Adsense

Showing posts with label Lalita devi. Show all posts
Showing posts with label Lalita devi. Show all posts

Saturday, April 1, 2023

లలితాదేవి



శ్రీ లలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే. లలితా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి ఈరోజుల్లో ఇంటింటా నిత్యపారాయణగా జరుపబడుతోంది. లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కరరాయులు మొదటి శ్లోకంగా శ్రీలలితను ప్రార్థించాడు. సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీమహారాజ్ఞిగా కొనియాడబడింది.

పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి, చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత.

ల – సర్వవిద్యలకు లక్ష్యమైనది,
లి – రూపము లేనిది,
త – సంసారం నుండి తరింపజేయునది, శ్రీలలిత.

శోభ, విలాసం,మాధుర్యం, గాంభీర్యం, స్థైర్యం, జేజం,అర్థం ” లాలిత్యం, ఔదార్యం – ఈ 8 పదాల “లలిత” పదములలో నిక్షిప్తం. చెరకుగడ ధనస్సుగా, కుసుమాలను అస్త్ర, బాణాలుగా ధరించి, ఉత్తమగుణాలు కలిగి, గణాతీతమైనది శ్రీలలిత. పంచబ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ సేవిస్తుంటారు. పంచ బ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం, చిత్క ళాసనం, వర్నాసనం – 10 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధిపతిన లలిత శ్రీమహారాజ్ఞి.

బ్రహ్మాండమే ఆమె మహా సామ్రాజ్యము. ఆ తల్లి రెప్పపాటులో కాలం పుట్టింది. విశ్వమంతా తానే అయి వృద్ధిక్షయాలు లేని పూర్ణస్వరూపం లలిత. అమ్మ చేతి గోళ్ళ నుండి దశావతారాలు ఆవిర్భావించాయట. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి, త్రిపుర సుందరగా కొలువబడుతోంది. సుషుప్తనాడులలోని శక్తి కనుక త్రిపురసుందరి. మనః, బుద్ధి, చిత్తాలలో వశించునది కనుక త్రిపురసుందరి.

విశ్వమంతా త్రితత్త్వాత్మికం. అందులో శక్తి కనుక త్రిపురసుందరి. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు దూర్వాసుడు – ఈ 12 మంది మహానీయుల పూజలందుకొంటున్న మహాపూజ్య.

ఆ తల్లికి 64 కళలూ ఉపచారాలే. 64 కోట్ల యోగినీగణంచే సేవింపబడు నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం – ఈ 5 ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచతన్మాత్రలు. ఈ ఐదు తనన్మాత్రాలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి.