Adsense

Showing posts with label అష్ట మంగళ చిహ్నాలు..!!. Show all posts
Showing posts with label అష్ట మంగళ చిహ్నాలు..!!. Show all posts

Sunday, March 31, 2024

అష్ట మంగళ చిహ్నాలు..!!

శ్రీ వైష్ణవ సంప్రదాయం లో  యజ్ఞ యాగాదుల  సమయంలో అష్ట మంగళ చిహ్నాలకి, మహాకుంభాభిషేకానికి  ఎంతో ప్రాధాన్యత వుంది.

మహా కుంభానికి చుట్టూ యీ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు. ఈ అష్ట మంగళ శక్తులు మహా కుంభానికి చేరి , పరమాత్మ లో లీనమౌతాయి. ఇప్పుడు అష్ట మంగళ చిహ్నాలని  వేటిని అంటారో చూద్దాము..

1. శ్రీ వత్సము..

శ్రీ హరి వక్షస్ధలం మీద లక్ష్మీ దేవి నివసించే ప్రదేశము.  లక్ష్మీ దేవికి జన్మస్థలం పాలకడలి.

దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఐరావతమనే ఏనుగు, ఉఛ్ఛైశ్వర్యమనే అశ్వము , కామధేనువు అనే గోమాత తో పాటు ఉద్భవించింది శ్రీ మహా లక్ష్మీ దేవి. శ్రీ మన్నారాయణుని పతిగా పొందిన సౌభాగ్య వతి.

ఆయన వక్షస్ధలమునే  నివాసస్ధానము చేసుకొన్న ది. శ్రీ మన్నారాయణుని  ఎన్నటికీ విడివడని హృదయ నివాసిని యైనది. ఆ నివాస స్ధలమునే  శ్రీ వత్సము అని అంటారు.


2.పూర్ణ కుంభము....

బంగారము, వెండి, రాగి  వస్తువులను బిందెలో వేసి ,నీటి తో నింపి బిందె బైట వైపు దారంతో  చుట్టి దాని మీద పసుపు కుంకుమ ,చందనములతో  అలంకరించి,

పట్టు వస్త్రము చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి  కొమ్మలు పెట్టి  , దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించినదే పూర్ణకుంభము.

లక్ష్మీ దేవి అంశగాను, మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతోంది. 

ఎవరైనా ప్రముఖులు, ఉన్నతాధికారులు, అన్ని రంగాల లో వున్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో  పూర్ణకుంభంతో ఆహ్వానిస్తారు.

3.భేరీ...

భేరీ , నాదం వలన  దుష్ట శక్తులు దరి చేరవు. 
భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితో , భేరీ మ్రోగిస్తారు.  భేరీ ధ్వనులతో అమంగళం అప్రతిహతమౌతుంది. 


4. దర్పణ మండము....
దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురు గా పెడతారు.  అద్దంలో శ్రీ హరి ప్రతి బింబం కనపడుతుంది.  ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో , శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకొని మురిసేందుకు పెడతారు. అన్నీ తానే అనే  తత్వం తెలపడానికి యీ దర్పణం...

5. రెండు మీనాలు....
ఒకదాని కొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూచుకొనే విధంగా అమర్చిన మీనాలు.  మీనాలు రెండూ జీవాత్మ పరమాత్మ . మీనాలు నీళ్ళల్లో మాత్రమే నివసిస్తాయి.  తీరానికి వస్తే జీవం కోల్పోతాయి.

చేపలు నీటిని విడచి బయటకు రావు. అలాగే జీవాత్మ పరమాత్మ ల ఐక్యత తెలుపుతుంది. 
మనం భగవంతుని ప్రార్ధించేటప్పుడు, మనజీవాత్మ పరమాత్మ తో ఏకమై ప్రార్ధించాలి.

6 . శంఖం...

శంఖం తెల్లగా,స్వఛ్ఛమైనది.  పవిత్ర మైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది. 
శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ శంఖు చక్రాలను ధరించి వుంటాడు.  శంఖాలు రెండు రకాలు. దక్షిణావర్త శంఖం యిది మంగళకరమైనది. పాలకడలి లో శ్రీ మహాలక్ష్మి తో పాటు పుట్టినదే.  యీ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో వుంటుంది.  వలంపురీ శంఖం నుండి
ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది.

7. శ్రీ చక్రం....

వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం.  కాలాన్ని కాల చక్రం అంటారు. సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడని అంటారు. 
చక్రత్తాళ్వారు శ్రీ  చక్రం యొక్క అంశ.  శ్రీ మన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ చక్రమును చేతిలో ధరించి వుంటాడు.

8. గరుత్మంతుడు.....

కశ్యపముని వినతల పుత్రుడు.  ఆయనను "గరుడాళ్వార్"అని "పెరియ తిరువడి" అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం.  బ్రహ్మోత్సవాల  సమయంలో  గరుడోత్సవం ఘనంగా జరుపుతారు.
గరుత్మంతుడు మహాబలశాలి ,ధైర్యశాలి.
దానవులతో యుధ్ధం చేసి,అమృత కలశమును భద్రముగా తీసుకుని వచ్చినవాడు.
నిరంతరం వైకుంఠం లో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యము పొందిన వాడు గరుత్మంతుడు.

ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు,కాంతిమంతుడు. నాగులను ఆభరణములుగా ధరించిన వాడు. వైకుంఠం లో భగవంతుని కి అద్దంగా నిలబడినట్లు చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఆలయమునుండి ఊరేగింపు కి బయలుదేరుటకు ముందు అద్దాల సేవ జరుగుతుంది.

సర్వాంతర్యామి యైన భగవంతుడు భక్తుల పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ వుంటాడు....స్వస్తి.