Adsense

Showing posts with label పంచరంగ క్షేత్రాలు చూసారా?. Show all posts
Showing posts with label పంచరంగ క్షేత్రాలు చూసారా?. Show all posts

Saturday, January 18, 2025

పంచరంగ క్షేత్రాలు చూసారా?

పంచరంగ క్షేత్రాలు చూసారా?

1.శ్రీరంగపట్నం:– ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!

2.తిరుప్పునగర్‌:– తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు.

3.కుంబకోణం:– ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.

4.మయిలదుతురై:– చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

5.శ్రీరంగం:– పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే!

Source:Facebook