Adsense

Showing posts with label Mysore Pak History. Show all posts
Showing posts with label Mysore Pak History. Show all posts

Thursday, January 9, 2025

Mysore Pak History: మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!


"మైసూర్ పాక్ " ఇష్టపడని వాళ్ళు , రుచి చూడని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరేమో. ఊరి పేరుతో పాపులర్ అయిన అతికొద్ది స్వీట్లలో మైసూర్ పాక్ ముఖ్యమైనది.

హిస్టారికల్ సిటీ మైసూర్ లో పుట్టిన మైసూర్ పాక్ ప్రజలందరికీ చేరువైన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పటికీ దీనిని కనిపెట్టిన చెఫ్ కుటుంబీకుల 5వ తరం మైసూర్ పాక్ తయారీ బిజినెస్ లోనే ఉండడం విశేషం.

మైసూర్ రాజుల అంతఃపురంలో పుట్టిన మైసూర్ పాక్

మైసూర్ పాక్ పాపులారీటీ చూసి ఇదేదో పురాతనమైన వంటకం అనుకుంటే పొరబాటే. గట్టిగా మాట్లాడితే ఈ స్వీట్ పుట్టి వందేళ్లు కూడా కాలేదు. మైసూర్ ను 1902 నుండి 1940 వరకూ పరిపాలించిన 24వ మహారాజు 4వ కృష్ణారాజ వడయార్ మంచి భోజన ప్రియుడు. ఆయన భోజనానికి కూర్చుంటే బోలెడన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన ముందు ఉండాల్సిందే. రాజ కుటుంబ అంతఃపురానికి "కాకాసుర మడప్ప " ప్రధాన వంటగాడు. ఒకసారి ఆయన తన మహారాజుకు ఒక కొత్త వంటకం రుచి చూపిద్దామని వంట గదిలోని అతి తక్కువ పదార్థాలు శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు కలిపి ఒక స్వీట్ తయారు చేసారు. దాని రుచి మహారాజుకు బాగా నచ్చడంతో దీని పేరు ఏంటని అడిగాడు. మడప్పకు ఏం చెప్పాలో తెలియక పంచదార "పాకం"లో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి దానితో పాటే తమ రాజ్యం మైసూరు కలిసి వచ్చేలా "మైసూరు పాక" చెప్పాడు. అదే తర్వాతి కాలంలో " "మైసూర్ పాక్" గా మారింది.

మహారాజు కృష్ణరాజు వడయార్ మైసూర్ పాక్ రుచి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ తెలియాలని తమ కోట " ప్యాలెస్ కు సమీపంలో " ఒక దుకాణం ఏర్పాటు చేయమని మడప్పకు సూచించారు. అలా రాజకుటుంబ ప్రధాన చెఫ్ మడప్ప 1935లో మొదలుపెట్టిన షాపే ఫేమస్ " గురు స్వీట్స్ ". వాడయార్లు ఈ స్వీట్ ను బ్రిటిషర్లకు గిఫ్ట్ గా పంపడం , వాళ్లకూ ఇది నచ్చడంతో మైసూర్ పాక్కు మరింత పాపులర్ కి వచ్చింది. మైసూర్ పాక్ స్వీట్ జనంలో ఎంతలా పాపులర్ అయిందంటే ఇండియా మొత్తం మీద ఈ స్వీట్ అమ్మని ఊరే కనపడదు.

అతి తక్కువ పదార్థాలతో అదిరిపోయే టేస్ట్

మైసూర్ పాక్ తయారీకి పదార్థాలు చాలా తక్కువ. పంచదార, నీళ్లు సమాన మోతాదు లో కలిపి పాకంలా తయారయ్యేంతవరకు వేడి చేస్తారు. పాకం సరైన స్థితికి చేరుకున్నాక దానిలో శనగపిండి కలిపి, పైన యాలకుల పొడి వేసి నెయ్యి రాసిన ప్లేట్లో పోసి కావలసిన షేప్ లో ముక్కలుగా కట్ చేస్తారు. అంతే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఈ మధ్య కాలంలో మైసూర్ పాక్ లో తమ తమ టేస్ట్ కు తగ్గట్టుగా రకరకాల ఫ్లేవర్లు కలుపుతున్నారు.

5 తరాలుగా మైసూర్ పాక్ బిజినెస్ లోనే "మడప్ప " వంశీకులు

మైసూర్ మహారాజు సూచనతో 90 ఏళ్ల క్రితం కాకాసుర మడప్ప ప్రారంభించిన "గురు స్వీట్స్" ఇప్పటికీ నడుస్తోంది. ఆయన కుటుంబంలోని ఐదవ తరం వారసులు ఈ షాపును నడుపుతున్నారు. వీరికి శివానంద, కుమార్ లు కుటుంబ పెద్దలుగా ఉన్నారు. ఈ 90 ఏళ్లలో మైసూర్ పాక్ లో చాలా వెరైటీలు వచ్చి చేరాయి. ప్రస్తుతం మడప్ప తయారుచేసిన ఒరిజినల్ మైసూర్ పాక్ తో పాటు మరో ఏడు ఫ్లేవర్ లలో ఈ స్వీట్ ను తయారు చేస్తున్నారు.

మైసూర్ ప్యాలెస్ దగ్గర్లోని దేవరాజ మార్కెట్లో సయ్యాజి రావు రోడ్ లో ఈ గురు స్వీట్ షావు ఉంటుంది. ఉదయం నుండి రాత్రి 10 వరకూ తెరిచి ఉంచే ఈ షాప్ ముందు కస్టమర్ల తో పెద్ద క్యూలైనే ఉంటుంది. అలాగే మైసూర్ కు వచ్చే టూరిస్టులు మైసూర్ ప్యాలెస్ తో పాటు గురు స్వీట్స్ షాప్ ను కూడా సందర్శించి మైసూర్ పాక్ ను కొనుక్కుని వెళుతూ ఉంటారు. "మైసూర్ పాక్ లో మైసూర్ ఉంటుందా " అనే ఓ సరదా సినిమా డైలాగ్ బాగా పాపులర్. అది నిజమే కానీ " మైసూర్ పాక్ మాత్రం మైసూర్ లోనే పుట్టిందనేది "అసలు వాస్తవం.