పుష్య మాసం ప్రారంభం
*పుష్యమాసం చలికి పరాకాష్ట! పుష్యం హేమంత ఋతువున చివరిమాసం. పుష్యమాసం మకర సంక్రాంతి సంభవించే మధురమాసం, పుష్యమాసం సూర్యుడి దక్షిణదిశా ప్రస్థానానికి చరమ ఘట్టం. ఉత్తరం వైపుగా వెలుగుల యాత్రను ఆరంభించే శుభముహూర్తం, పుష్యమాసంలోనే దక్షిణాయణం పూర్తయి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం 'పగటి’ ప్రభావానికి నిదర్శనం. 'పగలు' వెలుగునకు ప్రతీక. అందువల్ల దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం మొదలయ్యే 'మకరసంక్రాంతి' ఘట్టం వెలుగునకు అనాదిగా శుభచిహ్నమైంది. వెలుగు మన జీవన యానానికి ప్రాణం. మన ప్రగతికి మూలం మనసు గతికి మార్గం. ఇలా వెలుగును పంచె మకర సంక్రాంతికి, వెలుగును పెంచే 'ఉత్తరాయణ' ప్రారంభానికి ఆలవాలమైనది పుష్యమాసం.*
*శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. "పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.*
*పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.*
*శనీశ్వరుడికి ప్రీతికరం పుష్యమాసం*
*పుష్య మాసం శనీశ్వరుడికి ప్రీతికరం. శనీశ్వరుడి జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శని ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి.*
*పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం.*
*ఓం నమో భగవతే వాసుదేవాయ* 🙏
No comments:
Post a Comment