Adsense

Showing posts with label రామ నామం యొక్క గొప్పతనం. Show all posts
Showing posts with label రామ నామం యొక్క గొప్పతనం. Show all posts

Saturday, April 1, 2023

రామ నామం యొక్క గొప్పతనం



శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని, సమీపం లో ఉన్న ఆనందతాండవపురం చేరారు.

ఆ ఊరిలో పండితులు, ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు.

ఆ జనసమూహంలో అనేకమంది బాలురున్నారు. ఆ బాలురందరినీ పిలిచి , ‘శ్రీ రామాయనమః’ అని నూరు పర్యాయాలు రాసి, ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసినదిగా మహాస్వామి వారికి చెప్పారు. అదేవిధంగా వారంతా ‘శ్రీ రామాయనమః’ అని నూరు సార్లు వ్రాసి, ఆ పత్రాలన్నింటిని స్వామికి సమర్పించారు.

వారందరికి ఒక్కొక్కరికి ఒక్కొక కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి వారు బహూకరించారు.

వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ, స్వామి అరవంలో “సొల్లు సొల్లు.” నీవు వ్రాసింది నీ నోటితో ‘చెప్పు, చెప్పు’ అని ఆదేశించారు. అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ “అయం మూకః, అయం మూకః” (అతడు మూగవాడు మూగవాడు) అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు.

అయినా, స్వామి వారి మాటలను విననట్టుగా మరల ఆ పిల్లవానివైపు తిరిగి “నీ సొల్లు, సొల్లు” (నీవు చెప్పు చెప్పు) అన్నారు. అంతట ఆ బాలుడు “శ్రీ రామాయనమః” అని అందరూ వినేట్టు బిగ్గరగా అన్నాడు.

“మూకం కరోతి వాచాలం!”

ఆ సంఘటనను శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూచినది.

[వైదిక వాజ్ఞ్మమయంలో రెండే తారకములు. ఒకటి 'ఓం' కారం. రెందవది 'రామ' నామం. అష్టాక్షరిలోని అగ్నిబీజమైన 'రా' కారం, పంచాక్షరిలోని అమృతబీజమైన 'మ' కారం కలిపి తారకమైనది 'రామ' నామం. రామాయణాన్ని, రామనామాన్ని నమ్ముకొని సద్గతి పొందినవారు కోకొల్లలు. రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్య ఫలం.ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం చదవబడుతుందో, రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో, ఎప్పటిదాకా వినబడుతుందో అప్పటిదాకా మాత్రమే మానవాళి ఉంటుంది.]

శ్రీరామ రామేతి రమేరామే మనోరమే || సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

జానకీకాంత స్మరాణం జై జై రామ రామ