' రామనామం'
గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం, అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు! ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు! ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి! అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు!
పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.
అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు, పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు లాంటివన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్ల, ఆయనను భగవంతుడిగా కొలుస్తామంటారు కొందరు. భగవంతుడే ఒక నిండైన మహా వ్యక్తిగా అవతరించి, లోకానికి ఆరాధ్యుడయ్యాడని ఇంకొందరు చెబుతారు. ఈ రెండో అంశమే వాల్మీకాది మహర్షుల హృదయం.
ఆదర్శమూర్తి అయిన రాముడు నారాయణుడి అవతారంగా ఎందరికో ఆరాధ్యుడు. రావణాది రాక్షసుల వల్ల సడలిన ధర్మవ్యవస్థను చక్కదిద్దడానికి రుషులు, దేవతలు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మను ఉపాసించారు. జగతికి ఆనందం కలిగించడానికి ఆ పరమాత్మను మంత్రం, తపస్సు, సాధనలతో ఆరాధించారు. వాటి ఫలంగా భగవంతుడు రాముడిగా అవతరించాడు!
రామారాధన అంటే, అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భిన్న భాషల్లో భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య యింకా ఎందరో!
శ్రీరాముని పుట్టుక సమయంలో గ్రహబలం!
రామ జనన గాథలోనే విశేషం ఉంది! దాన్ని దేవ రహస్యం అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.
ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదు కోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు అంటే గట్టి నియమ పాలన గలవాడు శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ!
భారతజాతి గుండె చప్పుడుగా 'రామనామం' మోగుతూనే ఉంది. ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది. రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది!
భగవత్బందు మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!