Adsense

Showing posts with label Lord Rama's Ring. Show all posts
Showing posts with label Lord Rama's Ring. Show all posts

Tuesday, April 4, 2023

శ్రీ రాముని అంగుళీయకం Lord Rama's Ring



        శ్రీరాములవారు వారి అవతార పరిసమాప్త సమయంలో బ్రహ్మదేవుడు ఆయనను తమ అవతారం ఉపసంహరింపమని కోరడానికి కాలపురుషుని రాముని వద్దకు పంపుతాడు.

🌸శ్రీరాముడు కూడా తాను చెప్పిన “దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని” 11,000 సంవత్సరాల రాజ్యపాలన పూర్తి చేసి తన అవతార కార్యం పూర్తవ్వడంతో తన స్వధామమైన వైకుంఠం చేరడానికి అనువైన సమయం కోసం చూస్తూ వుంటారు.

🌸కాలపురుషుడు అయోధ్యలోకి ప్రవేశించాలంటే అందుకు ఆ నగరానికి కాపలాగా వున్న హనుమంతుల వారిని దాటి రావాలి.

🌸 హనుమంతుడు కావలి ఉన్నంతసేపు యముడు లోనికి రాలేడు.

🌸అందుకు శ్రీరాముడు తన అంగుళీయం తన భవనంలో ఉన్న  నేల పైన చిన్న బీటలోకి పడవేసి హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు.

🌸హనుమంతుడు కామరూపం ధరించి చిన్న కీటకం ప్రమాణంలో ఆ బిలంలోకి వెళ్తారు.

🌸వెళ్ళగా వెళ్ళగా పాతాళబిలం వద్దకు చేరుకుంటాడు.

🌸 అక్కడ వాసుకి ఆయనను గుర్తించి ఆయనను గౌరవించి వచ్చిన కార్యం గురించి అడుగుతాడు.

🌸శ్రీరాములవారి అంగుళీయం గురించి చెప్పి ఆ చోటు చూపమని అభ్యర్దిస్తాడు.

🌸అప్పుడు వాసుకి ఆయనను ఒక గుట్టలా ఉన్న ఉంగరాలున్న చోటు చూపించి అందులో రాముని ఉంగరం తీసుకోమని చెబుతాడు.

🌸శ్రీరాముని ప్రార్ధించి తీసిన మొదటి ఉంగరం అదృష్టవశాత్తు శ్రీరాముని ఉంగరంగా గుర్తించి ఆనందిస్తాడు.

🌸 వాసుకి మరొకటి చూడు అని చెప్పగా, అది కూడా అచ్చం శ్రీరాముని ఉంగరంలానే వుంటుంది.

🌸అలా అక్కడ గుట్టగా ఉన్న అన్ని ఉంగరాలు కూడా శ్రీరాముని ఉంగరాలే అని ఆశ్చర్యపోతున్న హనుమంతునికి చెబుతాడు వాసుకి.

🌸ఏమిటి ఈ మాయ స్వామీ వివరించండి అని ప్రార్ధించగా.. వాసుకి చెబుతాడు.

🌸ఇవన్నీ కూడా శ్రీరాముని ఉంగరాలే. ఇవన్నీ ప్రతీ కల్పంలో శ్రీరాముడు అవతార స్వీకారం చేస్తారు, ఆయన అవతార సమాప్తి సమయంలో ఒక ఉంగరం వచ్చి పడుతుంది, దాని వెతుక్కుంటూ ఒక మర్కటం వస్తుంది, ఇదే ప్రశ్న అడుగుతుందని, ఇప్పటికి ఎన్నో కల్పాలనుండి ఇదే..జరిగే తతంగం అని, రాబోయే రాముల ఉంగరాలు ఉంచే స్థలం  కూడా వుందని చెబుతాడు వాసుకి.

🌸శ్రీరాముడు అనంతుడు, అలా ప్రతీ కల్పంలోనూ ఇలా వస్తూ వుంటారు, వెళ్తుంటారు అని, ఇప్పుడు కాలుని ఆపడం, తద్వారా శ్రీరామ అవతార సమాప్తి ఆపే శక్తి హనుమంతునికి లేదని చెబుతాడు.

కాలం అనంతం.

🌸 అనాది నుండి ఈ కాలప్రవాహంలో ఎన్నో కల్పాలు వచ్చాయి పోయాయి, వస్తాయి..పోతాయి.. కూడా.

🌸కానీ ఎప్పటికీ ఆ పరబ్రహ్మం మాత్రమె శాశ్వతం. ఆయన లీలలు అనంతం.

🌸ఈ అనంతప్రవాహంలో ఎన్నో ప్రాణులు పుడతాయి గిడతాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి.

🌸పుట్టిన ప్రతీది కాలగర్భంలో కలవకమానదు, చివరకు అవతారం స్వీకరించిన పరబ్రహ్మ స్వరూపమైనా.

🌸ఈ కాల స్వరూపమే పరబ్రహ్మ, చివరకు అన్నీ ఆయనలోనే లీనమౌతాయి.
🌸ఇటువంటి  విషయం కేవలం మన సనాతనధర్మం మాత్రమె చెప్పింది. ఈ నాటకం నిరంతరం జరుగుతూ వుంటుంది. 🌸ఈ నాటకం రక్తి కట్టించడానికి స్వామీ కూడా ఒక పాత్ర ధరిస్తాడు, రంజింపచేస్తాడు, ధర్మాన్ని నిలుపుతాడు.

🌸జగన్నాటక సూత్రధారిని నమ్మి ఆయనను పట్టుకున్నవాడు హనుమంతుడిలా చిరంజీవిగా నిలబడతాడు.
🌸 ఈ కాలప్రవాహాన్ని దాటగల నావ కేవలం ఆయన మీద భక్తి ఆయనకు శరణాగతి చెయ్యడం.
🌸అందుకే కాలుడు ఆయన నామాన్ని పట్టుకున్న హనుమంతుడి వద్దకు వెళ్ళలేడు.
🌸 అటువంటి హనుమంతుని త్రికరణశుద్దిగా పట్టుకున్న భక్తులను అకాలమృత్యువు పట్టదు.

🌸అన్ని కాలాలలో రక్షించి ముక్తిని ఇచ్చే ఆ పరబ్రహ్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే మనల్ని ఉద్ధరించగలిగినవాడు.  అన్నమయ్య చెప్పినట్టు..
ఈ ఆదిమూలమే మనకు అంగరక్ష,
ఆ శ్రీదేవుడే మనకు జీవ రక్ష,
ఆ భూదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిరక్షా,
జలధిశాయి అయిన ఆయనే మనకు జలరక్ష,
అగ్నిలో ఉన్న యజ్ఞమూర్తి మనకు అగ్నిరక్ష, వాయుసుతుని ఏలినట్టి వనజనాభుడు మనకు వాయురక్ష,
పాదము ఆకాశమునకు చాచిన ఆ విష్ణువే మనకు ఆకాశరక్ష,
ఈ వెంకటాద్రి పైన ఉన్న ఈ సర్వేశ్వరుడే మనకు సర్వ రక్ష