మీ ఉద్దేశ్యంలో మనదేశం అని అన్నారో లేక మొత్తం ప్రపంచంలో అని అన్నారో తెలియలేదు. మనదేశంలో పరీక్షల గురించి నేను వెతికినా ,ఋజువులున్న ఆధారాలు కనపడలేదు. తొందరపడి ఏదో రాయటం ఇష్టంలేక,మిగతా ప్రపంచ ఉదాహరణలు రాస్తున్నాను. అలాగే ఇప్పటి పరీక్ష వెనుక రసాయనికత వివరిస్తాను. ఓపిక గా చదవండి.
గింజల పరీక్ష :
3 వేళ ఏళ్ల క్రితం ఈజిప్ట్ లో స్త్రీ లు గర్భం దాల్చినట్టు అనిపిస్తే , వారి మూత్రాన్ని ,యవలు(barley ),గోధుమల గింజలపైన, పోసే వారట . ఒక వారం లోగా అవి మొలకెత్తితే వారు గర్భం దాల్చినట్టు నిర్ధారించే వారు. ఇది నేటి పరీక్షల తో పోలిస్తే 70 శాతం కచ్చితత్వం ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది ఏదో ఊహించి చేసినా, కొంతవరకు కరెక్టే మరి. దీని విషయం వివరణకి ,కొంత సమయం తీసుకుని ,మిగతా పరీక్షల విషయానికి పోదాం.
ఉల్లిపాయ పరీక్ష:
గ్రీకుల పద్దతిలో, మర్మావయవాల వద్ద ఉల్లిపాయ ఉంచి మర్నాడు నోటి నుండి, ఆ వాసన వస్తే గర్భిణి అనేవారు. లోపల పిండం వల్ల ,మొత్తం జీర్ణనాళం ,పూర్తి గా తెరుచుకుని ఒక గొట్టం లా పనిచేస్తుంది అని అనుకునేవారు. ఇందులో నిజం లేదని మీకు తెలుసు.
తాళం పద్దతి :
15 వ శతాబ్దంలో పరీక్ష చేయవలసిన వ్యక్తీ మూత్రం ఉన్న, ఒక గిన్నెలో తాళం వేస్తే మర్నాటికి కింద ఆ తాళపు అచ్చు ఉందంటే,గర్భధారణ సూచన గా భావించే వారు. ఇది కూడా అర్ధం లేని ఆలోచనే.
మూత్ర ప్రవీణులు :
వీరు 16 వ శతాబ్ది లో యూరోప్ లో ఉండేవారట . మూత్రం రంగు,లక్షణాలు చూసి పుట్టబోయే బిడ్డ , ఆడో , మగో ,చెప్పేసే వారట . కొందరు మూత్రాన్ని ద్రాక్షా రసం లో వేసి, అది పారదర్శకత కోల్పోతే, గర్భిణి అని తలచే వారట (clouding of wine).
కంటి రంగు:
గర్భం దాల్చిన వారికీ, రెండో నెలలోపు ,కంటిలో జరిగే మార్పులు గమనించి, ఫలితం చెప్పగల నేర్పు ఆనాటి వైద్యులకు ఉండేది. ఇలా అన్నది 16 వ శతాబ్ది వైద్యుడు జాక్ గిల్మవు (jacques guillemeau ). గర్భధారణ సమయంలో కంటిలో మార్పులు, కొందరిలో సహజమే అని నేటి పరిశోధనలు చెపుతున్నాయి కూడా.
చాడ్విక్ చిహ్నం (Chadwick’s sign) :
మర్మావయవాల వద్ద, ఎక్కువ రక్తప్రసరణ వల్ల ,రంగు పెరుగుతుందని ,1836 లో ఫ్రెంచి వైద్యు డైన జెమ్స్ చాడ్విక్ ,కనుగొన్నాడు. అయితే ఇది అందరికీ ,అన్నిసార్లూ వీలుపడే పరీక్ష కాదు. ఆకాలంలో ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా అరుదుగా చేసేవారు.
కుందేలు పరీక్ష:
1920 లో ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు, సెలమార్ అష్హీమ్ ,జోన్దేక్ లు, దీన్ని ప్రస్తావించారు. గర్భిణి మూత్రాన్ని, కుందేలు లో ఎక్కించినట్టయితే, దానిలో గర్భాశయ వృద్ధి కనపడుతుంది. ఇది పూర్తిగా పెరగని ,పిల్ల కుందేళ్ల లలో కూడా, గమనించారు.అయితే ఇలా ఒక గర్భ పరీక్ష కోసం, రెండుమూడు కుందేళ్ళు చనిపోయేవట. దీనివల్లే గర్భం దాల్చటాన్ని, నర్మగర్భంగా “కుందేలు చచ్చింది” అనే వారట. ఇలా కుందేళ్లే కాకుండా, ఎలుకలు,చుంచులు బోలెడు, వారికోసం చంపబడేవి.
కప్ప పరీక్ష :
ఇది కూడా కుందేలు వంటిదే. 1940 చివరి వరకు దీన్ని చేస్తూనే ఉండేవారంటే దీని ప్రాచుర్యం గమనించండి. ఇక్కడకూడా గర్భిణి మూత్రాన్ని, బతికున్న కప్ప లోకి, సూది ద్వారా ఎక్కించి, 24 గంటలలో అది గుడ్లు పెడితే వారు గర్భిణీయే ,అని నిర్ధారణ చేసేవారు. ఇందు కోసం "జేనోపాస్ "(xenopus) అనే" ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్" ని ఉపయోగించేవారు. వీటిని పెంచి, పెద్దఎత్తున సరఫరా కూడా చేసేవారు.
పైన ఆన్ని చోట్లా మూత్రం అని, తెగ రాసేశాడు ఏమిటా అని తిట్టుకుంటున్నారా? అందులో ఒక కారణం ఉందండి .
(bioninja image)
గర్భందాల్చిన వారి మూత్రం లో ఉండే హార్మోనులు ప్రత్యేక మైనవి .అండం, శుక్రకణం తో కలిసి ,ఫలదీకరణ జరిగి, పిండంగా మారే క్రమంలో, జరాయువు (placenta) నుండి ,ఒక హార్మోను విడుదలవుతుంది. దీన్ని hCG(human Chorionic Gonadotropin) గా పిలుస్తారు. ఇది గర్భిణి శరీరాన్ని, పిండం వృద్ధికి ,అనుగుణంగా మారేందుకు, సూచనలు పంపుతుంది. అంటే అండాశయానికి, ఇక అండం తయారీ ఆపి ,పిండం ఎదిగేందుకు ,సహకరించమని చెప్పటం, అన్నమాట. ఏదైనా హార్మోన్, పని అయ్యాక, అది మూత్రం ద్వారా, విసర్జింప బడుతుంది. అందుకే ,గర్భిణి మూత్రంలో ఇది ఉంటుందన్నమాట. మూత్రం కంటే రక్తంలో ఇది అధిక ప్రమాణం లో ఉంటుంది. అందుకే రక్తపరీక్ష ,మూత్ర పరీక్ష కంటే, ఎక్కువ ప్రభావశీలి .
(clear blue image )
అదే, గర్భం లేని వ్యక్తి, మూత్రంలో ఇది ఉండదు. ఈ హార్మోన్ యే , కుందేళ్ళు ,ఎలుకలలో, అండాలను వృద్ధి చేసేలా ప్రేరేపిస్తున్నది. ఇంకా చెప్పాలంటే గోధుమలు,యవలు మొలకెత్తే లా కూడా చేస్తున్నది. నిజానికి hCG అనే దాని పని, గుడ్లు తయారు చేయించటం కాదు కదా ,అని మీకు సందేహం రావచ్చు. అలా చేసేందుకు ఉన్న, లూటీనయిజింగ్ హార్మోన్ (luteinizing hormone) ని ,ఇక్కడ చెప్పిన hCG అనేది, అనుకరణ(mimic ) చేయటం వల్ల ఇలా జరుగుతుంది. అయితే గర్భం దాల్చని వారిలో ఈ లూటీనయిజింగ్ హార్మోన్ ఉంది గా, అదే ఈ పని చేయొచ్చుగా అని మీరంటారు. రసాయనిక పరంగా , దాని కంటే, hCG యే ఎక్కువ ప్రభావశీలి.
1970 లలో చేసే పరీక్షల్లో టెస్ట్ ట్యూబుల్లో నమూనా సేకరణ చేసేవారు. ఇందులో గొర్రె రక్తం, hCG ప్రతిదేహం (antibody) లను కలిపి, అందులో మూత్ర నమూనా చేర్చి, కణాలు గడ్డకడితే, గర్భం లేదని,కట్టకపోతే, గర్భమని సూచన చేసేవారు.
(freepik image)
ఇక తర్వాత చిన్న ప్లాస్టిక్ కడ్డీల (stick) పరీక్షలు మొదలయ్యాయి. వీటిలో గొర్రె రక్తం బదులు, కొన్ని వర్ణాలతో కలిపిన, hCG ప్రతిదేహాలు ఉంటాయి. దీనివల్ల ఆధునిక యువతులు తమ ఇంటి లోనే పరీక్ష చేసుకునే సదుపాయం లభించింది .
(సేకరణ కోరా నుంచి)