పూర్వం ఒకానొక బ్రాహ్మణుని భార్య, కుమారుని ప్రసవించి కను మూసింది. ఆ బ్రాహ్మణుడు నిత్యంచేసే అగ్నిహోత్రాలు వగయిరాలకు ఆటంకం కలగకుండా వుండడం కోసం, మారు మనువు చేసుకున్నాడు.
కాని, రెండో పెళ్లి చేసుకున్న ఏడాది తిరక్కుండానే, ఆ విప్రుడు కూడా వైకుంఠం చేరిపోవడం జరిగింది.
వితంతువైన రెండో భార్య, సవతి కొడుకూ కలిసే వుండసాగారు. కొన్నాళ్ళకు ఆ బ్రాహ్మణ బాలుడు వివాహం చేసుకున్నాడు.అయితే, తనకు పెళ్లయిన కొత్తలోనే భర్త వియోగం సంభవించసాగింది.
ఈ నూతన దంపతులకు సవతితల్లి ఏదోరకంగా వారి సుఖానికి అస్తమానం అడ్డు తగులుతూ వుండేది.
ఈ పోరుపడలేక ఆ పిల్ల ఆత్మహత్యకు సిద్ధపడి, ఓ రాత్రి వేళ నదీతీరం చేరగా అక్కడాకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో సహా విహారానికి వచ్చినవారు కనిపించారు.
వారు ఆమె స్థితిని చూసి ప్రశ్నించగా. బ్రాహ్మాణ వధువు తన కష్టం వారికి వినిపించింది. అందుకు ఆ మెను ఓదార్చి, దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని “నువ్వు గతంలో లక్ష్మీనారాయణ వ్రతం పట్టి ఉల్లంఘించినందుననే యీ జన్మలో బాధపడుతున్నావు.
వెంటనే యింటికి వెళ్లి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ తీరతాయని" చెప్పారు.
ఆమె అలాగే చేయగా సవతి అత్తగారు మనసు మార్చుకుని, తనకు లేని సుఖం తనసాటి ఆడపిల్లకైనా కలగాలని తలక బోసి, కోడలినెంతో చక్కగా చూడసాగింది.
భర్త కూడా ఆమెపట్ల అనురాగంతో సుఖ సంతోషాలతో వరద్ధిల్లా సాగారు..
*వ్రత విధానం*
ప్రతీ ఏకదశినాడు ఉపవాసం వుండి, ద్వాదశినాడు ఉదయమే లక్ష్మీ నారాయణులను పూజించి, ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపి, అనంతరం బంధుమిత్రులతో కలిసి భుజించాలి.
*ఉద్యాపనం*
అలా 24 పూజలయ్యాక, అంటే సంవత్సరం తరువాత, ఉద్యాపన చేసుకోవాలి. ఆరోజున తులసీ బృందావనం ఏర్పరచి, మండపం వగైరా నిర్మించి, వెండితో గాని, బంగారంతో గాని, లక్ష్మీ నారాయణ విగ్రహాలు చేయించి పూజించి, మండపం దానమివ్వాలి.
*విశేషం*
ఈ లక్ష్మీ నారాయణుల నోము, మరో రెండురకాలుగా కూడా చెబుతారు... చేస్తారు..దీనిని కార్తీక శుద్ధ ఏకాదశినాడు లేదా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించి, తదుపరి సంవత్సరం కార్తీక మరియు మార్గశిర మాసంతో మొదలు పెట్టెన వాళ్ళు ఆ మాసం బహుళ ద్వాదశితో ముగిస్తారు.
No comments:
Post a Comment