*‘భగవద్గీత’* సారాంశాన్ని అర్జునుడికి ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ ఇంట అల్లరివాడుగా , వెన్నముద్దల దొంగగా , అద్భుత లీలలను చూపిన మాయలమారిగా కనబడటం ద్వారా పెంచే తల్లిగా అవకాశం , అదృష్టం ఆ యశోదమ్మకే దక్కించాడు.
*‘యశః’ అంటే కీర్తి.*
*‘ద’ అంటే ఇచ్చేది.*
*ఆమె పూర్వజన్మలో ద్రోణుని భార్య ‘ధర’.*
*ఒకానొకప్పుడు బ్రహ్మ ఈ ద్రోణుడు , ధరలను పిలిచి , ‘ఒక ప్రయోజనం కోసం మీరు భూలోకంలో జన్మించాలని’ కోరతాడు. అప్పుడు వాళ్ళు ‘వెళ్తాం. కానీ అక్కడ మాకు నిరంతరం విష్ణువును సేవించే అవకాశమివ్వాలని’* ప్రతిగా కోరుతారు. అంతేకాక , వీరికి సంతానం లేనందున త్వరగా అనుగ్రహమిచ్చే గంధమాదన అనే పర్వతం దగ్గర విష్ణువును ప్రార్థిస్తారు.
కానీ , విష్ణువు అనుగ్రహం , పలుకు దొరకనందున వారు అక్కడే అగ్నిలో ఆహుతై పోయారు.
అప్పుడు అశరీరవాణి *‘శ్రీమహావిష్ణువే మీకు కుమారుడుగా లభ్యమవుతాడని’* చెప్పిందట.
అలా , వారు బ్రహ్మ కోరిక మేరకు భూలోకంలో నందగోకులంలో జన్మించడం , కృష్ణున్ని సంతానంగా యోగమాయ స్థానంలో పొందడం జరిగింది.
యశోద ఒడిలో పడుకొని పాలు తాగుతున్న కృష్ణుడు పెద్దగా ఆవులిస్తాడు. అప్పుడు ఆ నోటిలో బ్రహ్మాండమంతా కనపడింది.
ఇంకోసారి *‘మన్ను తిన్నాడని’* మందలించి నోరు తెరవమంటుంది, అప్పుడూ ఆ నోటిలో బ్రహ్మాండాన్నంతా మళ్లీ చూసింది.
యశోద అనుభవించిన ఈ *‘అద్భుతానంద దర్శనభాగ్యం’* మరే తల్లికీ దక్కలేదు.
దేవదేవుని ఎన్ని మాయలో , మరెన్ని అద్భుతాలో చూసింది , అనుభవించింది ఆ తల్లి. *‘కలయో , వైష్ణవ మాయో , నే యశోదనో కానో’* అనుకుంది. పాలకుండ పగులగొట్టిన కొడుకును కోపంతో కొట్టలేదు , తిట్టలేదు. అట్లాగని ఊరుకోలేదు. ఎందుకంటే , గోకులానికి పాలంటే పవిత్రం.
అవి కింద పడితే చేతితో తుడుస్తామే తప్ప కాలితో తొక్కం.
అలాంటి పాలు కింద ఒలక పోశాడని దుఃఖంతో ఏం చేయాలో తోచక తిట్టలేక , కొట్టలేక , తాడుతో కట్టేయాలని అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది.
కట్టేయడానికి రెండంగుళాలు తక్కువైనాయి, చివరకు *‘నేను నిన్ను పట్టుకోలేను. పట్టుబడరా!’* అందట.
ఆ రెండే *‘అహంకార, మమకారాలు’*. ఎప్పుడైతే పరిపూర్ణ శరణాగతి అయ్యిందో అప్పుడే పట్టుబడ్డాడు.
పెంచిన ప్రేమ అనగానే యశోదనే అనుకుంటాం, ఒక్కోసారి *‘కన్నవాళ్ళ ప్రేమకంటే పెంచిన ప్రేమ ఎక్కువ’* అనేదికూడా ఈ తల్లివల్లే లోకానికి తెలిసింది, తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్ష దైవాలని , వారి రుణం తీర్చుకోలేమని కొడుకుగా శ్రీకృష్ణుని జీవితం , పెంచితేనే ప్రేమ ఉంటుందని నిరూపించిన తల్లిగా యశోద జీవితం మానవాళికి ఎల్లకాలం ఆదర్శప్రాయాలే.
No comments:
Post a Comment