Adsense

Showing posts with label అయ్యప్ప స్వామి దీక్ష. Show all posts
Showing posts with label అయ్యప్ప స్వామి దీక్ష. Show all posts

Monday, November 4, 2024

అయ్యప్ప స్వామి దీక్ష

 అయ్యప్ప స్వామి దీక్ష 

కలియుగములో అయ్యప్ప స్వామి వారి దీక్ష
మహిమాన్వితమైనది. దీక్షలోని నియవు నిష్టలు ఇంద్రియములను నిగ్రహించి దైవనామ స్మరణతో మోక్షాన్ని పొందుటకు, దీక్షా విధానము నాలుగు భాగములని శాస్త్రాలలో చెప్పబడినది.

అవి: 1.సాధన 2.సత్పంగము 3.సేవా 4.శాంతి

సాధన:

ప్రతి దీక్షలోను తప్పకుండా ఆచరించే కొన్ని నియమాలు,
ధర్మాల రూపంలో ఉన్నాయి. శ్రీ ధర్మశాస్త వారి, అనుగ్రహ దీక్షలో కూడా ఈ ధర్మాలను చూడవచ్చు.

మనస్సులో అయ్యప్ప దీక్ష స్వీకరించుకుందామని ఆలోచన రాగానే మాల ధరించే ముందురోజు ఉపవాసం ఉండి, ఇంటి వద్ద పెద్దల, భార్య అనుమతి స్వీకరించాకనే అయ్యప్ప దీక్షలోకి, గురుస్వామి అనుగ్రహముతో మాలధారణ ద్వారా ప్రవేశించాలి. మాలధారణలోనే మీ యొక్క ముక్తి సాధన ఘట్టము మొదలవుతుంది.

మాలధారణ అనంతరము గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్ప స్వామిగా భావించాలి. సమస్త నియమాలను గురుస్వామిని అడిగి తెలుసుకొని ఆచరించాలి.

ఇతర ప్రాణికోటిలో కూడా శ్రీ ధర్మశాస్తా వారిని దర్శించి “స్వామి” అని సంబోధించాలి. 41 రోజులు ఖచ్చితంగా దీక్షను ఆచరించాలి.

ప్రతిరోజు సూర్యోదయానికి ముందే శ్రీ అయ్యప్ప పూజార్చనలు, శరణు ఘోషలు చెప్పి తీరాలి. అనంతరం మన ఇంటికి లేదా దీక్షా గృహమునకు సమీపంలోని ఆలయంలో ఉదయం, సాయంత్రం దైవదర్శనం చేసుకోవాలి.

ఏక భుక్తం (ఒక్క పూట భోజనం) వల్ల దీక్షలో స్వామి పట్ల ఏకాగ్రత, భక్తి, సాత్విక ప్రవృత్తి పెరుగుతాయి. మూడూ పూటలు శుభ్రంగా భోజనం చేస్తే ఈ శరీరం సుఖాలకు బానిసై కోర్కెల వైపు పరుగులు తీస్తుంది. ఈ రోజుల్లో కొందరు స్వాములు ఉదయం టిఫిన్‌ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్‌ కొరకు హోటల్స్‌, రోడ్డు నున్న బడ్డీలను ఆశ్రయిస్తున్నారు.

ఇది ఎంత వరకు సబబు? స్వయంపాకం, ఏకభుక్తం చేయడం
వలన దీక్షలో లక్ష్య సాధనకు ఏకాగ్రత ఏర్పడుతుంది. అలా కానిచో ఏ హోటల్లో ఏ స్వామి ఏం వండుతున్నాడో అన్న ఆలోచన తప్ప, అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ కనిపించాల్సిన మనం, అనగా దీక్షలోని అయ్యప్పలు భోజనం చేస్తూ ప్రజలకు కనిపిస్తున్నారు.

మనకు ముక్తి గురించి ఆలోచించే సమయం లేదు. ప్రజలకు మార్గదర్శకముగా నిలిచే అర్హత కూడా కోల్పోతున్నాము. మనల్ని ఎవ్వరూ బలవంతముగా దీక్ష చెయ్యమనలేదు. దీక్ష సక్రమముగా ఆచరించ లేక స్వామి వారికి చెడ్డపేరు తెస్తున్నాము!

ఆలోచించండి భోజనం అనగా భిక్ష మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత స్వచ్చందంగా చెయ్యక పోవడము మంచిది. దేవాలయంలో జరిగే అన్నదానము అత్యవసర పరిస్థితులలో వండుకోలేని వారికి, బయట ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చిన స్వాములకు, అన్న విషయాన్ని గ్రహించండి. నెలకు సరిపడే డొనేషన్‌ ఇచ్చి రోజూ భోజనం చేయడం కాదు.

అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దు, వ్యామోహాలను దరిచేరనీయ వద్దు. పొరపాటున కూడా కామ, కోధ, లోభ, మదమాత్సర్యాలను మనస్సులోకి రానివ్వొద్దు. నేలపైన నిద్రించాలి, ప్రతిక్షణం మన మనస్సులో అయ్యప్ప నామాన్నే స్మరిస్తుండాలి. మత్తు పదార్థాల ప్రసక్తే రాకూడదు, ఆడంబరాలను, ఆకర్షణలను ఆహ్వానించవద్దు అందరిని సమదృష్టితో చూడాలి. అలా ఆచరించని పక్షంలో దీక్షలోని శక్తి శూన్యమౌతుంది. స్వామి వారికి దూరమవుతాము ముక్తిని
పొందలేము.

దీక్షలో నలుపురంగు పంచెలు లేదా లుంగీలు ధరించాలి. భజనలో దేవాలయ దర్శన వేళల్లో పంచెలు మాత్రమే ధరించండి. ప్యాంటులు నిషేధించండి. సంస్కృతిని కాపాడండి.