Adsense

Showing posts with label ఏడు రకాల అన్నం... మీ కోసం. Show all posts
Showing posts with label ఏడు రకాల అన్నం... మీ కోసం. Show all posts

Sunday, December 22, 2024

ఏడు రకాల అన్నం... మీ కోసం

అన్నం అనగానే మనకు తెల్లటి వరి అన్నం గుర్తుకొస్తుంది. కానీ మన ప్రాచీన గ్రంధాలలో దీనిని 'కేవలాన్నం' అంటారు. అంటే ఏ ఇతర పదార్థాలు కలపని అన్నం అని అర్ధం.

కేవలాన్నంలో ఇతర పదార్థాలను కలిపితే అవి అద్భుత అన్నాలు అవుతాయంటాడు భోజన కుతూహాలం గ్రంథ రచయిత రఘనాథ సూరి. ఆ అన్నాలేమిటో తెలుసుకుందాం.

పరమాన్నం

'తండుల త్రిగుణం దుగ్ధం దుగ్ధార్థం జీవనీయకమ్‌ తదర్థం! గుడచూర్ణంతు పరమాన్న మితి స్మృతమ్‌'

బియ్యానికి మూడు రెట్లు చిక్కని పాలు, పాలలో సగం నీళ్లు, ఆ నీళ్ళకు సగం బెల్లంపొడి ఈ కొలతలలో తీసుకుని వండినది పరమాన్నం.

హరిద్రాన్నం

''సంస్కృతం మధితం గవ్యం తండులానాం చతుర్గుణం్ఢ ఈషత్‌ హరిద్రయా యుక్తం మరీచా జాజి సంయుతమ్‌ఖ హరిద్రాన్నం''

అంటే పసుపు అన్నం అని! ఇది పులిహార కాదు ఒక రకం క్షీరాన్నమే! దీని తయారీకి బాగా శుద్ధి చేసి చిలికిన పాలను.. అవి నాలుగోవంతు అయ్యేదాకా మరిగించాలి. అప్పుడు బియ్యానికి నాలుగు రెట్లు ఎక్కువ ఈ పాలను పోసి.. దానిలో పసుపు, మిరియాలపొడి, జాజికాయపొడి వేయాలి. దీనిని నెయ్యి, బెల్లం నంజుకుంటూ తింటారు.

దధ్యాన్నం

''మధురామ్లేన గోదధ్నా శుద్ధాన్నంతు విమిశ్రితంఖ శాంశ్చ నిర్ణిజ్యనిషీడ్య షోడాభఃక్షాళయేద్‌ బుద్ధాఃఖ నిర్ణిజ్య''

అన్నాన్ని వండటానికి తీసుకునే బియ్యాన్ని నీళ్లు పోసి చేతితో పిసుకుతూ.. కడగాలి. ఇలా 8 సార్లు కడగాలి. ఈ బియ్యం ఉడుకుతున్నప్పుడు దానిలో మిరియాలపొడి, అల్లం ముక్కలు, సైంధవ లవణం వేసి ఉడికించాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత దానిలో శుద్ధమైన పెరుగు వేసి కలపాలి. పెరుగు మన శరీరానికి అవసరమైన మంచి సూక్ష్మక్రిములను అందిస్తుంది.

కృశరాన్నం

బియ్యంలో సగం పెసరపప్పు కలిపి వండిన పులగం లేదా కటుపొంగలినే కృశరాన్నం అని కూడా అంటారు. దీనిని నేతితో వండుతారు.

గుడోదనం

పాలలో సగం కొలతలో బెల్లం తీసుకుని అదే పాలలో కరిగించి పరమాన్నం వండుకోవాలి. ఈ పరమాన్నంలో నెయ్యి, చక్రకేళి పండ్ల గుజ్జు కూడా కలుపుతారు. పరమాన్నంలో కంటే ఎక్కువ బెల్లం.. అదనంగా నెయ్యి, అరటిపళ్లు కలుస్తాయి.

ముద్గాన్నం

మూడు భాగాలు బియ్యం, ఒక భాగం పెసరపప్పు కలిపి తగినంత ఉప్పు వేసేది ముద్గాన్నం. ఇందులో రుచికి ఒక చెంచాడు నెయ్యి వేసుకుని తింటారంతే!

భూతోదనం

'హృదయాధిప' అనే గ్రంథంలో పెరుగు, పసుపు, వేగించి విసిరిన పెసరపిండి, చక్కగా ఉడికిన అన్నం, కొద్దిగా ఆవపిండి కలిపిన అన్నాన్ని భూతోదన అంటారని భోజన కుతూహలం పేర్కొంది. ఉడికించిన కూరగాయ ముక్కలు కూడా ఇందులో కలుపుకుంటే ఇది అద్భుతమైన ఆహరం అవుతుంది.