Travelling | భారతీయులకు ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్‌నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా కళకళలాడుతూనే ఉండటానికి కారణం భారతీయ టూరిస్టులే.
కోవిడ్-19 తర్వాత యువతలో ట్రావెల్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. దేశీయంగానే గాక విదేశాలకూ వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేస్తున్న ఖర్చు రూ. 12,500 కోట్లు. ఇది ఏడాది మొత్తం అనుకునేరు! నెల రోజులకు మాత్రమే.. మీరు కూడా దేశీయంగా పలు ప్రదేశాలకు వెళ్లి ఏదైనా విదేశీ ప్రయాణం చేయాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే అందుకు కజకిస్థాన్ బెస్ట్ ఆప్షన్. అదేంటి? ప్రపంచంలో విహారయాత్రలకు యూఎస్‌ఏ, యూకే, యూరప్ వంటి ఎన్నో ప్రదేశాలుండగా కజకిస్థానే ఎందుకు అంటారా? అయితే ఇది చదవాల్సిందే.
వీసా లేదు గురూ..
యూఎస్‌ఏ, యూకే, యూరప్ వంటి దేశాలకు ఎక్కడికి వెళ్లాలన్నా వీసా కష్టాలు పడాల్సిందే. అదీగాక అక్కడి ఖర్చులకు జేబులు చిల్లులు పడాల్సిందే. కానీ కజకిస్థాన్‌కు వీసా తంటాలేమీ లేవు. భారత పాస్ పోర్టు ఉంటే చాలంతే. భారత ప్రయాణీకులకు 14 రోజుల వీసా ఫ్రీ పాలసీని కజకిస్థాన్ 2022లో ఆమోదించింది. దీని ప్రకారం.. 180 రోజులలో ఒక భారతీయుడు మూడు సార్లు 14 రోజులపాటు అక్కడ వీసా లేకుండా విహరించొచ్చు. అదీగాక ఇక్కడ ప్రయాణాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
మూడు గంటల్లో వెళ్లొచ్చు..
దేశ రాజధాని ఢిల్లీ నుంచి కజకిస్థాన్‌లోని అతి పెద్ద నగరమైన అల్మటికి విమాన ప్రయాణం మూడు గంటలు మాత్రమే. ఇండిగో, ఎయిర్ ఆస్తానా విమానాల్లో ఢిల్లీలో ఎక్కితే ఒక హిందీ సినిమా అయిపోయేలోపు అల్మటిలో దిగొచ్చు. గతేడాది భారత్ నుంచి ట్రావెలర్లు ఎక్కువ ప్రయాణించిన దేశంగా కజకిస్థాన్ నిలిచింది. Make MyTrip నివేదించిన ‘How india Travels Abroad’ అన్న నివేదిక ప్రకారం 2023 జూన్ నుంచి 2024 మే దాకా భారతీయులు అధికంగా ప్రయాణించిన 10 దేశాల జాబితాలో కజకిస్థాన్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. 2023లో ఈ దేశానికి భారత్ నుంచి 28,300 ప్రయాణీకులు కజకిస్థాన్ అందాలను చూసేందుకు వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు ఏడాదుల్తో పోల్చితే ఇది ఏకంగా 400 శాతం అధికమట.. ఈ విషయాన్ని స్వయంగా కజకిస్థాన్ టూరిజం కమిటీ చైర్మన్ డస్టన్ రైస్పెకొవ్ వెల్లడించాడు.
No comments:
Post a Comment