Adsense

Saturday, December 14, 2024

శ్రీదత్తాత్రేయ జయంతి

త్రిమూర్తి స్వరూపంగా భావించి, పూజించే దత్తాత్రేయుని- ఆయన జయంతి సందర్భంగా ఎలా పూజించాలి? దత్త జయంతి విశిష్టత ఏమిటి? అనే అంశాలు తెలుసుకుందాం.

దత్తజయంతి_ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతీ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 4:19 గంటలకు మొదలై మరుసటి రోజు డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:37 గంటల వరకు ఉంది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య పండుగలకు రాత్రి సమయంలో తిథి ఉండాలి కాబట్టి డిసెంబర్ 14 వ శనివారం తేదీనే దత్త జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పూజకు శుభసమయం.

దత్తజయంతి_విశిష్టత
వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం- దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తోంది. అత్రి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తుడు.
మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట నాలుగు శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తే- ఒకేమారు త్రిమూర్తులను ఆరాధించేనట్టే!
దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా పూజిస్తారు.

దత్తజయంతి_పూజావిధానం
దత్తాత్రేయ స్వామి, ప్రదోషకాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున, దత్తుని సాయంత్రంవేళలలో పూజించడం సంప్రదాయం. దత్తజయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి, శుచియై- పూజామందిరము, ఇల్లు, శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. పూజా మందిరములో రంగవల్లికలు తీర్చిదిద్దాలి.             ఈ రోజు పూజ చేసుకునేవారు పసుపురంగు వస్త్రాలను ధరించడం శుభకరం.

శ్రీగురుదత్త_స్తోత్రాలు
దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న, చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ- గంధం, పసుపురంగు పుష్పాలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేసుకొని, ముందుగా గణపతిని పూజించి, దత్తునిపూజ మొదలు పెట్టాలి.
దత్త అష్టోత్తరం, దత్తస్తవం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తిశ్రద్ధలతో పఠించాలి.
పసుపురంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, కేసరి బాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి.
ఈ రోజు గురు చరిత్ర (అంటే దత్తాత్రేయుని చరిత్ర మాత్రమే! ఏదిపడితే అదికాదు) పారాయణం చేయడం శుభప్రదం.

ఇంట్లో పూజ పూర్తయ్యాక, సమీపంలోని దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజు దేవాలయాలలో అన్నదానం చేయడంవలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయస్వామి వెంట ఎల్లప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఈ నాలుగు కుక్కలూ- నాలుగు వేదాలకు చిహ్నము. అందుకే దత్త జయంతిరోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే,  శని బాధలు, అనారోగ్య సమస్యలు ,తొలగిపోతాయి. అలాగే ఈ రోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది. విశేషించి, ఈ రోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా, విన్నా శుభం జరుగుతుంది.
భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరంలేదు. మనకున్నది నలుగురితో పంచుకుని, సంతోషంగా ఉండడమే దత్తాత్రేయస్వామి మానవాళికి ఇచ్చే సందేశం. అందుకే, దత్తాత్రేయుని గురువుగా భావించి, పూజించి- అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వలన- పితృదేవతల అనుగ్రహంతో పాటూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.
రేపటి దత్తజయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం... సకల శుభాలను పొందుదాం...   ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః 
శ్రీగురుదత్త అనుగ్రహ సిద్ధిరస్తు
సర్వేసుజనాఃసుఖినోభవంతు.

No comments: