Adsense

Showing posts with label నిబద్ధత. Show all posts
Showing posts with label నిబద్ధత. Show all posts

Sunday, September 27, 2020

నిబద్ధత


ఒక దృఢసంకల్పానికో, మంచి మాటకో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే ‘నిబద్ధత’. మనో వాక్కాయకర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించడం నిమగ్నం కావడమే నిబద్ధత అనిపించుకుంటుంది.
ప్రతి మనిషీ ఏదో ఒక విషయంలోనో, కొన్ని విషయాల్లోనో నిబద్ధుడై ఉంటాడు. అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు. ఆధ్యాత్మిక సంపన్నులెవ్వరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలను అతిక్రమించరు. విస్మరించరు. నిబద్ధులైనవారికి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది.  వారికెప్పుడూ నిరాశా నిస్పృహలు కలగవు. పైగా అంతర్యామికి అధీనులై ఆత్మ సమర్పణ భావంతో, సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు. నారాయణుడే వారికి నమ్మకం. నారాయణ శరణాగతే వారి ఆశయం.
నిబద్ధత లేనివాడి మనసు చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది. అటువంటివాణ్ని కామక్రోధాది అరిషడ్వర్గాలు ఆవరించి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.
ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడంలాంటిది. ఒక సత్సంకల్పం, దాన్ని ఆచరించే ప్రణాళిక, ఆచరణలో ఏకాగ్రత, సాధన... మనిషిని అసలైన నిబద్ధుడిగా నిలబెడతాయి. బాధలు అనే మదపుటేనుగును సైతం లొంగదీసుకునే అంకుశమే నిబద్ధత. సత్సంకల్పం మీద నమ్మకం లేనివాడు, దానికి కట్టుబడనివాడు సమస్యల్ని అధిగమించలేడు. నిజాయతీపరుడు, నిబద్ధతతో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా ఉచ్చదశకు చేరుకోగలుగుతాడు. పదిమందికీ దిశానిర్దేశం చేయగలుగుతాడు. ఏ ఓటమైనా అతడి ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది. నిబద్ధత లేని జీవన విధానం జీనులేని గుర్రంలాంటిది. జీవితమన్నాక ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. అవరోధాలు కలుగుతాయి. బాధలు ఎదురవుతాయి. అవన్నీ భగవంతుడు పంపిన దూతలనుకొని, వాటిని గౌరవించాలి, భరించాలి, సహించాలి. స్థితప్రజ్ఞుడు నిబద్ధతతో సుఖ దుఃఖాలను, విజయాలను, విఘ్నాలను సమానంగానే చూస్తాడు, అనుభవిస్తాడు. సుఖాన్నిచ్చే వస్తువు దగ్గర ఉన్నా లేకపోయినా, తేడా అనేది తెలీదు నిబద్ధుడైనవాడికి. అటువంటివాడు పరమాత్మకు అత్యంత ప్రియుడు, ఆత్మీయుడు. సత్కార్యం పట్ల శ్రద్ధ, ప్రేమ ఉన్నవాడిని ఏ మనో వికారమూ ప్రలోభపెట్టలేదు. సామాన్య మానవుడు దుఃఖంలో వెనక్కి, కష్టంలో అన్ని వైపులా, భక్తిలో పైకి చూస్తాడు. నిబద్ధత కలవాడు ఏ   దశలోనైనా పై దిశకే చూస్తాడు. అంటే ఈశ్వరుడి వైపు చూస్తాడన్నమాట!
పురాణేతిహాసాల్లో చాలా పాత్రల్లో మనకు ఈ నిబద్ధత కనిపిస్తుంది. ధర్మానికి నిబద్ధుడు శ్రీరాముడు. భ్రాతృ భక్తికి నిబద్ధులైనవారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. దాస్య భక్తికి కట్టుబడినవాడు హనుమ. స్వామిభక్తికి లోనైనవాడు కర్ణుడు. బ్రహ్మచర్య దీక్షకు జీవితాన్ని ధారపోసినవాడు భీష్ముడు. సత్యానికి జీవితం అంకితం చేసిన మహనీయుడు హరిశ్చంద్రుడు. దానగుణానికి ప్రసిద్ధి చెందినవారు శిబి, దధీచి, బలి. సాధ్వీమణులంతా పతిసేవా పరాయణత్వంతో ఆదర్శమూర్తులైనారు. ప్రేమ, వాత్సల్యం, బంధానుబంధాలు, సత్సాంగత్యం, గురుభక్తి, అహింస, పరోపకార చింతన, నిస్వార్థం, నిరహంకారం, జ్ఞానతృష్ణ... నిబద్ధుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. అతడిలో ఏ దుర్లక్షణం ప్రవేశించినా కుండెడు తేనెలో విషపు చుక్క వేసినట్లే. ఇందుకు రావణుడే ప్రత్యక్ష తార్కాణం. నిరంతర సాధన, ఏకాగ్రత,  శ్రద్ధ, పట్టుదల సత్సంకల్ప సాధనకు పట్టుగొమ్మలు. అవే జాతి ప్రగతికి, దేశ భవితకు అసలైన సొమ్ములు.