Adsense

Showing posts with label ధనుర్మాసం ప్రారంభం. Show all posts
Showing posts with label ధనుర్మాసం ప్రారంభం. Show all posts

Friday, December 13, 2024

ధనుర్మాసం ప్రారంభం , ధనుర్మాసం విశిష్టత

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.  విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని *బాలభోగం* అని పిలుస్తారు.

*☘భోగితో ముగుస్తుంది:☘*

సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) *మార్గళి వ్రతం*  పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

*☘ఎంతో పునీత మాసం:☘*

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. *ధను* అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు , ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

*☘బ్రహ్మముహూర్తంలో పారాయణం:☘*

ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్త్రవచనం. సాక్షాత్‌ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో *"తిరు"* అనగా పవిత్రమైన , పావై అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

*☘శ్రీకృష్ణుడికి తులసిమాల:☘*

ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులు చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజు అయినా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.

*శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా*
*తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:*

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం.

*ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?*

ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది.
ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.

*కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:*

వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

*ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:*

రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.

*గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?*

ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

   *కాత్యాయనీ వ్రతం:*

    *పూజా విధానం:*

రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం , గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది. ముందుగా ప్రార్ధన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ తొమ్మిది , పది తనయలు రెండు సార్లు చదవాలి. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్ధన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.

*పాశురములు* చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి.
చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.

*నైవేద్యం* సమర్పంచాలి(రోజు పొంగలి , దద్ధోజనం , పరవన్నం ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే  నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం.

*హరే క్రిష్ణ గోదా క్రిష్ణ*