంగా 'శిఖ' జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా, నిజంగా జుట్టు ఉందా? అనిపించేలా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే.
👉 ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. 'విష్ణు పాదోధ్బవి గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం మాట పక్కన పెడితే శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం.
👉పూర్వం సముద్రమధనం తర్వాత అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు పంపకం చేయటంకోసం దేవతల శ్రేయస్సుకోరి భగవానుడు స్త్రీరూపం ధరించి రాక్షసులకు మాయకల్పించి జగన్మోహిని అవతారంలో అమృతం అంతా దేవతలకు పంచాడు. రాక్షసులు మోహావేశంతో సుందరి రూపధారియైయున్న నారాయణుని చూసి పరవశులై చివరకు మోసపోయారు. దేవతలకు మరణం లేకుండా చేయటంలో ఈ జగన్మోహిని అవతారం ప్రధాన పాత్ర వహించింది. దేవతలు అందరూ స్త్రీరూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి ప్రార్ధించగా కేశవుడు రూపులో ఒక ప్రక్క మరొకప్రక్క స్త్రీ రూపంలో దివ్యత్వం కూడిన నవ మోహిని జగన్మోహిని అవతారంలో ప్రత్యక్షమౌతారు
👉పరమశివుడు కైలాసం నుంచి జగన్మోహినిని మోహించి కేశవుని వెంటపడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు.
మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.
జగన్మోహినీ అవతారంలో ఉన్న నారాయణుడు చాలా దూరము పరుగిడి ఒక ప్రదేశంలో వెనుదిరిగి శంకరునికి తన అసలురూపం చూపించాడు.
శివుడు కేశవుని నిజ రూపం చూసి వెంటపడటం మానివేసి శిలగా మారారు.
విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు.
👉ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం పురుష రూపం చెన్నకేశవస్వామి. శంఖం, చక్రం,, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు స్త్రీ రూపం జగన్మోహినీ రూపం వుంది.
అచ్చంగా జగన్మోహిని వలె కళ్లు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది.
రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదమునకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది.
ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు.
అసలే నల్లని సాలగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది.
👉11 వ శతాబ్దం లొ ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద ఫోన్న చెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యెక్క మేకు క్రింద పడిన ప్రదేశం లొని భూగర్భం లొ తన క్షేత్రం ఉందని పల్కుతాడు.
ఆ ప్రాంతంలో ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే
జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరం లొ ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి
👉గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.
👉ఈ ఆలయం లో శివునకు ఉమా కమండలేశ్వరుడు అని పేరు . . బ్రహ్మదేవుడు ఈ ఆలయం లో తపస్సు చేసినప్పుడు తన లో కమండలం పై ఉమతో కూడిన పరమ శివుణ్ణి ప్రతిష్ట చెయ్యడం వల్ల ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గం లేదుట.
మోహినీ మూర్తిని చూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు.
👉 ఈ ఆలయాన్ని 'బదలీ ఆలయంగా' ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదలీ అవుతారనే నమ్మకం ఆంధ్ర ప్రదేశ్ అంతటా వ్యాపించింది. మంత్రులు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు మాత్రం ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే తమ పదవులు పోతాయనే భయం అని ఇక్కడి పూజార్లు చమత్కరిస్తుంటారు.
ఈ దేవాలయము తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం దగ్గర లో ఉంది.
No comments:
Post a Comment