Adsense

Showing posts with label ద్వారకా తిరుమల ప్రాశస్త్యం. Show all posts
Showing posts with label ద్వారకా తిరుమల ప్రాశస్త్యం. Show all posts

Saturday, September 26, 2020

ద్వారకా తిరుమల ప్రాశస్త్యం

*కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే*
*ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1*

తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.

అంటూ .........కలియుగ ప్రత్యక్ష దైవం గా పూజలందుకుంటున్న శ్రీవేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన క్షేత్రం  ద్వారకా తిరుమల. 

ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. ఇది విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మీ. దూరంలోను ఉన్నది. 

ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. 

ఈ ద్వారకా తిరుమల గురించి ఒక విషయాన్ని భక్తులు చాలా కాలంగా విశ్వసిస్తున్నారు. అది ఏమిటనే విషయంతో పాటు ఈ క్షేత్రం యొక్క విశేషాలు, ఇక్కడ ఉన్న ఇతర ఆలయాలు, పర్యాటక ప్రాంతాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

*1. శ్రేషాద్రి కొండపై*

ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము.

*స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది.*

*2. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి*

సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. *ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండడం కూడా అరుదు.* 

*"పెద్దతిరుపతి"* (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును *"చిన్నతిరుపతి"* లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.

*3. ఒకే విమాన శిఖరం క్రింద*

ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము. ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. 

*4. మరో వాదన*

ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు. ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. 

ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం - దారుకము వృత్తిగా కలవారు , దారువులు (చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.

తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.

*5. దశరథ మహారాజు కాలం నాటిది*

స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించాలని భావించాడు.

*6. అందువల్లే మరో విగ్రహం*

దీంతో మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. 

స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము.

*7. ప్రతి ఏటా రెండు కళ్యానోత్సవములు*

ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యాణోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయం భూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా రెండు కళ్యాణోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఈ చిన్న తిరుపతిలో నిర్వహిస్తారు.

*8. అక్కడే స్వామివారి పాదాలు*
గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలి మెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారముల విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.

*9. 12 మంది ఆళ్వారుల ప్రతిమలు*

ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.

*10. విశేష కుంకుమార్చన*

గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు. ఈ కుంకుమార్చనకు స్థానికులే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.

*11. నాలుగు గాలి గోపురాలు*

ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్తులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్ఠింపబడ్డాయి. పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

*12. పుష్కరిణి*

గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాల సమయంలో ఇక్కడ లక్షల మంది ప్రజలు చేరుతారు.

*13. అనేక మంటపాలు*

గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరు వీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు. ఈ సేవలకు ఎక్కువ మంది భక్తులు హాజరవుతారు.

*14. ఇతర ఆలయాలు*

*భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం :* 

కొండపైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. అందువల్ల ఈ గుడిని పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు.

*15. అతిథి గృహం*

ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజమ్ డిపార్ట్‌మెంటు వారి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతూ దేవాలయానికి ఎక్కువ ఆదాయం కూడా తీసుకువస్తోంది.

*16. సమీప దేవాలయాలు*

*కుంకుళ్ళమ్మవారి గుడి*
 *కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం :* 

కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోలు నుండి ద్వారకా తిరుమల మార్గంలో *"కుంకుళ్ళమ్మ"* ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

*జగన్నాథ స్వామి ఆలయం*
జగన్నాధ స్వామి ఆలయాలు : ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది.

*17.బలభద్రుడు, సుభద్ర కూడ*
వారిది పూరీ జగన్నాధ మఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.

*18.విమాన మార్గం*
ద్వారకా తిరుమలకి రెండు దేశీయ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్నాయి. వాటిలో ఒకటి 75 కి. మీ. దూరంలో ఉన్న రాజమండ్రి, మరొకటి 98 కి. మీ. దూరంలో ఉన్న విజయవాడ. ఈ రెండు విమానాశ్రయాల నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు ప్రయాణించవచ్చు. రైలు మార్గంద్వారకా తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడెం. ఇది 47 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. అదే విధంగా 17 కి. మీ. దూరంలో ఉన్న భీమడోలులో ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. భక్తులకి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అనుకూలంగా ఉంటుంది.

*19. బస్సు మార్గం*
బస్సు మార్గం విజయవాడ - రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్న ద్వారకా తిరుమల క్షేత్రం, జిల్లా ప్రధాన కేంద్రం ఏలురుకు 41 కి. మీ. దూరంలో, భీమడోలుకు 17 కి. మీ. దూరంలో, తాడేపల్లి గూడెం కి 47 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రతి రోజు ఈ క్షేత్రానికి రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల నుంచి బస్సులను రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు నడుపుతోంది.