మీరు ఎప్పుడైనా,కారు మబ్బులని చూసి వర్షం పడబోతుందని రైన్ కోట్ ,గొడుగు తీసుకుపోతే చుక్క నీరు కూడా పడలేదా? మర్నాడు కసిగా, మీకు నచ్చిన డ్రెస్లో ఎండ ఉందని, నల్ల కళ్ళద్దాలు వేసుకుని కులాసాగా పోతుంటే, మీపైన జోరున వాన పడిందా ?
ఇలాగ కొన్ని సార్లు విధి మనతో ఆటలాడినప్పుడు ఖర్మ రా…. బాబు ఖర్మ… అనుకుని నెత్తి కొట్టుకుంటారా. నేను అంతే.
అయితే ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి వాటిమీద రాసిన సూత్రాల గురించి, ఘనత వహించిన మర్ఫీ గారి గురించి విన్నప్పుడు, ఎక్కడో ఓ తెల్లోడు కూడా ఇలానే ఫీల్ అయ్యాడు అనిపించి, సరదాగా చదివానండి. పుసుక్కున నచ్చేసి, అప్పటినుండి ఇలాంటి సంఘటన జరిగితే, మొహం మాడ్చేసుకుని తిట్టుకుంటూ ఉండకుండా, ఒక చిన్న నవ్వేసుకుని "ఓరి మర్ఫీ నువ్వు మామూలోడు కాదురా" అనుకుంటా. ఇంతకీ మర్ఫీ అనేవాడు ఉన్నాడో లేదో కూడా తెలీదు(లేదని సూత్రీకరించారు ) కానీ ఈ సూత్రాలు మాత్రం నెట్ లో, పుస్తకాల్లో బాగా ప్రసిద్ధి అయ్యాయి .
(the originalmetalsidecompany image)
వీటి గురించి మీరెప్పుడు వినకపోతే కొన్ని చెణుకులు విసురుతా చూడండి. నా సామిరంగా మీరు కూడా వీటికి ఫాన్స్ అయిపోతారనే దానికి ఏ మాత్రం సందేహం లేదు.
- తోటలో తికమకలు (laws of gardening) : పక్కోడి తోటలో పనిచేసే పనిముట్లు, వాడి తోటలోనే పనిచేస్తాయి, మీ తోటకి పనికి రావు.
- పెద్ద పెద్ద పేరున్న పరికరాలు, అసలు పనే చేయవు.
ఎవరూ దాన్ని వాడటం లేదంటే , దాంట్లో అర్ధం ఉందన్న మాటేగా.
మీకు అస్సలు అవసరం లేని వస్తువు, అతి ఎక్కువగా కనపడుతుంటుంది .
ఇంకా ఇలాంటివి కొన్ని…
(thebrightside image)
- మీరు అతి కష్టంగా వెతికి సంపాదించిన వస్తువు, మీ చేతి కొచ్చిన మరుక్షణం నుంచి ప్రతి షాపులో దర్శనం ఇస్తుంది.
- మీరేదైనా వస్తువుని కనపడలేదని కొత్తది కొన్న మరుక్షణమే, అది మీ కళ్ళముందు ప్రత్యక్షం అవుతుంది.
- మీరు నించున్న క్యూ కన్నా, పక్క లైన్ ఎప్పుడు వేగంగా కదలటం ఖాయం.
- మీరు వెతుకుతున్న వస్తువు ఎప్పుడూ, మీరు ఖచ్చితంగా ఉండదులే అనుకున్న ప్రదేశంలోనే దొరుకుతుంది.
- షాపులు మూసిన తర్వాతే, వస్తువుల అవసరం వస్తుంది.
- డాక్టర్లు ఉండని ఆది వారాలు ,సెలవ రోజుల్లోనే, రోగాలు వస్తాయి.
- ఏదైనా తప్పు జరిగేందుకు ఆస్కారం ఉందంటే, ఆ తప్పు జరిగే తీరుతుంది.
- ఒక వస్తువు ఎంత ఖరీదైనదైతే అంత ఎక్కువ పగిలే చాన్సు ఉంటుంది.
- అన్ని ఉపద్రవాలు కట్టగట్టుకుని ఒక్కసారే వస్తాయి.
- ఏదైనా ఒక విషయం గురించి మీరు చెప్పాలనుకున్నపుడు…1)మంచిదైతే వెంటనే అది మాయం కావటం ఖాయం..2) చెడ్డ దైతే వెనువెంటనే జరగటం ఖాయం.
- మనం అరువిచ్చిన పుస్తకాల్లో మనకు పిచ్చపిచ్చగా నచ్చే పుస్తకం మాత్రం నికరంగా ఎట్టి పరిస్తితుల్లో వెనక్కి రాదు.
- మనం ఒక వస్తువు ఎన్ని రోజుల్నించో వాడకుండా పెట్టి పెట్టి, చిరాగ్గా బయటకు విసిరేస్తామా ,మరుక్షణమే దాని అవసరం వస్తుంది.
ఇది ఇంకా అదిరిపోయే సూత్రం…ఒకవస్తువు ఏ వేపు పడితే దుంప నాశనం అయ్యే ప్రమాదం ఉంటుందో నూటికి నూరు సార్లు ఆవేపే పడుతుంది.(సాధారణం గా మన సెల్ ఫోన్ లో స్క్రీన్ ఉండే వైపు). ఇంకోవైపు పడదుకాక పడదు.
మీరు కూడా సేకరించి వీటిని చదవండి.సరదాగా నవ్వుకోండి.
(సేకరణ)
No comments:
Post a Comment